ప్రపంచాన్ని వణికిస్తోన్న ఎబోలా…..
మొన్న సార్స్, నిన్న హెచ్ వన్ ఎన్ వన్… ఇపుడు ప్రపచానికి ఎబోలా ఫోబియా పట్టుకుంది. నిన్నమొన్నటి వరకు స్వైన్‌ఫ్లూతో బెంబేలెత్తిపోయిన జనం తాజాగా ఈ వైరస్ పేరు చెప్పితే చాలు ఉలిక్కిపడుతున్నారు.
ఎబోలా తో అబుదాబి లోనైజీరియన్ మహిళ మృతి…
నైజీరియన్ మహిళ కేన్సర్ ట్రీట్ మెంట్ కోసం ఇండియాకు బయలుదేరి దారి మధ్యలో ఎబోలా వైరస్ తో అబుదాబి ఎయిర్ పోర్టులో చనిపోయింది. ఆ మహిళ భారత్ కు వచ్చి వుంటే… ఎబోలా వైరస్ ను అక్కడే గుర్తించి ఉండకపోతే… ఏం జరిగుండేదో ఊహించడానికే భయమేస్తోంది. ఆరోగ్యాన్ని ప్రైవేటుకు అమ్మేసి… ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు పడకేసిన భారతదేశంలో ఎబోలా విచ్చలవిడిగా రెచ్చిపోయేది. పరిశుభ్రతా ప్రమాణాలు లేని స్లమ్స్ లెక్క లేనంతగా ఉన్న నగరాలను అనకొండలా మింగేసేది. జనాభా ఎక్కువై… బతుకుదెరువు కోసం పరుగులు పెట్టే జనంలో ఈ వైరస్ ను అడ్డుకోవడం మన తరమయ్యేదా?
సోషల్ మీడియాలోనూ ఎబోలా ఫీవర్ ….
సోషల్ మీడియాలోనూ ఎబోలా ఫీవర్ వచ్చేసింది. కర్నాటకలో ఓ స్టూడెంట్ కి ఎబోలా సోకిందనే వార్తలు శరవేగంతో నెట్ ద్వారా పాకిపోయింది. దీంతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. ఇది అబద్ధమని తెలియగానే పునర్జన్మ పొందినంత ఫీలింగొచ్చింది జనానికి. అదే నిజమయ్యింటే… ఊహించడానికి కూడా ధైర్యం చాలటం లేదు కదా..
అసలు ఎక్కడిదీ ఎబోలా వైరస్…
పశ్చిమాఫ్రికాలోని వివిధ దేశాల్లో ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 12 వందలకు పైగా మృతి చెందారు. ఎబోలా దెబ్బకు గడచిన నాలుగు రోజుల్లో 84 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క లైబీరియాలోనే 53 మంది మృతి చెందడంతో వ్యాధి మరింత ప్రబలకుండా అక్కడి ప్రభుత్వం ఆ దేశంలో కర్ఫ్యూ విధించింది. సియొర్రా లియోన్ లో 17, గినీలో 14 మరణాలు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
గినియాలో తొలి కేసు…
పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఎబోలా వైరస్ తొలి కేసును 2014 మార్చిలో గుర్తించారు. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా తదితర దేశాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ దేశాల్లో ఎబోలా విజృంభన అంచనాకు మించే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని, పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 10 లక్షల మందిపై ఈ వైరస్ ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే మానవాళికే పెనుముప్పుగా మారే ప్రమాదముందని కూడా డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. అసాధారణ రీతిలో చర్యలు చేపడితే కానీ వైరస్ వ్యాప్తిని అరికట్టలేమని ప్రపంచ దేశాలకు సూచించింది.
ఎబోలా సంక్షోభాన్ని యుద్ధంతో….
ఎబోలా కారణంగా లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ప్రపంచ దేశాలు ఈ దేశాలకు రావాలంటేనే భయపడిపోతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ తదితర దేశాలు విమానాలను రద్దు చేశాయి. లైబీరియాలోని తమ దౌత్య ఉద్యోగులను స్వదేశానికి రావాలంటూ అమెరికా ఆదేశాలు జారీ చేసింది. స్విట్జర్లాండ్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మెడికిన్స్ సాన్స్ ఫ్రాంటైర్స్ అనే సంస్థ ఎబోలా సంక్షోభాన్ని యుద్ధంతో పోల్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. 2003లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్- సార్స్ ..మొదట్లో ఆసియాలో కలకలం సృష్టించింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి విస్తరించింది. 2009 మార్చిలో మెక్సికోలో కనిపించిన స్వైన్ ఫ్లూ.. తర్వాత యావత్ ప్రపంచానికి వ్యాపించింది. ఈ రెండు సంఘటనల్లో కొన్ని వందల మరణాలు సంభవించాయి. ఇపుడు తాజాగా ఎబోలా ప్రపచాన్ని వణికిస్తోంది.
