Published On: Fri, Aug 29th, 2014

రభస రివ్యూ……

Share This
Tags

జూనియర్ ఎన్టీఆర్.. ఒకప్పుడు స్టార్ హీరోల రేసులో టాప్ త్రీలో ఉన్నవాడు. కానీ ఇప్పుడా పొజిషన్ లేదు. వరుసగా వస్తున్న ఫ్లాపులు బుడ్డోడి స్థానాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఈ టైమ్ లో వస్తున్న ‘రభస’ తో దమ్ము చూపకపోతే అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి. అందుకే ఇప్పుడు ‘రభస’ రిజల్ట్ పై ఎన్టీఆర్ అసలు స్థానం తేలిపోతుందంటున్నారు విశ్లేషకులు.

ఎన్టీఆర్ కెరీర్ ఎప్పుడూ నిలకడగా లేదు. ఒక బ్లాక్ బస్టర్ వచ్చిందంటే చాలు. వరుసగా వైఫల్యాలు పలకరించాయి. అయినా ఆ బ్లాక్ బస్టర్స్ తో వచ్చిన క్రేజ్ తో ఆడియన్స్ లో అంతులేని అభిమానం సంపాదించాడీ సింహాద్రి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కాంపీటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. యంగ్ హీరోలంతా వరుసగా హిట్లు కొడుతుంటే యంగ్ టైగర్ మాత్రం ఆ స్థాయిలో దమ్ము చూపలేకపోతున్నాడు.

కధ:తెలుగు సినిమా ఇంకా ‘రెడీ’ (చిత్రం) నుంచి ఇంకా బయిటకు రాలేదని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తుంది. శ్రీను వైట్లను గుర్తు చేసేలా సీన్స్, డైలాగ్స్ రాసుకున్నా సినిమాలో కాంప్లిక్ట్ సరిగ్గా వర్కవుట్ చేయకపోవటం, నెగిటివ్ ఫోర్స్ స్పష్టంగా,బలంగా లేకపోవటంతో తేలిపోయినట్లైంది. అలాగే హీరో తన మరదలు ను వివాహం చేసుకునే దిసగా కథ మొదలెట్టి ఎటెటో వెళ్లిపోతుంది. పోనీ సెకండాఫ్ లో వచ్చి బ్రహ్మానందం ఎప్పటిలాగే రక్షిస్తాడు అనుకుంటే ఆ పాత్ర కొద్దిగా నవ్వించగలిగింది కానీ కథని (రెడీ లాగ) ముందుకు తీసుకువెళ్లేలా క్యారక్టర్ డిజైన్ చెయ్యలేదు. అలాగే అలీ పాత్ర ఎప్పటిదో పాత నాగార్జున అల్లరి అల్లుడులో బ్రహ్మానందం పాత్రను గుర్తుచేసింది..కానీ దానికీ ముగింపు ఇవ్వలేదు. ఇక ప్రణీత పాత్ర సైతం ముగింపు లేకపోవటంలో సమగ్రత లేకుండాపోయింది.

ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమాలో బ్రహ్మానందం పాత్ర బాగా పేలింది అని చెప్పటం కాస్త ఇబ్బందికరమే అయినా ఉన్నంతలో బ్రహ్మీనే థియోటర్ లో కాస్త నవ్వులు పూయించాడు. ఎందుకంటే మొదటి నుంచి ఈ సినిమా యాక్షన్ కామెడీ అని ప్రమోట్ చేసారు. అదే ఎక్సపెక్టేషన్స్ తో థియోటర్ కి వచ్చినవారికి కాస్త రిలీఫ్. అలాగే ఎన్టీఆర్ కాకుండా మరో హీరో చేసి ఉంటే ఈ మాత్రం కూడా చివరివరకూ చూడటం కష్టమయ్యేది.

ఎన్టీఆర్ సినిమాలు ఈ మధ్యన వచ్చేవన్నీ వన్ మ్యాన్ షో లు లాగే నడుస్తున్నాయి. దాదాపు కీలకమైన సీన్స్ ,డ్రామా మొత్తం అతని భుజాల మీద పెట్టి నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ సైతం సమర్ధవంతంగానే మోస్తున్నాడు..కానీ కథలే సహకరించటం లేదు. ఇప్పుడూ అదే జరిగింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్, సెకండాఫ్ లో బ్రహ్మీతో వచ్చే కామెడీ సీన్స్ లో ఎన్టీఆర్ బాగా నవ్వించారు.

రన్ టైం…162 నిముషాలు ఉండటం ఈ సినిమాకు బాగా లెంగ్తీ సినిమా చూసిన ఫీలింగ్ తీసుకు వచ్చింది. మొదటే చెప్పుకున్నట్లు రొటీన్ కథ,కథనం సినిమాను ప్రెష్ నెస్ లేకుండా చేసేసింది. అలాగే ప్రెడిక్టబుల్ ట్విస్ట్ లు సైతం పేలలేదు.. ఇక ఫస్టాఫ్ లో అయితే ఇంటర్వెల్ వచ్చేసినా కథలోకి రారు. సెకండాఫ్ అయితే రెడీ, దూకుడు,బాద్షా,మిర్చి లోంచి కొంచెం కొంచెం తీసుకుని కథ అల్లినట్లు తెలిసిపోతూ ఉంటుంది.

రెండో సినిమాకే ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో దొరకినా వినియోగించుకోలేకపోయారని స్పష్టంగా చెప్పవచ్చు. పరమ రొటీన్ పాయింట్ ని అంతకన్నా పరమ రొటీన్ గా డీల్ చేసారు. దర్శకుడుగా అతని ప్రత్యేకమైన ముద్ర ఏమీ వేయలేకపోయారు.
ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్…శ్యాం కె నాయుడు కెమెరా వర్క్ మాత్రమే. సినిమాని గ్రాండ్ గా చూపిస్తూ లొకేషన్స్ ఎలివేట్ చేసారు. దర్శకుడు ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. చాలా చోట్ల రిపీట్ అయ్యిన ఫీలింగ్ వచ్చింది.

About the Author