Published On: Thu, Jul 17th, 2014

సోనియా, రాహుల్ లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో గూడుపుఠాని..

Share This
Tags

ఇప్పటికే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ కు మరో దెబ్బ పడనుందా..? మున్ముందు కాంగ్రెస్‌ పార్టీకి సోనియాగాంధీ తిరుగులేని నేతగా కొనసాగగలరా..? సోనియా, రాహుల్‌గాంధీ పార్టీలో అవమానకర పరిస్థిలుతులు ఎదుర్కోవాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకు ఊతం పోస్తూ సోనియా, రాహుల్‌గాంధీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో ఓ వర్గం పావులు కదుపుతున్నదనే ప్రచారం జరుగుతోంది.
చాపకింద నీరులా..
ఘోర పరాజయం తర్వాత కూడా సోనియాకు వ్యతిరేకంగా ఎవరూ బహిరంగంగా పల్లెత్తు మాట అనడం లేదు. పార్టీ ముఖ్యనేతలంతా ఇప్పటికీ ఆమె పట్ల గౌరవ భావమే ప్రకటిస్తున్నారు. పార్టీని విజయపథాల వైపు నడిపించే ప్రతిభా సామర్థ్యాలు రాహుల్‌గాంధీకి లేవని తెలిసి కూడా సీనియర్లు ఆయనను నెత్తినపెట్టుకున్నారంటే అందుకు కారణం సోనియానే అనేది కాదనలేని సత్యం. సోనియా మౌనంగా కూర్చున్నా ఆమె మనస్సులో ఏముందో గ్రహించేందుకు, ఆమె ఇష్టప్రకారం నడుచుకునేందుకు కాకలుతీరిన సీనియర్‌ నేతలు సైతం పోటీపడేవారు. కానీ పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు సోనియా, రాహుల్‌గాంధీకి వచ్చిన ముప్పేమీ లేకపోయిన్నప్పటికీ భవిష్యత్తులు వీరి ఆధిపత్యానికి గండిపడుతుందనే సంకేతం కనిపిస్తోంది.
ఉత్తర ప్రదేశ్ నుంచే తొలి తిరుగుబాటు ..
రాహుల్‌ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసిన ఉత్తరప్రదేశ్‌లో నే తొలి తిరుగుబాటు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్‌ ప్రభుత్వాన్ని ఏదోరకంగా కూలదోసి మధ్యంతర ఎన్నికలు తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌లోనూ కోల్డ్ వార్ మొదలవ్వడం విశేషం. సోనియా, రాహుల్‌ను దెబ్బతీసేందుకు కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ కేంద్రమంత్రి బేణిప్రసాద్‌ వర్మ వ్యాఖ్యానించడం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి చిదంబరం, కపిల్‌సిబాల్‌, మనీష్‌ తివార్‌, అశ్విన్‌కుమార్‌, అభిషేక్‌ మను సింఘ్వి, సల్మాన్‌ ఖుర్షీద్‌లాంటి నేతలు బాధ్యత వహించాలని బేణీప్రసాద్‌ వర్మ డిమాండ్‌ చేస్తున్నారు. వీరి కారణంగానే పార్టీకి బ్యాడ్‌ ఇమేజ్‌ వచ్చిందని చెబుతున్నారాయన. అయితే బేణీ ప్రసాద్‌ వర్మ నే స్వచ్ఛమైన కాంగ్రెస్‌ వాది కాదంటూ ఆయన వ్యతిరేకవర్గం ప్రత్యారోపణలు చేస్తోంది. క్రమంగా వేడెక్కుతున్న కాంగ్రెస్‌ రాజకీయాలు ఏ క్షణంలో ఏ మలుపు తిరుగుతాయో… సోనియా, రాహుల్ ఆధిపత్యం.. కొనసాగుతుందో.. మరుగున పడుతుందో.. కాలమే సమాధానం నిర్ణయించనుంది.

About the Author