భార్యల అభివృద్ధి నిరోధానికి భర్తలే కారణమా ?
ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి, ఆ తరువాత కెరీర్ లో కీలక మలుపు తీసుకునే దశలో మహిళలకు ఎన్నో ఆటంకాలెదురవుతున్నాయని, వాటన్నింటినీ అధిగమించే మానసిక స్థైర్యం వారికుందని, చెప్పుకుంటున్నాం. కానీ, ఆ కీలక మలుపులో ఎవరు వారికి ఆటంకంగా ఉన్నారు? ఏ పరిస్థితులు వారికి అడ్డుకట్ట వేస్తున్నాయన్నదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. అలా ఆటంక పరుస్తున్నవి బయటి పరిస్థితులో, బయటి వ్యక్తులో కాదు, అచ్చంగా జీవిత సహచరుడే అన్నదే సర్వే తేల్చిన నిజం. పెళ్లి అయిన అమ్మాయిలు కుటుంబ వ్యవహారాల్లో పడి ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన అవకాశమున్నా దాన్ని వదులుకుంటున్నారు. ఇంతకీ మహిళాభివృద్ధికి ఆటంకమెక్కడుంది? అన్న విషయాన్ని పరిశీలిద్దాం.
పెళ్ళితో పెరుగుతున్న బాధ్యతలు…
మహిళలు, తమ కెరీర్ ని పక్కన పెట్టి పిల్లల బాధ్యతలను భార్యలు తలకెత్తుకోవాలని చాలా మంది పురుషులు కోరుకుంటారు. ఇటీవల చేసిన ఒక స్టడీలో ఈ విషయమే వ్యక్తమైంది. మహిళలు తమ కెరీర్ లో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోవటానికి కారణం వారి భర్తలేనని వెల్లడైంది.
భార్యల అభివృద్ధి నిరోధానికి భర్తలే కారణమా?
భార్యలు ఉద్యోగాల్లో ఎదగకుండా ఉండడానికి, వంటింటి కుందేళ్లలా మారిపోవడానికి ముమ్మాటికి భర్తలే కారణమంటున్నారు కొందరు భార్యలు. చదువుకున్న అమ్మాయిలు. అది కూడా సాదా సీదా చదువు కాదు. ప్రపంచంలోనే అత్యున్నత విద్యా సంస్థల నుంచి డిగ్రీలు పుచ్చుకున్న చదువు. నిజానికి ఆ చదువుకు వాళ్లు కెరీర్ పరంగా ఉన్నత స్థానాల్లో ఉండాల్సిన వారు. కానీ వాళ్ల కెరీర్‌ను సాక్షాత్తు భర్తలే అడ్డుకుంటున్నారు అని మండిపడుతున్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉందని అన్నట్లే ప్రతి స్త్రీ విజయాన్ని అడ్డుకోవడం వెనుక ఓ భర్త ఉన్నాడంటున్నారు భార్యలు. ఈ మధ్య లండన్ లో జరిగిన ఓ సర్వేలో ఏకంగా 25 వేల మందిలో ఎక్కువ మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకున్న వారే. వాళ్లందరూ బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్‌లో పెద్ద చదువులు చదువుకున్న వారే. పెళ్లికి ముందు కొన్నాళ్లు మంచి ఉద్యోగాలు చేసారు. ఆ సమయంలోనే వీళ్లంతా వాళ్ల వాళ్ల కెరీర్ లో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారని అనుకున్నారు. కలలు కన్నారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు రేయింబవళ్లు కష్టపడ్డారు.
