‘నల్లధనం’పై ఎన్డీయే రాజకీయ చిత్తశుద్ధి ఎంత..?
నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చిరాగానే నల్లధనంపై సిట్‌ను నియమించారు. తొలి కేబినెట్ లోనే ఈ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం మంచిదే అయినా.. విదేశీ బ్యాంకుల్లో పోగైన అక్రమ డబ్బును దేశానికి రప్పించడంలో రాజకీయ చిత్తశుద్ధిపైనే ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు.. యూపీఏ తీసుకున్న చర్యలు, ఈడీ సాధించిన పురోగతి అద్దంపడుతున్నాయి. అవినీతిపై చర్యలంటూనే అనేక కుంభకోణాలకు కారణమైంది. చర్యల పేరుతో పదేళ్ల కాలాన్ని గడిపేసింది. యూపీఏ తరహాలోనే.. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా పారిశ్రామికవేత్తల సాయంతో గద్దెనెక్కింది. దీంతో ఎన్డీయే కూడా యూపీఏ విధానాలనే అనుసరిస్తుందన్న అనుమానమూ లేకపోలేదు. మరి ఈ నేపథ్యంలో.. విదేశాల్లో ఉన్న నల్లధనం దేశానికి వస్తుందా..? నల్లధనంపై ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ చిత్తశుద్ధి ఎంత..? అనే ప్రశ్నలు ఇప్పుడు దేశమంతా ఆసక్తిర చర్చకు దారితీస్తున్నాయి.
యూపీఏ చర్యలు శూన్యం…
విదేశీ బ్యాంకుల్లోనూ.. పన్నులు లేని దేశాల్లోనూ మూలుగుతున్న నల్లడబ్బును దేశానికి రప్పిస్తామని దశాబ్ధాలుగా పాలకులు హామీలిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కపైసా దేశానికి వచ్చింది లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టినట్టు కనిపించినా.. చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. 18 మంది పేర్లును కోర్టుకు అందజేసినా.. తీసుకున్న చర్యలు అంతకన్నా లేవు. కొందరిపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. కానీ విదేశాల్లో ఉన్న డబ్బును దేశం దాకా తీసుకరాలేకపోయింది.
ఈడీ చేయలేంది.. సిట్ చేస్తుందా…?
ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే జస్టిస్ షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం వేసింది. ఇది దేశ ప్రజల్లో మరోసారి నల్లధనంపై చర్చకు ఆస్కారమిచ్చింది. అదే సమయంలో ఈడీ చేయలేనిది.. సిట్ ఏం చేస్తుందన్న అనుమానాలనూ కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందుగా విదేశాల నుంచి నల్లడబ్బు తీసుకరావాలంటే రాజకీయ చిత్తశుద్ధి అవసరం అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో లోపించింది కూడా అదే. ఇప్పుడు ఎన్డీయేపై కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
నల్లధనం మిత్రులపై మోడీ చర్యలు తీసుకుంటారా…?
దేశంలో పారిశ్రామిక వేత్తలు, బడాబాబులకు చెందిన డబ్బే విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోంది. హవాలా రూపంలో చేరిన రాజకీయ నేతల డబ్బు భద్రంగా అక్కడ ఉంది. ఇటీవల ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చుపెట్టిన వారిలో వీరున్నారన్న విమర్శలూ ఉన్నాయి. పార్టీలకు ఆర్థిక సాయం చేసిన కంపెనీలున్నాయి. కార్పొరేట్ వర్గం మొత్తం మోడీ అధికారంలోకి రావాలని ఆరాటాన్ని ప్రదర్శించింది. మరి వారి అండదండలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే.. విదేశాల్లో మూలుగుతున్న పెద్దల అక్రమాల తేనెతుట్టెను కదపగలదా..? అంత ధైర్యం చేస్తుందా..? వాస్తవానికి ఈ కేసులో చాలామంది పెద్దల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో మోడీ మిత్రులు కూడా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. కోల్‌గేట్ స్కామ్‌లో కుమార మంగళం బిర్లా పేరు ఛార్జిషీట్‌లో చేరిస్తేనే.. దేశ ఆర్ధిక రంగం మొత్తం నాశనమైందన్న సంకేతిలిచ్చిన కార్పొరేట్ వర్గం ఈ కేసులో పెద్దల పేర్లు బయటపడుతున్నాయంటే ఇంకెంత యాగీ చేస్తారో..మరి. ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం ఖాయం. ఇవన్నీ దాటుకుని మోడీ సర్కార్ రాజకీయ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుందా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
కోర్టు జోక్యంతో పురోగతిపై ఆశలు…
ఇన్ని అనుమానాల మధ్య కూడా సిట్‌పై ప్రజల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అందుకు కారణం.. కోర్టు జోక్యం చేసుకోవడం. న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఏర్పడ్డ ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం ఎప్పటికప్పుడు నివేదికలను కోర్టుకు అందజేస్తుంది. దీంతో కేసు పురోగతి ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. నల్లధనాన్ని దేశానికి రప్పించడంలో సిట్ పురోగతి సాధిస్తుందని ప్రజల్లో కాస్త ఆశలు చిగిరిస్తున్నాయి. మరి సిట్.. ప్రజల ఆశలను నీరుగారుస్తుందా..? నిలబెడుతుందా..? వేచిచూడాలి.