‘యువరాజు’ సారథ్యంపై సందేహాలు…..
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరాతిఘోరంగా ఓడిపోవడంతో యువరాజు రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై సందేహాలు ముసురుతున్నాయి. అంతే కాకుండా నెహ్రూ-గాంధీ కుటుంబం పలుకుబడిపైనా, భవిష్యత్తులో భారత రాజకీయాల్లో ఆ కుటుంబీకుల పాత్రపైనా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఎన్నికల్లో పార్టీ దిగ్గజాలు పలువురు మట్టి కరవడం,పార్టీకి కంచుకోటలుగా పేరొందిన చాలా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు పాగా వేయడం కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ ఇప్పుడు 50 స్థానాలను కూడా గెలుచుకోలేకపోవడాన్ని అధిష్ఠానం జీర్ణించుకోలేకపోతోంది. 2009లో వచ్చిన సీట్లలో నాలుగో వంతు సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌కు రాలేదు. మోడీ చేతిలో దారుణంగా దెబ్బతినడం కాంగ్రెస్‌ను కుంగదీస్తోంది. రాహుల్ నాయకత్వంలో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చాలా రాష్ట్రాల్లో వాటికొచ్చిన సీట్లు రెండంకెలు చేరలేదు.
రాహుల్ అమేథీ నుంచి గెలిచినా గత ఎన్నికలతో పోలిస్తే ఆధిక్యత బాగా తగ్గింది. ఫలితాలు వెలువడుతుండగానే సోనియా, రాహుల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ వైఫల్యానికి తామే బాధ్యత వహిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ ప్రణాళిక ఏంటో మాత్రం చెప్పలేదు.అయితే, కాంగ్రెస్ నాయకులు మాత్రం పరాజయానికి తామంతా బాధ్యులమేనంటూ రాహుల్ గాంధీని ఈ వైఫల్యం నుంచి తప్పించడానికి యత్నిస్తున్నారు. రాహుల్ చాలా కష్టపడ్డారు.అయితే మోడీ మాయజాలం, ధరల పెరుగుదల వంటివి మా ఓటమికి కారణాలయ్యాయంటున్నారు. ఎవరెన్ని చెప్పినా తాజా ఫలితాలు రాహుల్ సమర్థను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. దాంతో రాహుల్ స్థానంలో ఆయన సోద రి ప్రియాంకను తెచ్చేందుకు పార్టీ కార్యకర్తలు అప్పుడే రంగంలోకి దిగారు. పార్టీని రక్షించడానికి ప్రియాంక గాంధీ క్రీయాశీల రాజకీయాల్లోకి రావాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడి ఏఐసీసీ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు.