Published On: Wed, Jun 4th, 2014

ప్రతిపక్ష హోదా నిర్వహణ కూడా కాంగ్రెస్ కు కష్టమే…

Share This
Tags

తెలంగాణ శాసనమండలికి కాంగ్రెస్ పార్టీ సీఎల్పి నేతను ఎన్నుకున్న తీరు.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జానారెడ్డిని ఎంపిక చేసిన విధానం.. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా నిర్వహణ, రాహుల్ గాంధీ పాత్ర ఎలా ఉంటుంది..? అనే అంశాలపై 10టివి బుధవారం నిర్వహించిన గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ ప్రోగ్రాంలో ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సమగ్రమైన విశ్లేషణలు అందజేశారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే చూద్దాం.
సీఎల్పీ నేతకు కూడా డబ్బులు పెడితే…
తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ నేత ఎన్నికపై ఉన్న గందరగోళం సహజమే. ఎందుకంటే.. అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఉంటుంది. అలాంటిది అధికారం లేనప్పుడు గందరగోళం ఉండడం ఆ పార్టీకి కొత్తేమి కాదు. ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి చతికిల పడిపోయింది. అయితే… తెలంగాణలో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ముందుగా ఆ పార్టీ శాసన మండలి నేతను ఎన్నుకున్న తీరును పరిశీలిస్తే.. ప్రతిపక్ష హోదాలో ఉండడం కోసం.. సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు కూడా డబ్బులు తీసుకుంటే.. అలాంటి వ్యక్తులు ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తారు..? అనేది ప్రశ్నార్థకమే అవుతుంది. ఒక సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు డబ్బులు తీసుకోవాల్సిన ప్రాధాన్యత ఏముంది..? అనుకున్నప్పుడు.. శాసన మండలిలో టిఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ లేదు. కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ ఉంది. కాబట్టి శాసన మండలిలో ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ కు 17 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కావున.. ఛైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటుంది. అందువల్ల టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. కాంగ్రెస్ కు ఈ అవకాశం కూడా పోయేటట్లుంది. ఉన్న 17 మంది ఎమ్మెల్సీల్లో కూడా ఆరుగురు కాంగ్రెస్ ను వీడుతామని అంటున్నారు. ఇదే గనక జరిగితే.. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మైనార్టీలో పడే అవకాశం ఉంది. ఈ విషయంలో టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదిపితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలను తనవైపు తిప్పుకుంటే ఛైర్మన్ పదవిని కూడా దక్కించుకోవచ్చు. దీంతో కాంగ్రెస్ పార్టీని శాసన మండలిలో కూడా దెబ్బతీయవచ్చు.
అసెంబ్లీలో కాంగ్రెస్ సరైన ప్రతిపక్షంగా ఉంటుందా…?
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను సక్రమంగా నిర్వహిస్తుందా..? అనుకున్నప్పుడు.. శాసన సభ పక్షం నేతగా జానారెడ్డిని ఎన్నుకోవడంలో కూడా ఓటింగ్ జరిగింది. జానారెడ్డి కాస్త రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనకు ప్రతిపక్ష హోదాను నడిపించే సత్తా ఉందనే భావన ఉంది. అదే సందర్భంలో.. కొత్త ప్రభుత్వం కావున.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ప్రేమానురాగాలు ఏడాది వరకు ఉంటాయి. ఒక సంవత్సరం గడిస్తే… ప్రజలకు ప్రభుత్వం అసమర్థతలు తెలుస్తాయి. అప్పుడే ప్రభుత్వంపై విమర్శలు మొదలవుతాయి. ఆ సందర్భంలో… ప్రతిపక్ష నేతలు, పార్టీలు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవకాశం ఉంటుంది. అంత వరకూ ప్రతిపక్ష పార్టీలు, నేతలు ఎన్ని చెప్పినా ప్రజలు వినిపించుకునే పరిస్థితి ఉండదు. అలాగే.. తెలంగాణ అసెంబ్లీలో టిడిపి ప్రాధాన్యత కూడా బలంగానే ఉంది. టిడిపి సీమాంధ్రలో చేసే మంచి పనుల ప్రభావం తెలంగాణ అసెంబ్లీలో పడే అవకాశం ఉంది. అది చంద్రబాబుపై ఆధారపడి ఉంది. సీమాంధ్రలో టిడిపి ప్రభుత్వం మంచి పనులు చేసి ఆ అనుభవాలు, ఆలోచనలను తెలంగాణ అసెంబ్లీలో ప్రభావితం చేయవచ్చు. తద్వారా.. టిడిపికి రెండు ప్రాంతాల్లోనూ బలపడేందుకు అవకాశం ఏర్పడుతుంది.
కార్యకర్తలను ఉత్సాహపర్చని యువ నేత రాహుల్…
పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే.. రాహుల్ గాంధీ ఎక్కడా ఉత్సాహం కనబర్చలేదు. ఆయన ఒక పార్టీ సభ్యుడిగా ఆ పదేళ్ల కాలంలో తన ప్రభుత్వం తరపున ఎక్కడా సమర్థవంతంగా మాట్లాడలేదు. దేశంలో తమ ప్రభుత్వం చేసిన ఒక్క మంచిపనినైనా… ఒక్క సమస్యపైనా కార్యకర్తలకు వివరించి వారిని ఆకర్షించలేకపోయారు. తన నియోజకవర్గ ప్రజలకు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులను సగం కూడా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయలేకపోయారు. ఇక ఆయన పార్లమెంటు హాజరు శాతం చూస్తే 100కు కేవలం 43 శాతం మాత్రమే ఉంది. అంటే… ఒక విద్యార్థి ఎగ్జామ్స్ రాయడానికి కనీసం 75 శాతం అటెండెన్స్ ఉండాలి. మరీ అంతకు తగ్గితే 10 శాతం మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చి 65 శాతం అన్నా ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థి యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాయడానికి అర్హులు. కానీ.. రాహుల్ గాంధీకి పార్లమెంటు హాజరు శాతం అంతకన్నా హీనంగా ఉంది. ఇలాంటి వ్యక్తి పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలో ఎలా సమర్థవంతంగా కొనసాగుతారనేది అనుమానం.
రాజ్యసభలో పట్టుకోసం బిజెపి ప్రయత్నం…
బిజెపికి రాజ్యసభలో మెజార్టీ లేదు. అక్కడ బలం పెంచుకునేందుకు మోడీ దృష్టి సారించాల్సి ఉంది. అందుకు.. రాజ్యసభలో ప్రాధాన్యత ఉన్న పార్టీలను దగ్గర చేసుకుకోవాలి. అందులో భాగంగానే జయలలిత వంటి నేతలతో చర్చలు జరుపుతున్నారు. రెండోది కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీయేకు సొంతమెజార్టీ వచ్చింది. అలాగే రాజ్యసభలో కూడా సాధించాలని బిజెపి భావిస్తోంది. వచ్చే 2019 ఎన్నికల్లో కూడా ఎన్డీయే పక్షాలు కాకుండా బిజెపినే సొంతంగా మెజార్టీ సాధించాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో జరగనున్న రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఆయా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం ఉన్న మెజార్టీని కూడా దిగజార్చుకునే ఆలోచనలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇచ్చి, తీసుకుని నేతలను ఎంపిక చేస్తే.. పద్ధతి మార్చుకోకపోతే.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో ఇటు రాష్ర్టంలో.. అటు కేంద్రంలో ప్రతిపక్ష హోదా కూడా సరిగా నిర్వహించడం కష్టమేనన్నారు.

About the Author