Published On: Thu, Sep 12th, 2013

అనారోగ్యం ఉంటే అధికారం వద్దంటారా: చౌతాలాపై సుప్రీం వ్యాఖ్యలు

Share This
Tags

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు  తిరస్కరించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన స్కాంలో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా దోషులుగా తేలిన విషయం తెలిసిందే. తనకు అనేక వ్యాధులున్నాయని, అందువల్ల తాను బయటే ఉండేందుకు అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.

చౌతాలా పేర్కొన్న వ్యాధులన్నీ వృద్ధాప్యం కారణంగా వచ్చేవేనని కోర్టు తెలిపింది. ”నాకు ఒకటి అనిపిస్తోంది. ఒకవేళ పిటిషనర్కు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం వస్తే, మాకు చెప్పిన వ్యాధులను కారణంగా చూపించి పదవిని వద్దంటారా” అని జస్టిస్ దత్తు వ్యాఖ్యానించారు. అనారోగ్యం ఉన్నవాళ్లంతా జైలు వద్దంటే, కేవలం ఆరోగ్యవంతులకు మాత్రమే జైలు పరిమితం అవుతుందని జస్టిస్ ముఖోపాధ్యాయ అన్నారు. అయితే.. జైలు అధికారుల వద్ద సెప్టెంబర్ 23లోగా లొంగిపోయేందుకు మాత్రం చౌతాలాకు కోర్టు అనుమతినిచ్చింది. ఆయనకు తగిన, సమర్ధమైన, నిపుణులతో వైద్య చికిత్సలు అందించాలని జైలు అధికారులకు సూచించింది.

About the Author