Published On: Fri, Apr 4th, 2014

ఓటుపై అవగాహన కల్పించాలి

Share This
Tags

జిల్లాలోని ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ సమావేశమందిరంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో స్వీప్ కార్యక్రమంపై సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతానికి మించి ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సాధారణ ఎన్నికల వరకు రంగోళి, బతుకమ్మ, ఓటర్ బోనాలు, పుష్పాలంకరణ, తదితర కార్యక్రమాలు చేపట్టాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఎథికల్ ఓటింగ్‌పై అవగాహన కల్పించాలని, జిల్లాలో అన్ని ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఓటింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆటల పోటీలు, 2కే,3కే రన్‌లు నిర్వహించాలని, ఎల్‌పీజీ సిలిండర్లపై స్వీప్ సందేశాలున్న స్టిక్కర్లను అతికించాలన్నారు. కరీంనగర్, రామగుండం నగరాలతో పాటు ఇతర పట్టణ కేంద్రాల్లో ఓటు విలువ తెలుపుతూ గ్యాస్ బెలూన్లను ఏర్పాటు చేయాలన్నారు.

పోలింగ్‌కు ఒక రోజు ముందు ఓటర్లకు మొబైల్ ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలను పంపాలన్నారు. సినిమా థియేటర్లలో, స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌ల ద్వారా లఘు చిత్రాలు, స్లైడ్ షోలు ప్రదర్శింపజేయాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ నంబ య్య, జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య పాల్గొన్నారు.

About the Author