భర్తల కోసం భార్యల కెరీర్ బలి…
ఈ అధ్యయనంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో చదివిన 25 వేల మంది స్త్రీ పురుషులను ప్రశ్నించారు. ఇందులో భర్తలు వారి కెరీర్ లో ముందుకెళ్లడం కోసం ఆడవాళ్లు తమ కెరీర్ అవకాశాలను వదులుకుంటున్నారని ఈ స్టడీలో తేలింది. నేటి తరం స్త్రీ, పురుషులను ఈ సర్వేలో ప్రశ్నించారు. వీరిలో 11 శాతం మంది స్త్రీలు ఫుల్ టైమ్ తల్లి బాధ్యతలు నిర్వహించేందుకు ఉద్యోగం మానేసారు. వీరిలో 32 నుండి 48 సంవత్సరాల వయసున్న 74 శాతం మంది మహిళలు వారంలో 52 గంటల పాటు పిల్లలు, ఇంటి బాధ్యతల్లో తలమునకలవుతున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పురుషుల్లో సగానికి సగం మంది, తమ భార్యల కన్నా తాము కెరీర్ లో ముందుండాలని కోరుకుంటున్నారు. మహిళల్లో కేవలం 7 శాతం మంది పురుషులతో సమానంగా కెరీర్ లో ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. తమ కెరీర్ కన్నా తమ భర్తల కెరీర్ కే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతోందని 40 శాతం మంది మహిళలు వాపోయారు. తమ భార్యల కెరీర్ కంటే కూడా తమ కెరీరే ముఖ్యమైందని 70 శాతం మంది పురుషులు భావించారు. దాదాపు 86 శాతం మంది పురుషులు తమ భార్యలు ఇంటిని, పిల్లలను తీర్చిదిద్దాలని కోరుకున్నారు.
మారుతున్న కాలంతోపాటు పెరుగుతున్న అవకాశాలు…
మహిళలను కొన్ని పనులకే పరిమితం చేసినప్పటికీ కాలక్రమేణా వారి ప్రతిభాపాటవాలు వారిని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. మారుతున్న కాలంతో పాటు అవకాశాలు కూడా ఎక్కువవడంతో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాల్లో మహిళలు రోజు రోజుకు పెరుగుతున్నారు. గతంతో పోలిస్తే చదువుకుంటున్న అమ్మాయిల సంఖ్య భారీగానే పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా అమ్మాయిలు కూడా కొత్త అంశాల వైపు దృష్టి సారిస్తున్నారు. విజయ పథంలో పయనిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు అందివస్తున్న అవకాశాలు…
ఇంతకు ముందు పురుషులకు మాత్రమే పరిమితం అనుకున్న అనేకానేక పనులను ఇపుడు మహిళలు అవలీలగా చేసేస్తున్నారు. కొన్నింటిలో అయితే పురుషులను మించి పోతున్నారు కూడా. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పు. ఆకాశంలోనే కాదు, అవకాశాల్లోనూ మేం సగం అంటూ మహిళలు ముందుకొస్తున్నారు. సాఫ్ట్ వేర్ తో పాటు అనేక రంగాల్లో పురుషులకు ధీటుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక వైపు ఇంటి బాధ్యత. మరోవైపు ఉద్యోగంతో సతమతమవుతున్నా రెంటిలోనూ రాణిస్తున్నారు.
పైకి రాణించాలని చెప్తున్నా..లోపల మాత్రం అణగదొక్కాలనే…
మహిళలు రాణించాలంటూ పైకి ఎన్ని మాటలు చెప్తున్నా, లోలోపల మాత్రం వారి ఎదుగుదల నిలిచిపోయేందుకు పురుషులే కారణమంటున్నారు. ఇలా అంటున్న వారు ఒకరు ఇద్దరూ కాదు. ఏకంగా వేలాది మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్నా, ఉద్యోగాల్లో ఎదిగేందుకు అవకాశమున్నా కాని అమ్మాయిలు సంసారమనే చట్రంలో ఇరుక్కుపోతున్నారు. పెళ్లి, ఆ తర్వాత పిల్లల బాధ్యతతో క్షణం తీరిక లేకుండా జీవితంలో బిజీ అయిపోతున్నారు. దీనంతటికి కారణం పిల్లలని, వారి అలనా పాలనా చూడడమని అందరూ అనుకుంటున్నా, నిజం మాత్రం అది కాదట. భర్త నుంచి ప్రోత్సాహం లేకపోవడమే కాదు. ఉద్యోగాలకు వెళ్లవద్దని చెప్పడం వల్లే కెరీర్ మధ్యలో నిలిచిపోతోందని అమ్మాయిలు అంటున్నారు.
