హోలీ పండుగలో తీసుకోవలసిన జాగ్రత్తలు…
హోలీ పండుగ అంటే చిన్నాపెద్దా అందరికీ ఉత్సాహమే. ఒకవైపు రసాయన రంగులు…మరోవైపు కరోనా ఆందోళనలతో హోలీలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. హోలీ అంటే భాగ్యనగరంలో ఎంతో సందడి. వందల మంది ఒకేచోట గుమిగూడుతుంటారు. కొన్ని ఈవెంట్ సంస్థలు రెయిన్ డ్యాన్సులు ఏర్పాటు చేస్తాయి. ఇందులో కూడా కుటుంబాలతో సహా పాల్గొనడం సాధారణమే. ఎక్కువ మంది గుమిగూడిన చోట వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని, ఒకవేళ కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తి గుంపులో ఉంటే…తుమ్ములు, దగ్గు ద్వారా సమీపంలో ఉండేవారిని తాకి వారిలో కూడా వైరస్ చేరుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా హోలీలో వాడే రంగులు కూడా చాలా ప్రమాదకరమైనవని, సింథటిక్ రంగుల్లో వివిధ రసాయనాలు కలుస్తాయని, ఇవి కళ్లల్లో పడితే కొన్నిసార్లు చూపు పోయే ప్రమాదం ఉందని నేత్ర వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ రకాల పూలు, కూరగాయలు, పసుపు లాంటివి ఎండబెట్టి వాటితో తయారు చేసిన రంగులతో హోలీ జరుపుకోవడం సురక్షితమన్నారు. హోలీ తర్వాత పలువురు నేత్ర సమస్యలతో సరోజనిదేవి నేత్ర వైద్యశాలను సంప్రదించిన సంఘటనలు గతంలో ఉన్నాయి.
ఇవి తప్పనిసరి…
మన కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వీటిపై రంగులు పడితే అది కమిలిపోయి ఆ ప్రభావం కంటి చూపుపై పడుతుంది. హోలీ పండుగ కోసం బయటకు వెళ్లే ముందు కొబ్బరి, బాదం నూనెలను కళ్లచుట్టూ రాసుకున్న తర్వాతే బయటకు వెళ్లాలి.
ఒకవేళ కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, పుసులు కట్టడం, దురద, రక్తం కారటం లాంటి లక్షణాలు కన్పిస్తే…నిర్లక్ష్యం చేయకుండా తక్షణం నిపుణులైన నేత్ర వైద్యులను సంప్రదించాలి.
కంటిలో రంగులు పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎవరైనా రంగులు వేస్తే కళ్లు, పెదాలు గట్టిగా మూసి వేయడం ద్వారా కొంత ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
కళ్లల్లో రంగులు పడితే ఎట్టి పరిస్థితిలో నలపకూడదు. ఇలా చేయడం వల్ల నేత్రాలకు మరింత నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు చూపు కోల్పోయే అవకాశం ఉంది.
వాటర్ బెలూన్స్‌కు దూరంగా ఉండాలి. వీటితో కళ్లలోకి కొట్టడం ద్వారా ఎక్కువ గాయాలవుతాయి. కొన్నిసార్లు కళ్లల్లో రక్తస్రావం జరుగుతుంది. కటకాలు దెబ్బతినడం, స్థానభ్రంశం చెందడం, రెటీనా దెబ్బతినే ముప్పు ఉంటుంది. కళ్లల్లో చిక్కుకున్న పదార్థాలను చేతి రుమాలు, టిష్యూ పేపర్ ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తే అది మరింత నష్టాన్ని చేస్తాయి.
హోలీలో పాల్గొంటే కాంటాక్ట్ లెన్స్‌లు వాడక పోవడం ఉత్తమం. కొన్ని లెన్స్‌లు నీటిని పీల్చుతాయి. ఇవి కంటిలో చిక్కుకుపోతే అలర్జీలు, అంటు వ్యాధులు, చూపునకు నష్టం చేసే అవకాశం ఉంది.
ప్రమాదవశాత్తు కంటిలో రంగు పడితే ముఖాన్ని కిందకు దించి కళ్లను తెరిచేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో కళ్లల్లో నీళ్లు కొట్టకూడదు. ఇది మరింత ప్రమాదానికి దారితీస్తుంది. దోసిట్లో నీటిని తీసుకొని అందులో ముఖం పెట్టి కళ్లను నెమ్మదిగా తెరవాలి.
Key words :We mustbe Avoid allergies or infection while you play with colours this Holi. Take care of your face, your eyes and your hair.