Published On: Sun, May 12th, 2013

నా జోలికి వస్తే….. కేంద్రానికి మమతాబెనర్జీ సవాల్

Share This
Tags

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు మన్మోహన్ సర్కారు కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. అయినా తాను తల వంచబోనని… కేంద్రానికి దమ్ముంటే తన జోలికి రావాలని సవాల్ విసిరారు. ‘‘తృణమూల్‌ను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అన్ని రకాల కేంద్ర సంస్థలను మోహరించారు. కోల్‌గేట్ కుంభకోణంలోని హీరోలు మనపై (పార్టీ, ప్రభుత్వం) కుట్రపన్నుతున్నారు’’ అని శనివారం కోల్‌కతాలో జరిగిన పార్టీ సభలో మమత ఆరోపించారు. తమ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు పార్టీ ఎంపీల ఆదాయ ఫైళ్లను సేకరించి ఐటీ దాడులు చేసేందుకు కేంద్రం వ్యూహరచన చేసిందన్నారు.

అయినా తాను మాత్రం ఐటీ దాడులు చేసుకోవచ్చని ప్రధానికి చెప్పినట్లు మమత పేర్కొన్నారు. ‘‘మేం మీతో (యూపీఏ ప్రభుత్వం) ఉన్నా చెడ్డవారిగా చూస్తారు…మీతో లేకపోయినా చెడ్డవారిగానే చూస్తారు’’ అని ప్రధానితో అన్నానన్నారు. మాయావతి, ములాయం, జయలలితలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కేంద్రం వారి జోలికి వెళ్లి (కేసులు పెట్టి) దారిలోకి తెచ్చుకోగలిగినా తనను మాత్రం దారిలోకి తెచ్చుకోలేకపోయిందన్నారు. ఇప్పటికీ అవినీతి కేసుల్లోకి తనను లాగాలని చూస్తోందని మమత దుయ్యబట్టారు. ‘‘ఒకవేళ వాళ్లు (కేంద్రం) నా జుట్టు పట్టుకున్నా నేను మాత్రం తలవంచను. నిప్పుతో చెలగాటం ఆడొద్దని రాజు, రాణికి చెబుతున్నా’’ అని మమత హెచ్చరించారు. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని…ఆ ఎన్నికల్లో కేంద్రంలో మార్పు తీసుకొస్తామని మమత జోస్యం చెప్పారు. బెంగాల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవకుండా చూస్తామన్నారు. రాష్ట్రంపై కేంద్రం పన్నుతున్న కుట్రలను పటాపంచలు చేస్తామన్నారు.

About the Author