అంతర్జాతీయ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా….
నైజీరియాలో పాట్రిక్ సాయెర్ అనే అమెరికా పౌరుడు లైబీరియా నుంచి వచ్చిన తర్వాత జూలై నెలాఖరులో మరణించాడు. అతడికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా ఈ వైరస్ సోకింది. గినియా, లైబీరియా, సియెర్రా లియోన్ లలో ఈ వైరస్ పాకుతూ వస్తోంది. ఇప్పుడా దేశాల్లో భయం రాజ్యమేలుతోంది. ఆ దేశాలకు వెళ్లాలంటేనే జనం హడలెత్తిపోతున్నారు. ఈ వ్యాధి మిగతా దేశాలకు వ్యాప్తి చెందకుండా ఉండడానికి గునియా, లైబీరియా, సియెర్రా లియోన్ దేశాల సరిహద్దులను మూసివేసే దిశగా చర్యలు ఊపందుకున్నాయి.
భారత్ వెంటాడుతోన్న ఎబోలా….
ఎబోలా ముప్పు భారతదేశాన్ని కూడా వెంటాడుతోంది. ఎబోలా వైరస్ వ్యాపించిన దేశాల్లో దాదాపు 45వేల మంది భారతీయులు ఉండడమే ఇందుకు కారణం. గినియాలో 5వందల మంది, లైబీరియాలో 3వేల మంది, సియెర్రా లియోన్లో 12 వందల మంది, నైజీరియాలో ఏకంగా 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా మరో 3 వందల మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది లైబీరియాలో పనిచేస్తున్నారు.
ఎబోలాను ఎదుర్కోవడానికి సిద్ధమైన భారత్…..
ఎబోలాను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైంది. ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో క్వారంటైన్‌లను ఏర్పాటు చేసి క్షుణ్నంగా తనిఖీలు చేపడుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో ఎక్కడా ఎబోలా కేసును గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే గినియా నుంచి చెన్నైకు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్లు అనుమానం ఉండటంతో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకలేదని లేదని తేలింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ లేదని నిర్థారించిన తర్వాతే వారిని బయటికి పంపుతున్నారు.
జంతువులతో మనిషికి సోకుతున్న ఎబోలా
ఆఫ్రికా అడవుల్లో చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు, అడవి దుప్పిలు వ్యాధికి గురై మరణించినప్పుడు, వాటిని తొలగించే క్రమంలో ఎబోలా మనిషికి సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ ఒకసారి మనిషిలోకి చేరితే వెంటనే ఇతరులకు తేలిగ్గా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. ఈ వ్యాధి సోకిన రోగి శరీర ద్రవాలు ముఖ్యంగా లాలాజలం, రక్తం, చెమట, వాంతులు, వీర్యం తదితరాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన రక్షణ లేకుండా ఎబోలా రోగులకు వైద్యం చేసే వైద్యులకు కూడా ఇది వ్యాపిస్తుంది. మృతదేహాల ఖననం సందర్భంలోనూ బంధువులకు వ్యాపించే ప్రమాదముంది.
ఎబోలా వైరస్ లో ఐదు భిన్నజాతులు
ఎబోలా వైరస్ ను ఫైలో వైరస్ అని కూడా అంటారు. ఎబోలా వైరస్ లో ఐదు భిన్న జాతులుంటాయి. అవి.. బుండిబుగ్యో ఎబోలా వైరస్; జైర్ ఎబోలా వైరస్ ; రెస్టాన్ ఎబోలా వైరస్ ; సూడాన్ ఎబోలా వైరస్; టాయి ఫారెస్ట్ ఎబోలా వైరస్. వీటిలో బీడీబీవీ, ఈబీఓవీ, ఎస్‌యూడీవీ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతాయి. ఫిలిప్పీన్స్, చైనాలో గుర్తించిన ఆర్‌ఈఎస్టీవీ రకం మనుషులకు సోకినా, పెద్దగా ప్రభావం చూపించదని ననిపుణులు అంటున్నారు.
వ్యాధి లక్షణాలు…
వైరస్ సోకగానే రక్తపీడనం పడిపోతుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శరీరం లోపల, బయట తీవ్ర రక్తస్రావం సంభవిస్తుంది. అవయవాల పనితీరు దెబ్బతినటం వల్ల రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడడానికి వారం రోజులు పడుతుంది. సత్వర చికిత్స అందిస్తేనే వ్యక్తి బతుకుతాడు.
యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్ ద్వారా వ్యాధి నిర్ధారణ
ప్రారంభ లక్షణాలు కనిపించిన వారిలో మలేరియా, టైఫాయిడ్, కలరా, ప్లేగు, హెపటైటిస్, డెంగీ జ్వరాలు లేవని నిర్ధారించిన తర్వాత ఎబోలా పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఎలీసా, యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్, కణ వర్ధనం తదితర పద్ధతుల్లో వ్యాధిని నిర్ధారిస్తారు. రోగి నుంచి సేకరించిన రక్త నమూనాలు చాలా డేంజర్. శరీరంలోని వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక నిరోధక మందులేవీ లేవు. ఎబోలా వ్యాప్తిని నిరోధించే మార్గాలపైనే ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
1976లోనే ఎబోలా వైరస్ కలకలం
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌ను 1976లోనే గుర్తించారు. అప్పట్లో ఏం జరిగింది? అసలు ఈ వైరస్‌ను ఎలా గుర్తించారు? ఎవరు కనుగొన్నారు? ఇన్ని వైద్యసదుపాయాలున్న ఈ రోజుల్లోనే 12 వందల మందికి పైగా ఎబోలా బాధితులు చనిపోయారంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? అప్పట్లో ఎబోలా బారిన పడినవారు ఎవరైనా బతికి బయటపడ్డారా?
ఈవీడీకి మరో పేరు ఎబోలా హెమరోజిక్ ఫీవర్
ఇబోలా వైరస్ డిసీజ్… ఈవీడీగా పేర్కొనే ఈ వ్యాధిని ఇబోలా హెమరోజిక్ ఫీవర్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎబోలా వైరస్ వ్యాధి లేదా ఎబోలా హెమరేజిక్ ఫీవర్ బారినపడిన వారిలో దాదాపు 90 శాతం మంది మరణించే అవకాశముంది. 1976లో నైజీరియా, సూడాన్, యాంబూక్, కాంగో దేశాల్లో ఎబోలా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఇలాంటి కేసులే ఇబోలా అనే నదికి దగ్గరగా వున్న గ్రామంలో ఎక్కువగా నమోదయ్యాయి. 1976లోనే బెల్జియం పరిశోధకుడు పీటర్ పయట్ ఎబోలా వైరస్ ను మొదటిసారిగా గుర్తించారు.
2013 డిసెంబర్ 6న..
2013 డిసెంబర్ 6న పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలోని గుయ్ కేడో గ్రామంలో రెండేళ్ల పసిబాలుడు ఎబోలా వైరస్ తో మృతి చెందడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ బాలుడు మరణించిన వారం రోజులకి అతని తల్లి, తల్లి చనిపోయిన కొన్ని రోజులకు… క్రిస్ట్ మస్ రోజున మూడేళ్ల అతని సోదరి మరణించింది. మరో ఐదు రోజులకి బాలుడి నాయనమ్మ చనిపోయింది. వీరి అంత్యక్రియలకు హాజరైన బంధువుల ద్వారా ఎబోలా వైరస్ సమీపంలోని గ్రామాలకు, పట్టణాలకు విస్తరించింది.
జనవరి, 2014 నుంచి పెరిగిన ఎబోలా మరణాలు
జనవరి 2014 నుంచి భారీ సంఖ్యలో జనం మరణిస్తున్నప్పటికీ… పరిశోధకులకు ఈ వ్యాధిని గుర్తించండానికి 2 నెలలు పట్టింది. మార్చి నెలలో దీన్ని ఎబోలా వ్యాధిగా గుర్తించేటప్పటికే… ఈ వైరస్ గినియా దేశంతో పాటు పక్క దేశాలకు కూడా వ్యాప్తి చెందింది. ఎబోలా వైరస్ వ్యాప్తి కి గబ్బిలాలే కారణమై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. గబ్బిలాలు తిని పడేసిన పండ్లను తినటం ద్వారా ఈ వ్యాధి మనుషుల్లోకి ప్రవేశించిందని వారు అనుమానిస్తున్నారు.
1976లోనే ప్రపంచ దృష్టికి ఎబోలా..
1976లోనే ఎబోలా వైరస్ ప్రపంచ దృష్టికి వచ్చింది. 38 ఏళ్లు గడిచినా ఇంతవరకు ఈ వ్యాధికి మందు కనుగొనలేదు. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న వైద్య శాస్త్రవేత్తలు ఎబోలాకు విరుగుడును ఎందుకు కనుగొనలేక పోయారన్నది జనం మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్న. ఈ వ్యాధి ఆఫ్రికా దేశాలకే పరిమితమైందన్న నిర్లక్ష్యమా? లేక ఇది అంతు చిక్కని రోగమా?
