పన్నుకు మందు… లాభాల్లో ముందు
ఆదాయపు పన్ను కాస్తయినా తప్పించుకోవడానికి, తగ్గించుకోవడానికి రకరకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలున్నాయి. కానీ వెనకా ముందూ చూడకుండా ఎంచుకుంటే అటు పన్ను తగ్గినా ఇటు పెట్టుబడిపై నష్టం వచ్చి చేతులు కాలటం ఖాయం. అందుకే అన్నీ చూడాలి. కాలపరిమితి తక్కువగా ఉండటంతో పాటు ఇచ్చే లాభం ఎక్కువగా ఉండే ఇన్వెస్ట్‌మెంట్‌నే ఎంచుకోవాలి. అలాంటివి ట్యాక్స్ సేవింగ్ ఫండ్లు మాత్రమే. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీంలుగా (ఈఎల్‌ఎస్‌ఎస్) పిలిచే వీటికి డిమాండ్ కూడా ఎక్కువే. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే లాభమేంటో, ఎలాంటి ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలో, ఎలా చేయాలో చెప్పే కథనమే… ఈ వారం ‘ప్రాఫిట్’ లీడ్ స్టోరీ.
పన్ను భారం తగ్గించుకోవటానికైనా, తప్పించుకోవటానికైనా పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, బీమా, పోస్టాఫీసు వంటి అనేక పథకాలున్నాయి. కానీ ఒకవైపు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం… మరోవంక ఆ ఇన్వెస్ట్‌మెంట్లపై పన్ను ప్రయోజనాలు పొందటం… ఈ రెండింటినీ ఏకకాలంలో అందించేవి మాత్రం ట్యాక్స్ సేవింగ్ ఫండ్లే. మిగిలిన పథకాలతో పోలిస్తే వీటి లాకిన్ పీరియడ్ కూడా అతి తక్కువ. ఉదాహరణకు పీపీఎఫ్ కాలపరిమితి 15 ఏళ్లు. బ్యాంకు డిపాజిట్లు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ వంటివైతే కనీసం ఐదేళ్లు వేచి చూస్తే తప్ప పన్ను ప్రయోజనాలు అందవు. బీమా పథకాలు కూడా దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలే. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల లాకిన్ పిరియడ్ మాత్రం కేవలం మూడేళ్లు. అంటే ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాత ఎప్పుడైనా వైదొలగొచ్చునన్న మాట. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా లక్ష రూపాయల వరకు ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి… ఆ మేరకు పన్ను తగ్గించుకోవచ్చు.
ఎలా పని చేస్తాయి?
మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఈ ఫండ్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. అయితే వీటి నుంచి మూడేళ్ల లోపు వైదొలిగే అవకాశం లేదు. కాబట్టి స్టాక్‌మార్కెట్లో దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్లపై వచ్చే లాభాలు ఇన్వెస్టర్లకు అందుతాయనే చెప్పాలి. ఫండ్ మేనేజర్లు కూడా దీర్ఘకాలిక దృష్టితోనే సరైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకు గత ఏడాది కాలంలో వివిధ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ 18 నుంచి 20 శాతానికిపైగా రాబడిని అందిస్తే ఇదే సమయంలో ప్రధాన ఇండెక్స్‌లు 16 శాతం రాబడినే అందించాయి. వీటి రాబడులు పూర్తిగా స్టాక్ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి కనక ఒకోసారి నష్టం కూడా రావచ్చు. అయితే దీర్ఘకాలం కనక లాభాలకే ఆస్కారమెక్కువ.
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలూ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా ఫండ్ హౌస్‌లు లేదా ఆన్‌లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా దగ్గర్లోని మ్యూచువల్ ఫండ్ ఏజెంట్‌ను సంప్ర దించవచ్చు. వీటిలో ఒకేసారిగా… లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతినెలా ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కొత్త పెట్టుబడి కింద భావించి అక్కడ నుంచి 3 సంవత్సరాలు వేచి చూడాలి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి.
ప్రయోజనాలు
గరిష్టంగా లక్ష రూపాయలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పథకాలు అందించే డివిడెండ్లపై ఎటువంటి పన్ను భారం ఉండదు. మూడేళ్ల లాకిన్ ిపీరియడ్ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వైదొలగొచ్చు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు. అపరిమిత రాబడి కనక ద్రవ్యోల్బణానికీ (పెరిగే ధరలకు) మందు.
లోపాలు
ఈ రాబడులపై ఎలాంటి హామీ ఉండదు. స్టాక్‌మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి కనక ఒకోసారి నష్టమూ రావచ్చు.
గడిచిన ఏడాదిలో లాభాలిచ్చిన కొన్ని పథకాలు… – లాభం శాతం
యూనియన్ కేబీసీ ట్యాక్స్ సేవర్- 20.46
యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ- 19.19
ఎడల్‌వైజ్ ఈఎల్‌ఎస్‌ఎస్ -18.31
ఐడీఎఫ్‌సీ ట్యాక్స్ అడ్వాంటేజ్- 17.31
డీడబ్ల్యూఎస్ ట్యాక్స్ సేవింగ్- 17.24