Published On: Sat, May 17th, 2014

మౌనముని సాధించిందేమిటి?

Share This
Tags

అభివృద్ధి ఫలాలు అందించారా? లేక అవినీతిని చూస్తూ ఉండిపోయారా? స్వతంత్రుడా? లేక మేడమ్ చేతిలో కీలుబొమ్మా…? ఓ పక్క కుంభకోణాల మరకలు… మరో పక్క కీలక సమయంలో కూడా నోరు విప్పలేదంటూ మౌనముని అని విమర్శలు…!! ఈ పదేళ్ల ప్రస్థానం ఏం చెప్తోంది? అసలు ప్రధానిగా మన్మోహన్ ఈ పదేళ్ళలో సాధించిందేమిటి? ఎలాంటి మేళ్లు చేశారు? తన పాలనతో ఎలాంటి మార్పులు తెచ్చారు? రెండోసారి ఐదేళ్ల పదవీ కాలాన్ని ముగించుకుని మన్మోహన్ వీడ్కోలు పలికే తరుణంలో ఇత్యాది అంశాలన్నీ చర్చకొస్తున్నాయి.
మన్మోహన్ సంస్కరణలు వికటించాయా?
ప్రధాని మన్మోహన్ సింగ్ దశాబ్ద కాలంపాటు దేశ ప్రధాని. ఆయన తొలిసారి ప్రధాని పీఠం అధిష్టించినపుడు ప్రజలు విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. అందులో ఏ సందేహం లేదు. ఆర్థికవేత్తగా, మేధావిగా పేరున్న వ్యక్తి నేరుగా ప్రధాని కావటంతో దేశం వెలిగిపోతుందని ఆశించారు. ప్రధానిగా పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1991 జూలై 24న ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల్ని సమూలంగా మార్చివేసింది. యూపీఏ టూ పాలన తర్వాత, భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ దిగజారిపోయింది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఓ దశలో 68 రూపాయలకు పడిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. నిత్యావసరాల ధరలు భగ్గుమన్నాయి. వృద్ధి రేటు మందగించింది. సామాన్యుడి బతుకు భారంగా మారింది. ఆర్థిక సంస్కరణల మూలంగా వ్యవసాయ రంగం పెను సంక్షోభంలో పడిపోయింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వరకూ అన్నింటి ధరలూ పెరిగిపోగా, వ్యవసాయ దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. మౌలిక సదుపాయాల రంగంలో మన్మోహన్ సర్కారు వైఫల్యం కారణంగా వేల పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలమంది కార్మికులు నిరుద్యోగులయ్యారు. పారిశ్రామిక ప్రగతి కుంటుబడటంతో పాటు స్టాక్ మార్కెట్లు కూడా నీరసించాయి.
మన్మోహన్ సమర్థన…
తమ పాలన, మొదట్లో ఆర్థికాభివృద్ధి అమోఘంగా సాగిందని గప్పాలు కొట్టుకున్న మన్మోహన్‌ ప్రభుత్వం, ఆ తర్వాత మాత్రం అంతర్జాతీయ ఆర్థికమాంద్యం కారణంగానే వెనకపడ్డామని సమర్థించుకోబోయారు. ఆ తర్వాత కాలంలో అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారంలో తన ప్రభుత్వం విఫలమైందని అంగీకరించారు మన్మోహన్.
ఎన్నికలు సమీపిస్తున్న వేళలో నోరువిప్పి ‘మమ’ అనిపించారు..
ప్రధాన మంత్రి కేంద్ర ప్రభుత్వానికే కాదు, దేశానికే సారధి. ఆ సీట్లో కూర్చునే వారు నిరంతరం ఎలర్ట్ గా ఉంటూ, దేశ ప్రజలతో నిరంతరం సంభాషించే తత్వమూ ఆ పదవికి అవసరమైన ప్రాథమిక లక్షణాలు. కానీ, మితభాషి అయిన మన్మోహన్‌సింగ్ అందుకు భిన్నంగా కొన్ని పరిమితులు విధించుకున్నారు. అత్యంత క్లిష్టమైన సమస్యతో దేశం సతమతమవుతున్న సందర్భాల్లో కూడా ఆయన మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఏదైనా విదేశీ పర్యటన జరిపినప్పుడో, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భాల్లోనో మాట్లాడటం తప్ప, దేశ ప్రజలతో సంభాషించడం ఒక అవసరంగా మన్మోహన్ ఎన్నడూ భావించలేదు. తన పదేళ్ల పదవీ కాలంలో మన్మోహన్ కేవలం మూడుసార్లు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంటేనే ఆయన స్వభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. మితభాషిత్వంవల్ల ఆయన మనోభావాలేమిటో, ఫలానా మాట ఎందుకు ఉపయోగించారో తెలియని పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి. యూపిఏ-2 హయాంలో వచ్చిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. 2జి స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం తదితర ఆరోపణలు ఎన్ని వచ్చినా సమాధానమివ్వకుండా మౌనమే వహించారు.
