Published On: Thu, Mar 5th, 2020

వాల్మీకి మహర్షి రామాయణంలోని కొన్ని సంభాషణలు…

Share This
Tags

వాల్మీకి మహర్షి రామాయణం అనే కావ్యం ద్వారా పాత్రల సంభాషణల లోనూ సన్నివేశాల కల్పనలోనూ ధర్మాన్ని సంపూర్ణంగా రంగరించి అందిచారు. జీవితం యొక్క విలువను కూడా తెలియజేసారు3. రామాయణం ప్రపంచానికి అందిస్తున్న సందేశాలలో ప్రథమమైనది, ప్రధానమైనది జీవితం యొక్క విలువని చెప్పడం. సృష్టిలో అన్నింటికంటే గొప్ప విలువైన సంపద జీవితం. అది ఉంటేనే అన్నీ ఉంటాయి. అందుకే అన్నమయ్య ఒకమాట అంటారు – ‘ముందు తా గలిగితే మూడు లోకములు – ముందు నువ్వుంటే ముల్లోకములు”. మనమే లేనప్పుడు ఏ లోకం ఎలా ఉంటే ప్రయోజనం ఏమున్నది? అందుకే ముందు మనం ఉండాలి. కాపాడుకోవలసినది జీవితాన్ని. ఆ తర్వాతే మిగిలినవన్నీ కూడా. అయితే ఒక్కొక్కప్పుడు మనకి నిరాశ ఎదురైనప్పుడో, ఆశాభంగం కలిగినప్పుడో, జీవితంలో దుఃఖం తీవ్రమైనప్పుడో వెంటనే శరీరం చాలించాలి అనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది. ప్రతివారికీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. కొందరు ఆవేశపరులు వెంటనే మరణించే ప్రయత్నం చేస్తారు. అది ఆత్మహత్యాప్రయత్నం అని. అలాంటి సమయంలో వాల్మీకి రామాయణంలో ఇచ్చిన కొన్ని వాక్యాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలాంటి వాక్యాలు ఎప్పుడూ స్ఫురణకు ఉండేలా పిల్లలకు పెద్దలు అందించాలి.
అందులో ఒక వాక్యం అత్యద్భుతమైన సుందరకాండలో వస్తుంది. ఇది హనుమంతుడు తన భావనలో అనుకుంటున్నటువంటి మాట. వాల్మీకి రామాయణంలో, సుందరకాండలో రమణీయమైన ఒక వాక్యం ఇది. మనిషి అన్నవాడికి పనికివచ్చే గొప్ప మాట ఇది.
“వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి” ఇది మహావాక్యంగా భావించవచ్చు. ‘వినాశే బహవో దోషాః’ – నశించిపోవడంలో అన్ని దోషాలూ ఉన్నాయి. ‘జీవన్ భద్రాణి పశ్యతి” – బ్రతికి ఉన్నవాడే భద్రాలను చూడగలడు. ఇది దీనియొక్క భావం. మనం ఊహించని దుఃఖం కలిగింది. ఎవరూ దుఃఖాలను ఊహించరు, ఆశించరు. కానీ వస్తూ ఉంటాయి. ఆశించకుండా దుఃఖం ఎలా వచ్చిందో ఆశించకుండా సుఖం కూడా తప్పకుండా వస్తుంది. దుఃఖం కలిగినప్పుడు వెంటనే జీవితం నశించిపోవాలి అనుకోకూడదు. మళ్ళీ వచ్చే సుఖం కోసం బ్రతకాలి. నశించిపోతే అన్నీ నశించిపోతాయి. బ్రతికి ఉంటే ఎప్పటికైనా భద్రాలు చూడగలడు. అది ఈ వాక్యంలో ఉన్నటువంటి భావం. భద్రం అంటే మంగళం, శుభం. శుభం కోసం బ్రతకాలి.
ఇదే వాక్యాన్ని సీతమ్మ నోట కూడా పలికిస్తారు సుందరకాండలో. ఆ సందర్భం ఏమిటి అంటే ఎప్పుడైతే రావణాసురుడు అమ్మవారితో బెదిరింపు మాటలాడి రెండు నెలలు గడువు విధించి వెళ్ళిపోతాడో వెంటనే ఆ అశోక వృక్షం క్రింద ఉన్నటువంటి సీతమ్మ చుట్టూ చేరిన రాక్షసి మూక నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. కఠోరంగా అమ్మవారి మనస్సు బాధ పెట్టేటట్లు మాట్లాడతారు. అటుతర్వాత తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పి వాళ్ళందరినీ మందలించి