Published On: Tue, Jun 24th, 2014

మోడీ కఠిన నిర్ణయాల ఆంతర్యమేమిటి?

Share This
Tags

మోడీ కఠిన నిర్ణయాలు మొదట ప్రజలకు కోపం తెప్పించినప్పటికీ తరువాత ప్రేమిస్తారని ఆయన వ్యాఖ్యానాలు చేశారు. అసలు ఏమిటీ కఠిన నిర్ణయాలు. రక్షణ రంగంతోపాటు అన్ని రంగాల్లో ఎఫ్ డి ఐ ని ఆహ్వానించడమే ఆంతర్యంగా కనిపిస్తోంది. దీంతో సెబీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వేలకోట్ల రూపాయలు విడుదలవుతాయి కాబట్టి. ఇప్పటికే రైల్వే ఛార్జీలు 14 % పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అడుగులన్నీ కూడా కార్పొరేట్ దిశలోనే నడుస్తున్నాయి. వీటి ఫలితాలు తనను గద్దెనెక్కించడానికి సహాయపడిన కార్పొరేట్ వర్గానికి లాభం చేకూర్చడానికేనన్నది ఎవరికైనా తెలుస్తుంది.
అస్మదీయ నియామకాలు…
తమ పార్టీవారికి పదవులు కట్టబెట్టే వారి విషయంలో బిజెపి చాలా ఉదారంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే గవర్నర్లను తొలగించేందుకు ప్రయత్నించింది. తమకు నచ్చని వారిని తొలగించడం, నచ్చిన వారికి పదవులు ఇచ్చి తమకు అనుకూలంగా మలచుకోవడం గతం నుండి వస్తున్నదే. మూడు వారాల వ్యవధిలోనే రాజ్ భవన్ లను ఖాళీ చేయించేందుకు హడావుడి పడుతున్నది. ఈ స్థితిలో మహారాష్ట్ర గవర్నర్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ దీన్ని వ్యతిరేకించారు. వాస్తవిక పరిస్థితిని బట్టి వారిని తొలగించాలని 2010లో సుప్రీంకోర్టు పేర్కొంది. గవర్నర్లు మాత్రమే కాదు, వివిధ శాఖల్లో, విభాగాల్లో గత ప్రభుత్వం నియమించిన వారిని కూడా తొలగించి, అస్మదీయులను నియమించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఏదేమైనా ఆయా పదవుల్లో వున్న వారు స్వచ్ఛందంగా విరమిస్తారా లేక వారిని తొలగిస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
న్యాయాధీశులపై నీలినీడలు…
సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి కొలీజియం పద్ధతిని ఏర్పాటు చేశారు. ఈసారి లోథా నాయకత్వంలోని కొలీజియం కొందరు న్యాయమూర్తులను సిఫార్సు చేసింది. గోపాల సుబ్రహ్మణ్యం విషయంలో అనేక వివాదాలు తెరమీదకు వచ్చాయి. దీనికి కారణం 2జి స్పెక్ట్రం కేసుకు సంబంధించిన రాజా కూడా ఆయనను కలిసినట్లు సమాచారం. మోడీకి సంబంధించిన ఒక కేసు విషయంలో కూడా సుబ్రహ్మణ్యం ప్రతివాది తరపున వాదించడం వల్ల కూడా ఆయనను పక్కన పెడుతున్నట్లు సమాచారం. చూడాలి సుబ్రహ్మణ్యం నియామకం వ్యవహారం ఎలా ముగుస్తుందో.
కొరవడిన సుహృద్భావం…
రాష్ట్రం రెండుగా విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. విభజన జరిగేటప్పుడే అనేక అంశాలను సంక్లిష్టంగా ఒదిలేశాయి. జలవనరులకు సంబంధించి, విద్యుత్ కు సంబంధించిన విషయాలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు దారితీస్తున్నాయి. విభజన బిల్లులో వీటికి సంబంధించిన వివరాలను స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల ఈ వివాదం తెరమీదికొచ్చింది. ఇక కమలనాథన్ కమిటీ భేటీలో కూడా ఉద్యోగుల పంపకాల విషయంపై ఎటూ తేల్చలేని పరిస్థితి నెలకొంది. వీటిని పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపించి, రెండు రాష్ట్రాల వారి మధ్య సుహృద్భావం ఏర్పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

About the Author