సీరియస్ గా తీసుకోని అమెరికా…
అమెరికా లాంటి అగ్రదేశాలు తాము ఇది సాధించాము… అది సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటాయి. ఎబోలా గురించి అమెరికా పట్టించుకున్నా సీరియస్ గా మాత్రం తీసుకోలేదన్న విమర్శలున్నాయి. అమెరికా మత ప్రచారకులిద్దరికి సోకిన తర్వాతే ఆ దేశం దీనిపై పరిశోధనలు మొదలు పెట్టింది. అమెరికాకు చెందిన ఫార్మసీ కంపెనీ జడ్ మ్యాప్ అనే మందును కనుగొంది. అయితే ఇది ఇంకా పరిశోధనలోనే ఉందని మరో రెండేళ్లు గడిస్తే కానీ దీన్ని మార్కెట్ చేయలేమని అమెరికా చెబుతోంది.
అందుబాటులో లేని జడ్ మాప్ ఔషధం…
ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ మందును పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేయడంతో జడ్ మాప్ ఔషధం లభించక రోగులు ఇక్కట్లు పడుతున్నారని వైద్య బృందాలు చెబుతున్నాయి. ఎబోలా వ్యాధి సంక్రమించిన వారి సంఖ్య వేలల్లో ఉండగా జడ్ మ్యాప్ పదుల సంఖ్యలోనే దొరుకుతోందని వాపోతున్నారు. దీనిపై ఆఫ్రికా దేశాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గివ్ ఆఫ్రికా జడ్ మ్యాప్, గివ్ దెమ్ ఎక్స్ పెరిమెంటల్ డ్రగ్స్, ఆఫ్రికా క్యూర్ పేరిట ఆఫ్రికన్లు ఆన్ లైన ప్రచారోద్యమాన్ని ముమ్మరం చేశారు. ప్రయోగాల పేరిట ఆఫ్రికన్ పిల్లలు పనికొస్తారు… రోగాలు వస్తే మందులు ఇవ్వడానికి మాత్రం ముందుకు రారని అమెరికాను ఆఫ్రికన్ నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ఇపుడు కనుగొన్న జడ్ మ్యాప్ ఔషదాన్ని కూడా ఆఫ్రికాకు చెందిన ఓ చిన్నారి నుంచే సీరమ్ నమూనాలు తీసుకున్నారని, ఎబోలాను ఎదుర్కోగల యాంటీ బాడీలు ఆ బాలుడి రక్తంలో ఉన్నాయని నైజీరియన్ డు సంధింగ్ సంస్థ పేర్కొంది. ఈ వైరస్ సోకినా తట్టుకుని జీవించిన వ్యక్తుల నుంచి యాంటీబాడీలు సేకరించి ఔషదాలు తయారు చేయాలని సూచిస్తున్నారు.
మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతే….
ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అడవి జంతువుల మాంసాన్ని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. చింపాంజీ, గబ్బిలాలు తదితర జంతువుల మాంసాన్ని తింటారు. ఈ జంతువులే ఎబోలా వ్యాధికి కారణమవుతున్నాయి. ఈ జంతువులను తాకేటపుడు జాగ్రత్తగా ఉండాలని, వీటి మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది. ఎబోలా వైరస్ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగా ఉంటాయి. ఈ లక్షణాలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎబోలా రోగులను పరీక్షించే వైద్యబృందాలు కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, చేతులకు పొడవాటి గ్లోవ్స్, ముఖానికి మాస్క్ ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ప్రస్తుతం ఎబోలా వైరస్ వ్యాధి విస్తరిస్తున్న తీరును బట్టి పరిస్థితి విషమంగా ఉందని, ఇది అదుపుతప్పి ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎబోలా ప్రభావిత దేశాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేనందున ప్రపంచ దేశాలు సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
ఆరోగ్య ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా…
మీరు ట్రీట్ మెంట్ తీసుకోండి.. మేం బిల్లులు కడతామనే ప్రభుత్వాలు ఎబోలాను కూడా అలాగే చూస్తే .. మారణహోమాన్ని సృష్టించినవాళ్లవుతారు. సామాజిక బాధ్యతగా ఫీలయ్యేవారు మాత్రమే ప్రజలను కాపాడగలరు. సంపాదన కోసం వైద్యం చేసేవాళ్లు… కాపాడలేరు. ఎబోలాను అడ్డుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. లేదంటే భారతదేశంలోనూ ఎబోలా మరణ మ్రదంగం మోగిస్తుంది.