నిద్రపొమ్మని చెప్తుంది. వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో సీతమ్మ ఉరి పోసుకుందాం అనుకుంటుంది. ఎందుకంటే పది నెలలైంది ఇక్కడ బంధింపబడి. పది నెలలలో జరుగని అద్భుతం రెండు నెలలలో జరుగుతుందా? జరుగదు. కాబట్టి రాముడు నన్ను అనుగ్రహించడానికి అవకాశం లేదు అని సీతమ్మ బాధపడి అప్పటికి ఉన్న పరిస్థితులలో సమీప గతంలో జరిగిన ఘటనలను బట్టి ఆ తల్లి జీవితం చాలించాలి అనుకుని విశాలమైన తన జడతో మెడకి బిగించుకుని చెట్టుకొమ్మనుంచి ఉరి తీసుకుందాం అనుకుంటుంది. అటు తర్వాత హనుమంతుడు అమ్మవారికి రామకథ వినిపిస్తాడు. తరువాత ఎదురుగా నిలబడతాడు. అమ్మవారిని ఓదార్చుతాడు. అప్పుడు అమ్మకి ధైర్యం వస్తుంది. పది నెలలుగా రాని రామునియొక్క మాట, ఇప్పుడు వచ్చింది. అందుకే మనం ఎన్నాళ్ళు వేచి చూచినా సుఖం జరగట్లేదే అని తొందర పడి పోకూడదు అని ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అప్పుడు సీతమ్మ ఒక మాట అంటుంది – ‘హనుమా! నీమాట వినబడడం నాకు ఒక్క క్షణం ఆలస్యమైనా నేను మరణించేదానినే. ఆ సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావు గనుక, నీమాట విన్నాను గనుక నేను జీవించగలిగాను. ఆ క్షణమే తొందరపడి ఉంటే ఇప్పుడు బ్రతికే దానిని కాదు కదా అంటూ ఒక మాట అంటుంది తల్లి.
“ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి” – ‘బ్రతికి ఉంటే నూరేళ్ళకైనా మానవుడు ఆనందాన్ని పొందగలడు’. అది ఆశావాదం అంటే. నూరేళ్ళకైనా అంటే మరణించేలోపల తప్పకుండా ఆనందాన్ని పొందగలవు. అందుకే ఎట్టి పరిస్థితులలోనూ కూడా జీవితం చాలించాలి అనుకోకూడదు. మనం ఒక తలుపు మూసుకుపోయిందే అని బాధపడతాం. కానీ మనకు తెలియకుండా పది తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆశావాదం చాలా అవసరం. ముఖ్యంగా యువత ఈ వాక్యాలకి కట్టుబడి ఉండాలి. అంతేకానీ పరీక్షలలో గొప్ప ఫలితం రాలేదనో, అనుకున్నటువంటి ఉద్యోగం రాలేదు అనో, తొందరపడి శరీరాన్ని చాలించాలి అనుకోకూడదు. ఎందుకంటే జీవితం అంటే ఒక ఉద్యోగమో, ఒక పరీక్షో కాదు. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ జీవితంలో. ఎంతో విశాలమైన ప్రపంచం ఉన్నది. ఎంతో విస్తృతమైన కాలం ఉన్నది. మనకంటూ మంచిరోజు వస్తుంది. మంచిని సాధించగలం అని ఒక ఆశావాద దృక్పథం ఏర్పరచుకోగలగాలి. ఫలితం దూరమౌతున్నకొద్దీ నిరాశ ఎదురవుతూ ఉంటే హనుమంతుడు గొప్ప మాట అంటాడు. “నిరాశ పడకూడదు, జీవించాలి, జీవించాలి, జీవించాలి” ఇది ఒక్కటే తెలుసుకోవాలి. అన్నింటికంటే విలువైనది బ్రతుకు. ఆ బ్రతుకు ఉంటేనే ఇహమూ సాధించగలం, పరమూ సాధించగలం, పరమార్థమూ సాధించగలం. ఏమి సాధించాలన్నా ఉండవలసింది జీవితం, దానిని రక్షించుకోవడమే నిజమైన సాధన.

Key words: according to valmiki ramayana Hanuman meets Sita in the Ashoka Vatika or Ashoka wood in Lanka. This meeting of Hanuman with Sita has been described in the Sundara Kanda of the great epic Ramayana.

About the Author