కుంభకోణాల్లో మన్మోహన్ బాధ్యత ఎంత?
యుపిఎ-2 హయాంలో జరిగిన స్కామ్‌లు దేశ ప్రజానీకాన్ని నివ్వెర పరిచాయి. కుంభకోణాల ద్వారా దేశం కోల్పోయిన రూ. లక్షల కోట్ల అవినీతిపై మన్మోహన్ మౌనం వహించారు. దేశానికి అతిపెద్ద సవాలైన అవినీతిని ఎదుర్కొనే విషయంలో ప్రధాని దారుణంగా విఫలమయ్యారు. నల్లధనం వెలికి తీయటంపై తెల్ల మొహం వేశారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అవినీతికి పాల్పడకపోవచ్చు కాని, బొగ్గుశాఖ ఆయన వద్ద ఉండగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 194 బొగ్గు క్షేత్రాలను వేలం విధానంలో కాక నచ్చిన వారికి కట్టబెట్టారు. సీబీఐ దర్యాప్తు లోని నిజాలు వెల్లడి కాకుండా కుట్రలు చేశారని, ఫైళ్లను మాయం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. బొగ్గు గనుల కేటాయింపులో సుమారు రూ. లక్షా 86 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు కాగ్‌ వంటి సంస్థలు నిర్ధారించాయి. అట్లాగే 2-జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో రూ.1 లక్షా 76 వేల కోట్లు కుంభకోణం జరిగి ఇందులో ఆర్ధిక మంత్రి చిదంబరానికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇక కామన్‌ వెల్త్ క్రీడల నిర్వహణకు రూ. 70 వేల కోట్లు కేటాయించగా అందులో సగం కూడా ఖర్చు చేయకుండా దుర్వినియోగం చెయ్యడంతో సురేష్‌ కల్మాడి జైలు పాలయ్యారు. ఐపీయల్‌లో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నా మన్మోహన్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ప్రేక్షకపాత్ర వహించింది. ఐపిఎల్‌ హవాలాలో రూ. 10వేల కోట్లకు పైగా నల్లధనం చేతులు మారినట్టు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌షిండేకి ఆదర్శ హౌసింగ్‌ సోసైటికి చెందిన స్థలాల కేటాయింపుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కపిల్‌ సిబాల్‌ కమ్యూనికేషన్ల శాఖమంత్రిగా ఉండగా రిలయన్స్ కమ్యూనికేషన్‌కి విధించిన రూ.650 కోట్ల జరిమానాను రూ. 5 కోట్లకి తగ్గించడం ద్వారా ఆర్ధిక ప్రయోజనాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. ప్రపుల్‌ పటేల్‌ ఎయిర్‌ ఇండియాను నష్టాల పాలుచేసి, ప్రైవేట్‌ విమానయాన సంస్ధలకు ప్రయోజనం చేకూర్చారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై మన్మోహన్ ఏనాడూ స్పందించలేదు.
అమెరికాతో అణు ఒప్పందం కోసం ప్రభుత్వాన్నే పణంగా పెట్టారు
తన పదవీ కాలంలో అత్యంత స్మరణీయ ఘట్టం అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడమే అని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. పెద్దన్న పట్ల ఆయన విధేయతకు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. అణు ఒప్పందం వల్ల కలిగే నష్టాలపై వామపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, శాస్త్రజ్ఞులు హెచ్చరించినా పట్టించుకోలేదు. తన మొండి వైఖరితో అధికార సన్యాసం చేస్తానని బెదిరించడమే కాదు, నీతిని పాతరేసేలా అవకాశవాద ఎంపీలను కొనుగోలు చేసి తన పంతం నెగ్గించుకున్న కార్పొరేట్‌ పిఎం మన్మోహన్. ప్రధానిగా ఆయనకు అది మధురస్వప్నంగా మిగిలిపోవచ్చు. కానీ దేశ చరిత్రలో అదో అసహ్యకరమైన, అపాయకరమైన సందర్భం. వాస్తవానికి తమ ఏలుబడిలోనే రూపొందిన ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం, ఆహార భద్రత, లోక్‌పాల్‌, సమాచార హక్కు వంటి వాటికన్నా అణు ఒప్పందం, ఎఫ్‌డిఐలకు ఆహ్వానం వంటివే ఆయనకు అద్భుత విజయాలుగా కనిపించటం మరీ విచిత్రమని విశ్లేషకుల వాదన. ఓ పక్క కుంభకోణాలు, మరో పక్క సంస్కరణలంటూ సామాన్యుడి నడ్డి విరిచే ప్రణాళికలు, వీటితో పాటు అసలు అధికారం సోనియా చేతిలో ఉందా? లేక ఇదంతా మన్మోహన్ నిర్ణయాధికారంతో నడుస్తుందా? ఇలాంటి విషయాల్లో ఈ మౌన ముని మొదటి నుంచీ చాలా విమర్శలెదుర్కొన్నారు. కీలుబొమ్మ ప్రధాని. అసలు అధికారం అంతా సోనియా, రాహుల్ ల చేతిలో ఉంది అనే విమర్శలు మొదటినుంచీ వినిపిస్తున్నవే. కానీ, వీటికి ఏనాడూ సమాధానం లేదు. వీడ్కోలు నాటికీ ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అంటే అనుమానమే.
