హెచ్-1బీ వీసాలకు అనూహ్య స్పందన
అమెరికా హెచ్-1బీ వీసాలకు డిమాండ్ ఏటేటా పెరిగిపోతూనే ఉంది. ఈ వీసాలకు దరఖాస్తులను ఆహ్వానించిన తొలిరోజే అనూహ్య స్పందన వచ్చింది. అందుబాటులో 65 వేల వీసాలు ఉండగా మొదటిరోజే 50 వేల దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2014 ఆర్థిక సంవత్సరానికిగాను (ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ప్రారంభమవుతుంది) అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్‌సీఐసీ) ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బీ వీసాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది.
శుక్రవారంతో ఈ గడువు ముగిసింది. తొలిరోజు వచ్చిన దరఖాస్తులపై యూఎస్‌సీఐసీ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించకపోయినా.. వాటి సంఖ్య 50 వేల దాకా ఉండొచ్చని వర్జీనియాకు చెందిన ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ ఫెడరల్ తెలిపింది. యూఎస్‌సీఐసీ గరిష్టంగా 65 వేల వీసాలను కేటాయిస్తుంది. వీటి కి అదనంగా అమెరికాలోని విద్యాసంస్థల నుంచి మాస్టర్ డిగ్రీలు, ఆపై ఉన్నత విద్య అభ్యసించినవారికి మరో 20 వేల వీసాలను అందిస్తుంది. హెచ్-1బీ వీసాలకు పరిమితికి మించి దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ పద్ధతిన వాటిని కేటాయిస్తారు.