Published On: Sat, Aug 31st, 2013

పసిడి దిగుమతి టారిఫ్ విలువ పెంపు

Share This
Tags

ప్రభుత్వం శుక్రవారం పసిడి, వెండి దిగుమతి టారిఫ్ విలువను పెంచింది. దీని ప్రకారం ఇప్పటి వరకూ 10 గ్రాములకు 432 డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతి టారిఫ్ విలువ 461 డాలర్లకు పెరిగింది. వెండికి సంబంధించి ఈ విలువ 697 డాలర్ల నుంచి 803 డాలర్లకు చేరింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఎటువంటి అవకతవకలకూ వీలులేకుండా దిగుమతి చేసుకునే మెటల్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువే ప్రాతిపదికగా ఉంటుంది.

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సహజంగా 15 రోజులకు ఒకసారి ఈ రేట్లపై అధికారుల సమీక్ష ఉంటుంది. ఇదిలావుండగా, ముంబైసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు శుక్రవారం వరుసగా రెండవరోజు కూడా రికార్డు స్థాయిల నుంచి కిందకు దిగొచ్చాయి.

పసిడి కాంట్రాక్ట్‌ల మార్జిన్లు పెంపు
అన్ని రకాల గోల్డ్ ఫ్యూచర్స్‌లో ప్రాథమిక మార్జిన్లను 1%మేర పెంచుతున్నట్లు కమోడిటీ మార్కెట్ల నియంత్రణ ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్‌ఎంసీ) తెలిపింది. దీంతో ఇవి ప్రస్తుత 4% నుంచి తాజాగా 5%కు పెరిగాయి. కొత్త మార్జిన్లు సెప్టెంబర్ 2 నుంచి వర్తిస్తాయని ఎఫ్‌ఎంసీ పేర్కొంది. గోల్డ్ కాంట్రాక్ట్‌ల విలువపై 5% మార్జిన్లను అమలు చేయాల్సిందిగా అన్ని ఎక్స్ఛేంజీలకూ ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్న నేపథ్యంలో జాతీయస్థాయి ఎక్స్ఛేంజీలు నిర్వహించే అన్ని రకాల గోల్డ్, సిల్వర్, బ్రెంట్ క్రూడ్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కాంట్రాక్ట్‌లపై 5% అదనపు మార్జిన్లను సైతం విధిస్తున్నట్లు వెల్లడించింది.

About the Author