సింగ్ కు ఇక ప్రశాంత జీవితమే…
ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మే 14న వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు రెండు రోజుల ముందు సోనియా ఈ విందును ఏర్పాటు చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన మర్నాడే, అంటే, మే 17న ప్రధాని పదవి నుంచి మన్మోహన్ వైదొలగనున్నారు. యూపీఏ సర్కారుకు వరుసగా రెండుసార్లు సారథ్యం వహించిన మన్మోహన్ సింగ్, ఈ ఏడాది ప్రారంభంలోనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్థిక సరళీకృత విధానాలను భారత్ లో ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వివిధ దేశాల నేతలతో సత్సంబంధాలే కొనసాగించారు. తాను పదవి నుంచి దిగిపోనున్న తరుణంలో వివిధ దేశాల నేతలకు వీడ్కోలు లేఖలు రాశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు చైనా మాజీ ప్రధాని వెన్ జియాబావో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ తదితరులకు కృతజ్ఞతా లేఖలు రాశారు.
మిగిలింది కీలుబొమ్మ ప్రధాని అనే ముద్ర
విద్యుత్, నీరు, ఆస్పత్రి, రహదారి వంటి సౌకర్యాలు లేని ఓ మురికికూపం లాంటి గ్రామంలో పెరిగి, దీపం వెలుగులో ప్రాథమిక విద్య పూర్తి చేసిన మన్మోహన్ కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల్లో చదివారు. ఆర్థిక మంత్రి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన ఆయన అక్కడి నుంచి కిందికి దిగజారారని విశ్లేషకుల వాదన. యూపిఏ-2 ప్రభుత్వాధినేతగా అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని నడిపారన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. దేశ ఆర్ధిక రంగానికి వ్యవసాయం, పరిశ్రమలు చాలా ప్రధానమైనవి. అవి రెండు కళ్ళు లాంటివని, వాటిని పరిరక్షించడానికి చేయాల్సిందంతా చేస్తున్నామంటూ మన్మోహన్ గొప్పలు చెప్పినా, ఆయన జమానా దోచుకున్నవారికి దోచుకున్నంతగా అన్నట్టుగానే సాగిందనే విమర్శలున్నాయి. దేశాన్ని దొంగలు, దళారులు, దగాకోరులు దోచుకుపోతున్నా నియంత్రణ చర్యలు చేపట్టకుండా చోద్యం చూడడంతో లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోయాయని విపక్షాల వాదన. ఒక్క 2011లోనే నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనం ఇండియా ఎల్లలు దాటి పోయిందని గ్లోబల్‌ పైనాన్షియల్‌ ఇంటెగ్రిటి సంస్థ తన నివేదికలో పేర్కొంది. మానవాభివృద్ధి సూచిలో ఇండియా 136 వ స్థానంలో, విదేశాలకు నల్లధనం తరలింపు జాబితాలో 5వ స్థానం ఉండడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.
సైలెంట్ వీడ్కోలు
భ్రమలు వీడి వాస్తవాలు బట్టబయలయ్యాయా? మన్మోహన్ పదేళ్ల పాలనలో దేశానికి ఒరిగిందేమిటి? ఆయన ఒకప్పుడు గొప్ప ఆర్థికవేత్త. స్వయంగా ఆర్బీఐ గవర్నర్ గా కూడా పనిచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టే సత్తా ఉందంటూ బలంగా ప్రచారంలో ఉన్న మేధావి కూడా. కానీ ఒరిగింది శూన్యం. ఇప్పుడు పదవినుంచి అంతే సైలెంట్ గా సౌండ్ లేకుండా వీడ్కోలు చెప్పేస్తున్నారు. భారత రాజకీయాలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవటానికి మన్మోహన్ సింగ్ ప్రస్థానం పెద్ద ఉదాహరణ.

About the Author