Published On: Fri, Jun 13th, 2014

క(న)వ్వించని ‘జంప్ జిలానీ’

Share This
Tags

‘కలగలప్పు’ అనే తమిళ సినిమా రీమేక్ తో తెలుగులో వచ్చిన సినిమా ‘జంప్ జిలానీ’. మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న నరేష్ గత సంవత్సరం నుంచి హిట్ కు దూరంగానే వున్నాడు. అయితే ఇప్పుడు వచ్చిన జంప్ జిలానీ సినిమాలో నరేష్ ద్విపాత్రాభినయంలో నటించినా పెద్దగా తేడా కనిపించదు. ‘సుడిగాడు’ తర్వాత ‘సుడి’ గాడి తప్పిన నరేష్ కి అన్నీ అపజయాలే ఎదురయ్యాయి. దీంతో కలిసొచ్చిన కామిడీని నవ్వించలేక వెలవెలబోయింది. ప్రయోగాలు, ఫార్ములాలు ఏవీ కూడా సక్సెస్ ట్రాక్ ని ఎక్కించలేకపోయాయి. ఇక లాభం లేదనుకుని, సాంప్రదాయ కామెడీని నమ్ముకొని ఈసారి సక్సెస్ లోకి జంప్ చేద్దామని ప్రయత్నించాడు ఈ అల్లరోడు. కామెడీ డైరెక్టరుగా ‘ఓ చినదానా’ చిత్రంతో సక్సెస్ అందుకున్న దర్శకుడు ఇ.సత్తిబాబు. అల్లరి నరేష్ తో హిట్టివ్వాలని ‘జంప్ జిలానీ’ ప్లాన్ చేశాడు. ఫ్యామిలీ సినిమాలు, కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసినా మొత్తానికి తనకు బాగా కలిసొచ్చిన కామెడీనే నమ్ముకున్నాడు. ఈ సినిమా గురువారం విడుదలైంది మరి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా ? లేదా ? అనేది తెలుసుకుందామా ?
కథ ఏమిటి?
నిడదవోలులో ఈ కథ మొదలవుతుంది. సత్తిబాబు, రాంబాబు (నరేష్) కవలలు. ఒకడు దొంగైతే, ఇంకొకడు కష్టాలను అబద్ధాలతో దాటి రోజు గడుపుకునే అమాయకుడు. తన తాతల నాటి హోటల్ ను కాపాడుకుని దానికి పూర్వ వైభవం తీసుకురావాలనేది సత్తిబాబు, అతని తాత ఆశయం కూడా. మేనకోడలు గంగ (స్వాతి దీక్షిత్)ను సత్తిబాబుకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు సత్తిబాబు తాత. అయితే గంగ దొంగ బావ రాంబాబును ప్రేమిస్తుంది. సత్తిబాబు రెవిన్యూ డిపార్ట్మెంటులో పనిచేసే మాధవి(ఇషాచావ్లా) ని ఇష్టపడతాడు. అదే టౌన్ లో ఒక వ్యాపారి (భరత్) సత్తిబాబు స్థలంపై కన్నేస్తాడు. మాధవి బావ ఫాక్షనిస్టు ఉగ్రనరసింహారెడ్డి (పోసాని) ఎలాగైనా మరదలిని పెళ్ళాడాలని పట్టుబడతాడు. మరి ఈ జంటలు ఎలా కలిశాయి? ఆ హోటల్ పరిస్థితి ఏంటనేది మిగిలిన కథ.
మైనస్ పాయింట్లు
కామెడీ చేయడానికి కావలసినన్ని సన్నివేశాల్ని జాగ్రత్తగా రాసుకున్న సత్తిబాబు లెంగ్త్ విషయాన్ని గాలికొదిలేశాడు. అందుకే ఒకే కంటెంట్ ఉన్న సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ రిపీటవుతూ ఉంటాయి. ప్రేమ విషయంలో హీరోయిన్స్ కి హీరోల మీదుండే ఇష్టం రకరకాల సన్నివేశాలలో ఒకే పాయింట్ చెబుతుంది. అదే కాస్త విసుగు తెప్పించింది. అదే పరుగులు పెట్టాల్సిన కథకు బ్రేకులు వేసి, జరిగేలా చేసింది. అల్లరి నరేష్ ఈ సినిమాతో తన పాత సినిమాను గుర్తు చేశాడు. తనను ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడ్డారో, అలాగే కనిపించాలని కష్టపడ్డాడు. చాలాసార్లు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలాసార్లు నవ్వుకుంటారు. అంతకన్నా ఎక్కువసార్లు విసుగు చెందుతారు. కారణం, రిపీటైన సన్నివేశాలు, ముందుకు సాగని కథనం, పరమబోర్ కొట్టించే పాటలు.
సినిమాకి చాలా క్లైమాక్సులు ప్లాన్ చేసినట్టున్నాడు దర్శకుడు. వాటిల్లో ఏది డిసైడ్ చేసుకోవాలో తెలియక ఆ ఛాయిస్ ను ప్రేక్షకులకే ఒదిలేశాడు. అదే పెద్ద మైనస్. రాయలసీమలో ముగియాల్సిన కథను నిడదవోలు వరకు సాగదీశాడు.
ప్లస్ పాయింట్లు
రైటర్ క్రాంతి మాటలు బాగున్నాయి. కామెడీ సన్నివేశాలతో కాకుండా మాటలతో నిలబెట్టాడు. రొటీన్ సన్నివేశాలకు మాటల చెణుకులు తోడై, కవ్వించాయి. అల్లరి నరేష్ కొత్తగా చేసిందేమీ లేకపోయినా నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. స్వాతి దీక్షిత్ తాను గ్లామర్ పాత్రలకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుంది. ఇషా చావ్లా పాత్ర బావుంది. పాటలు బాగుంటే, వీరి పాత్రలు ఇంకాస్త ఎలివేట్ అయివుండేవి. కానీ అవి మైనస్ అవడంతో, వీరి పాత్రలు కూడా అసంతృప్తిగానే తయారయ్యాయి.
కాస్త వినోదానికి చాలా ఓపికపట్టాలి
తాగుబోతు రమేష్ తో ‘నేనో రొటీన్ సినిమా చేస్తున్నాను’ అని చెప్పించి మంచి పని చేశాడు దర్శకుడు. పోసానితో అన్ని రకాల పాత్రలు చేయించాలని అనుకోవడం ఎంత సాహసమో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. రాయలసీమ ఎపిసోడ్ మొత్తం నాసిరకంగా తయారైంది. మిగిలిన పాత్రలు, రఘుబాబు, రావి రమేష్, ఎమ్మెస్ లు పాత్రలకు న్యాయం చేశారు. మొత్తంగా జంప్ జిలాని కాస్త నవ్వులందించింది. అల్లరి నరేష్ గత చిత్రాలతో పోలిస్తే కాస్త బెటర్ అనిపించుకున్నా టోటల్ జర్నీ మాత్రం విసుగ్గానే సాగింది. ఆ కాస్త వినోదం అందుకోవాలంటే, ఎక్కువ ఓపిక కావాల్సిందే. సినిమా థియేటర్లో జంప్ చేసి నవ్వుకోడానికి ఓకే గానీ, ద్వితీయార్థానికి వచ్చేసరికి మనం జంప్ జిలానీ అవ్వాలనే పరిస్థితులను కల్పిస్తుంది ఈ సినిమా.

About the Author