భారత్ ను నడిపించబోయే కొత్త సారధి …..
2014 సార్వత్రిక ఎన్నికలు ఈ దేశానికి మరో కొత్త ప్రధానిని అందించాయి. ఆధునిక మెస్సయ్యగా తనకు తాను అభివర్ణించుకున్న గుజరాత్ మృత్యుబేహారి నరేంద్రమోడీ దేశ అత్యున్నత ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. అవును! నరేంద్రమోడీ ఈ దేశానికి ‘కొత్తా దేవుడి’గా వ్యవహరించనున్నారు. 2014సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమికి 338 సీట్లు లభించాయి. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలలో బీజేపీకి ఏకపక్షంగా ఎక్కువమొత్తంలో సీట్లు లభించాయి. ఉత్తర ప్రదేశ్ లో 80 లోక్ సభ సీట్లకు గాను 70 పైచిలుకు స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఢిల్లీలో ఏడు లోక్ సభ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. గుజరాత్ 26 సీట్లకు 26 సీట్లను, రాజస్థాన్ లో 25 సీట్లకు 25 సీట్లను బీజేపీ కొల్లగొట్టేసింది. చత్తీస్ గడ్ 11 సీట్లకు గాను 9 సీట్లు, మధ్య ప్రదేశ్ లో 29 సీట్లకు గాను 27 సీట్లను బీజేపీ గెలుచుకుంది. సీమాంధ్రలో 25 సీట్లకు గాను 11 సీట్లను కైవసం చేసుకుని మరో ఆరు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి చిత్తుగా ఓడిపోయింది. యూపీఏ కేవలం 59 సీట్లను మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష హోదాను కూడా ప్రశ్నార్థకం చేసుకుంది. 1947 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం పాలవడం దేశ ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా వీచిన బీజేపీ పవనాలను కేవలం తమిళనాడులో జయలలిత, త్రిపురలో మాణిక్ సర్కార్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లు మాత్రమే అడ్డుకోగలిగారు.
బీజేపీ సాధించిన విజయాన్ని ఒక్కసారి విశ్లేషిస్తే..మోడీ గాలి వీస్తుందన్న రాజకీయ విశ్లేషకులు చెప్పిన అభిప్రాయాలు తప్పని తేలింది. యూపీఏ అవినీతిని వ్యతిరేకించిన ప్రజలు మరో ప్రత్యామ్నాయం లేకనే బీజేపీని ఎంచుకున్నారు తప్ప మోడీ ని చూసి మాత్రం కాదు. పదేళ్లపాటు అధికారంలో వున్న ఏ పార్టీకైనా ఈస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ముచేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది కులం, మతం, ధనం మాత్రమేనని చెప్పకతప్పదు. సుమారు బీజేపీ ప్రచారానికి నెలకు 25 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన వ్యయం ఓ చత్తీస్ గడ్ లాంటి రాష్ట్రంలో ఐదేళ్లపాటు విద్యారంగానికి ఖర్చుపెట్టొచ్చు. భారతదేశ ఎన్నికల చర్రితలో ఎన్నడూ లేనివిధంగా ఇంత భారీగా, వృథాగా ఖర్చుపెట్టారు. వామపక్షాలు కూడా ఈ ఎన్నికల్లో కేరళ, త్రిపుర రాష్టాల్లో మాత్రమే తమ ఉనికిని చాటుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మాత్రం వామపక్షేతర పార్టీలన్నీ కలిపి వామపక్షాలను ఓడించాయి. పోలింగ్ సమయంలో వామపక్ష కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన హింసాత్మక దాడులే అందుకు నిదర్శనం. అయితే గెలుపొందిన అభ్యర్థులు నాలుగు లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. బహుశా దేశంలో ఇంత భారీ మెజార్టీ ఇంకెవరికీ రాకపోవడం కూడా రికార్డుగానే మిగిలిపోతుంది.
యూపీఏ పరిపాలనలో పెట్టుబడి దారీ శక్తులకు ఊతమిచ్చిన ఆర్థిక సంస్కరణలను కచ్చితంగా వ్యతిరేకించారని చెప్పొచ్చు. ఆమేరకు ప్రజలకు ఓ స్పష్టమైన అవగాహన ఉంది. కానీ, వాళ్లకు తగిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ ఓటంతా బీజేపీకి లాభించింది. రేపు అధికారాన్ని చేపట్టనున్న బీజేపీ కూడా సంస్కరణల వేగంపెంచే ఆర్థిక విధానాలనే అనుసరిస్తుందే తప్ప కాంగ్రెస్ కు విధానాలకు ప్రత్యామ్నాయంగా ఏమాత్రం వ్యవహరించదని గుజరాత్ మోడల్ చెబుతోంది. కాబట్టి దీన్ని బట్టే చెప్పొచ్చు దేశంలో మోడీ గాలి వీయలేదని. ఒక్క కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో మినహా దక్షిణాదిన బీజేపీకి చుక్కలు కనిపించాయి. ఆ గెలిచిన సీట్లలో కూడా అతి స్వల్ప మెజార్టీ తో మాత్రమే గెలిచారు.