పురుషులకు అసూయ ఎక్కువే…
స్త్రీలతో పోలిస్తే పురుషులకు అసూయ ఎక్కువేనట. ఈ అసూయతోనే భార్యలను ఉద్యోగాలు చేయనివ్వడం లేదన్నది సర్వే సారాంశం. ఈ సర్వేలో కనీసం 15 శాతం మంది కూడా పురుషులకు అనుకూలంగా మాట్లాడకపోవడం విశేషం.
సర్వేలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు…
ఈ సర్వేలో దాదాపు ఇరవై ఐదు వేల మందిని ఇంటర్వ్యూ చేసారు. ఇందులో కేవలం 11 శాతం మంది మాత్రమే పిల్లలు, కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగాలు మానేశాం అని చెప్పారు. మిగిలిన వారంతా భర్త అడ్డు చెప్పడం వల్లే ఉద్యోగాలు వదులుకున్నామన్నారు. దశాబ్దం క్రితం గ్రాడ్యుయేట్లుగా, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పట్టా పొందిన అమ్మాయిలంతా భార్య, తల్లి బాధ్యతల్లోకి వెళ్లగానే ఆ సర్టిఫికెట్లను విలువ లేనివిగా చూస్తున్నారు. నిజానికి వాళ్లు చూస్తారు అనేకంటే వారిని కట్టుకున్న వారే అలా చేస్తున్నారట. పిల్లల బాధ్యత చూసుకోమంటూ భార్యను వంటింటికే పరిమితం చేస్తున్నారని ఈ సర్వేలో తేలింది. ఈ సర్వేలోనే మరో ఆశ్చర్యకరమైన అంశం 70 శాతం మంది పురుషులు తమకు భార్య, కుటుంబం కంటే కెరీరే ముఖ్యమని చెప్పారు. అంతే కాదు భార్య ఉద్యోగాల్లో ఎదగడం కంటే పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలే చూడటం తమకిష్టమని, 86 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది మహిళలు తాము ఉద్యోగాల్లో ఎదగకపోవడానికి భర్తలనే నిందించారు. వీరంతా 32 నుంచి 48 ఏళ్ల మధ్య వయసున్న వారే. మిగిలిన వారిలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే పిల్లలు, కుటుంబం కోసం కెరీర్ ను వదులుకున్నామని చెప్పడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీపడుతున్నారని, అవకాశాలను అదుకుంటున్నారని చెప్పుకుంటున్నా అది నిజం కాదని సర్వేలో తేటతెల్లమైంది. సాధికారత దిశగా అడుగులు వేయాల్సిన ఓ అతివ పయనం అర్థాంతరంగా ఆగిపోవడం వెనుక ఆమె భర్తే అడ్డుగోడగా ఉన్నాడని తేలిపోయింది.
మహిళలకు ప్రాతినిధ్యమిచ్చే ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి…
ప్రస్తుత కాలంలో కెరీర్ లో ఎదిగేందుకు, తమ శక్తియుక్తులను చాటుకునేందుకు అందిరీకీ అవకాశాలు సమంగానే ఉన్నాయి. కీలక మలుపు తీసుకునే సందర్భాలూ స్త్రీ, పురుషులిద్దరికీ ఒకేలా ఉన్నాయి. కానీ, కేవలం బాధ్యతల కారణంగా, ఆ బాధ్యతలు స్త్రీలు మాత్రమే భుజానికెత్తుకోవాలన్న భావజాలం కారణంగా మహిళల కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపడం అసలైన విషాదం. సామాజిక, ఆర్థికాభివృద్ధి గమనంలో మహిళల శ్రమకు సరైన విలువ లేకపోతే, వారికి సరైన ప్రాతినిధ్యం దక్కకపోతే అది అభివృద్ధికి సూచిక కాదని ఈరాష్ట్రం భావిస్తోంది. ఈ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఈరాష్ట్రం కోరుకుంటోంది.