Published On: Wed, Jun 4th, 2014

రాహుల్..ప్రతిపక్షంలోనైనా రాణిస్తారా ?

Share This
Tags

ప్రధాని కావాలని కలలు కన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరిపించలేకపోయారు. ఆఖరుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఎలా వ్యవహరిస్తారు ? కనీసం ప్రతిపక్షంలోనైనా రాణించగలరా ? సహచర ఎంపీలకు స్పూర్తినిచ్చే విధంగా వ్యవహరిస్తారా ? అనే అంశాలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
అంత పెద్ద సభలో కేవలం 44 మందే ఎంపీలు…
లోక్ సభలో 543 మంది సభ్యులు ఉంటారు. కాంగ్రెస్ కు కేవలం 44 మంది ఎంపీలే ఉన్నారు. కాంగ్రెస్ ఇంతటి ఘోర పరాజయం కావడం ఇదే మొదటిసారి. మళ్లీ లేచి నిలుబడుతామన్న ఆత్మవిశ్వాసం ఆ పార్టీ నాయకుల్లో కనిపించడం లేదు. అంత పెద్ద సభలో ఆయన వెంట వున్నది ఇప్పుడు కేవలం 44 మంది సభ్యులే. వీరిలో ఎంతమందికి వివిధ సబ్జెక్ట్ లపై అవగాహన వున్నదో అనుమానమే. అధికారంలో వున్నన్నాళ్లూ పార్లమెంట్‌ సమావేశాలకు సక్రమంగా హాజరుకాని రాహుల్‌ పార్లమెంటరీ వ్యవహారాల మీద, సంప్రదాయాల మీద పట్టు సాధించి వుంటారంటే నమ్మలేం. అతి తక్కువ సభ్యులున్న కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో అధికార పక్షాన్ని సమర్ధంగా ఎదుర్కోగలగాలంటే రాహుల్‌గాంధీ ప్రతిరోజూ చాలా హోం వర్క్ చేయాల్సి వుంటుంది. కానీ, రాహుల్‌కు అంత ఓపిక వున్నదా? అన్నదే ప్రశ్న. ఇన్నాళ్లూ అధికార పక్షం సీట్లో కూర్చొని ఇవాళ్టి నుంచి ప్రతిపక్షం సీట్లలో కూర్చుంటున్న రాహుల్‌ ఇకనైనా చురుకుగా వ్యవహరిస్తేనే ఆ పార్టీకి ఎంతో కొంత భవిష్యత్‌ వుంటుంది.
రాహుల్ లో ఉత్సాహం కరువైంది..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ ను అందరూ యువ నాయకుడు అంటూ పొగడుతుంటారు. కానీ ఎక్కడా కూడా ఆయనలో ఉత్సాహం ఉన్నట్లు కనిపించదు. తమ చెప్పుచేతల్లో పనిచేసే వ్యక్తే ప్రధానిగా వున్నా దేశ ప్రజల ప్రయోజనాలను కాంక్షించి రాహుల్‌ గాంధీ చేసిన మంచి పని ఒక్కటంటే ఒక్కటీ లేదు. కనీసం ఆయన సొంత నియోజకవర్గం అమేధిలో సైతం అభివృద్ధి పనులు చేయించలేకపోయారు. నియోజకవర్గాలకు వచ్చే నిధుల్లో సగభాగం కూడా సమర్ధవంతంగా ఖర్చు చేయించలేకపోయారు.
ఆయన హాజరు 43 శాతం..
పార్టీ అధికారంలో వున్న రోజుల్లో కనీసం పార్లమెంట్‌ ముఖం చూసే తీరిక ఓపిక కూడా రాహుల్‌గాంధీ లేకుండా పోయాయి. గత లోక్‌సభలో పార్లమెంట్‌ సభ్యుల సగటు హాజరు శాతం 76 వుంటే, ఆయన హాజరు శాతం 43కే పరిమితమైంది. ఆయన చర్చల్లో పాల్గొన్నదీ లేదు. కేవలం రెండే రెండు సార్లు ఆయన లోక్‌పాల్‌ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. అంతకు మించి ఆయన లోక్‌సభలో నోరు తెరిచి మాట్లాడింది లేదు.
పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టని రాహుల్…
గత పదేళ్లకాలంలో పార్టీని పటిష్టం చేసుకోవడానికి రాహుల్‌కు చాలా అవకాశాలే వచ్చాయి. 2007లో పార్టీ జనరల్‌ సెక్రటరీగా నియమితుడైన రాహుల్‌గాంధీ పార్టీ నిర్మాణం మీద ఏ కోశానా శ్రద్ధ పెట్టలేదు. పార్టీకి వెన్నుముకగా నిలిచే యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ లాంటి విభాగాల్లో కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నాలేవీ చేయలేకపోయారు. విభిన్న సామాజికవర్గాల నుంచి కొత్త తరాన్ని సమీకరించేందుకు ఆయన ఏ మాత్రం శ్రద్ధ పెట్టినా ఇంతటి ఘోర పరాభవం ఎదురయ్యేది కాదేమో.
రాహుల్ ఏం చేయాల్సి ఉంటుంది..
తాను చురుకుగా వుంటేనే సరిపోదు తన పార్టీ ఎంపీలనూ ఉత్సాహపరచాల్సి వుంటుంది. ఇతర పార్టీల ఎంపీలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించాల్సి వుంటుంది. పార్టీ ఎంపీలకీ, ఇతర నేతలకీ అనుక్షణం అందుబాటులో వుంటూ మీకు నేనున్నానే భరోసాను కల్పించాల్సి వుంటుంది. లోక్‌సభలో శవపేటిక మీద కూర్చున్న కాంగ్రెస్‌ పార్టీకి రాజ్యసభలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సభ్యులున్నారు. కొన్ని ఆర్థిక బిల్లులకు రాజ్యసభ ఆమోదం అత్యంత కీలకం కాబోతోంది. అయితే, రాహుల్‌ ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోగలరా? అన్నదీ ప్రశ్నే. అప్పుడెప్పుడో ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా వుందంటూ వ్యాఖ్యానించిన రాహుల్‌ ఇప్పటికైనా నేర్చుకోవడానికి సిద్ధంగా వున్నారా?
నాయకత్వాన్ని అప్పగిస్తారా ?
ఇవాళ్టి నుంచి రాహుల్‌ సామర్థ్యానికి మరో పరీక్ష ఎదురవుతోంది. ఆ పరీక్షలో పాసవ్వడానికి పట్టుదలతో ప్రయత్నిస్తారో, పార్టీ నాయకత్వాన్ని సమర్ధులకు అప్పగించి, తాను గుడ్‌బై చెప్పేస్తారో నిర్ణయించుకోవాల్సింది రాహులే.

About the Author