Published On: Sat, May 11th, 2013

మొక్కల నుంచి సౌరశక్తి!

Share This
Tags

సోలార్ విద్యుత్ తయారీకి కొత్త పద్ధతి
భారత సంతతి శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరణ

మొక్కల నుంచి సౌర శక్తిని సంగ్రహించి విద్యుత్‌గా మార్చుకునే సరికొత్త పద్ధతిని ‘యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పర్యావరణ హితం, సుస్థిరమైన ఈ విధానం ఆవిష్కరణలో భారత సంతతి పరిశోధకులు రామరాజ రామస్వామి, యోగేశ్వరన్ ఉమాశంకర్ కూడా కీలక పాత్ర పోషించారు.

సూర్యకాంతిని చాలా మొక్కలు వంద శాతం వరకూ ఉపయోగించుకుని శక్తిని సమకూర్చుకుంటాయి. కాబట్టి.. అవి తయారుచేసుకునే శక్తిని విద్యుత్‌గా మార్చుకోగలిగితే.. వందశాతం సౌరశక్తిని ఉపయోగించుకోవచ్చని రామస్వామి వెల్లడించారు. ప్రస్తుతం మొక్కల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాలను అభివృద్ధిపరుస్తున్నామని, త్వరలోనే తక్కువ విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగించే పరికరాలు సిద్ధం చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం సౌర విద్యుత్ పలకల ద్వారా 12-17 శాతం విద్యుతే తయారవుతోందని, తమ పద్ధతితో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుందన్నారు.

మొక్కల నుంచి సౌరశక్తిని ఇలా తీసుకోవచ్చు…
కోట్ల ఏళ్ల పరిణామక్రమంలో సూర్యకాంతిని వంద శాతం వాడుకునే సామర్థ్యం చాలా మొక్కలకు ఏర్పడింది. ఎన్ని ఫొటాన్(కాంతి ప్రమాణం)ల కాంతిని గ్రహిస్తాయో అన్ని ఎలక్ట్రాన్‌లను మొక్కలు ఉత్పత్తి చేసుకోగలుగుతాయి. అయితే, కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియ ద్వారా ఈ ఎలక్ట్రాన్‌లను మొక్కలు చక్కెరలుగా మార్చుకోకముందే వాటిని ఒడిసిపట్టే పద్ధతిని రామస్వామి బృందం ఆవిష్కరించింది. ఇందుకుగాను.. కాంతి నుంచి శక్తిని గ్రహించి నిల్వ చేసేందుకు ఉపయోగపడే మొక్కల పత్రహరితంలోని థైలకాయిడ్స్ అనే కణాంగాలను వారు వేరుచేశారు.

తర్వాత థైలకాయిడ్‌లలో ఎలక్ట్రాన్‌ల ప్రవాహాన్ని నిరోధించేలా ప్రొటీన్లను నియంత్రించారు. ఇలా మార్పుచేసిన థైలకాయిడ్లను ప్రత్యేకంగా డిజైన్ చేసిన అతిసూక్ష్మ కార్బన్ నానోట్యూబులపై అమర్చారు. మనిషి వెంట్రుకతో పోలిస్తే 50 వేల రెట్లు సన్నగా ఉండే ఈ ట్యూబులను మొక్కల్లో ప్రవేశపెట్టారు. ఇంకేం.. విద్యుత్ వాహకాలు (కండక్టర్లు)గా పనిచేసిన నానోట్యూబులు.. మొక్కల్లో ఉత్పత్తి అయిన ఎలక్ట్రాన్‌లను ఎప్పటికప్పుడు తీగ ద్వారా రవాణా చేసేశాయి. ప్రస్తుతం ఈ విధానంలో స్థిరంగా, ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేలా పరికరాన్ని అభివృద్ధిపరుస్తున్నామని రామస్వామి తెలిపారు. వీరి పరిశోధన వివరాలు ‘ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

About the Author