Published On: Sat, Dec 6th, 2014

నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ దుర్మరణం

Share This
Tags

జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో టీడీపీ నేత నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ దుర్మరణం చెందాడు. అతను ప్రయాణిస్తున్న టాటా సఫారీ కారు(ఏపీ 29 బీడీ 2323) అదుపుతప్పడంతో జానకీరాం మృత్యువాత పడ్డాడు. జానకీరామ్ తీవ్రంగా గాయపడిన అనంతరం హుటాహుటీనా కోదాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. హైవేపై వెళుతున్న కారు.. ట్రాక్టర్ ను తప్పించబోయి బోల్తాపడింది. జానకీ రామ్ అతనే స్వయంగా కారు నడుపుతూ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

నందమూరి జానకీరామ్ ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటూ తన తమ్ముడు కల్యాణ్ రామ్ కు సంబంధించిన సినీ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించే వాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జానకీరామ్ పలు చిత్రాలను నిర్మించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ రాత్రికి జానకీ రామ్ మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంచనున్నారు. కుటుంబ సభ్యులందరూ వచ్చిన తరువాత అతని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. జానకీరామ్ ఆకస్మిక మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

About the Author