సెల్ఫీ రాజా రివ్యూ…
కథగా చూసుకుంటే ఈ సినిమాలో ఏమీలేదు. సెల్ఫీల పిచ్చి ఉన్న ఒక కుర్రోడు ఒక అందమైన అమ్మాయిని చూడగానే మనసు పడేసుకుంటాడు. అతడి ఫ్రెండ్ పొరపాటు వల్ల అతడు కమిషనర్ కూతుర్నని అబద్ధం కంటిన్యూ చేయవల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అందరికీ తెలిసిన ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా కమీషనర్ కూతురే. లాజిక్కుల్లేని పెళ్లిచూపులతో వాళ్ళిద్దరికీ పెళ్లిచేసేస్తాడు కమీషనర్. అయితే శోభనం రాత్రే వీళ్లిద్దరి మధ్య గొడవలు., కట్ చేస్తే హీరోని హీరోయిన్ అసహ్యించుకుంటుంది. దాంతో ఆత్మహత్య చేసుకోలేక ఒక కిల్లర్ ను ఏర్పాటు చేసుకుంటాడు. తీరా కిల్లర్ ఎంట్రీ ఇచ్చే టైమ్ కి హీరో, హీరోయిన్ల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి. ఇదిలా ఉంటే కమీషనర్ అంటే పీకలదాకా పగ ఉన్న ఒక క్రిమినల్ కమీషనర్ అల్లుడైన నరేష్ ను చంపడానికి తిరుగుంటాడు. అదీ కథ. ఇలాంటి కథ మధ్యలో అర్ధం పర్ధంలేని సీన్స్ కోకొల్లలు. ఇందులో హీరోకి సెల్ఫీల పిచ్చి చాలా ఉందని సినిమా ఓపెనింగ్ లో ఒక ఎస్టాబ్లిష్ మెంట్ సీన్ ఉంది. జనాలంతా ఇతడ్ని కొట్టడానికి వస్తారు. అయితే అదేం విచిత్రమో గానీ, హీరోయిన్ పరిచయం సీన్స్ లోగానీ, ఆ తరువాత గానీ సెల్ఫీ మ్యానరిజమ్ ను అసలే మాత్రం వాడుకోలేదు. అసలు టైటిల్ కే జస్టిఫికేషన్ జరగలేదు.
పాత్రల విశ్లేషణ..
ఇక కట్టప్ప కామెడీ స్పూఫ్ పేరుతో మాటి మాటికీ తాగుబోతు రమేష్ అల్లరినరేష్ కాలును తన నెత్తి మీద పెట్టుకోవడం జనానికి నిజంగా కంపరమెత్తిస్తుంది. ఈ సినిమాలో రిలీఫ్ ఇచ్చేది కాస్తో కూస్తో పృధ్వి పాత్రే అని చెప్పొచ్చు. పోలీసాఫీసర్ అంకుశం పాత్రను పృధ్వీ ఉతికి ఆరేసాడు. ఇక అజయ్ ఘోష్ లాంటి మంచి విలన్ ను ఈ సినిమాతో చాలా కామెడీ చేసారు. పవర్ ఫుల్ గా విలన్ గా ఎంట్రీ ఇచ్చి జోకర్ లా తయారవుతాడు. సినిమా లో మెయిన్ ట్విస్ట్ అల్లరినరేష్ డ్యూయల్ రోల్. దీన్ని కూడా సరిగ్గా వాడుకోలేదు. రవిబాబు కామెడీ కూడా బోర్ కొట్టిస్తుంది. ఇంకా ఇలా వచ్చి అలా వెళ్లిపోయే బోలెడంత మంది జబర్దస్త్ కమెడియన్లు కూడా ఏమీ ఆకట్టుకోలేకపోయారు. ఫైనల్ గా అల్లరి నరేష్ నుంచి ఈసారి కూడా రొటీన్ బోరింగ్ సినిమాగా సెల్ఫీ రాజా నిలిచిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.