పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలే..
రాష్ట్రం విడిపోయినప్పటికీ పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాల ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు జరగుతాయని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు చెబుతోంది. అయితే ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య విద్యార్థులకు మాత్రమే ఈ వెసులు బాటు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో, ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇరు రాష్ట్రాలుగా విడిపోయినా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రవేశ విధానాలే పదేళ్లపాటు కొనసాగుతాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సైతం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 2 అపాయింటెడ్ డే నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఉమ్మడి ప్రవేశాలు ఇంటర్మీడియట్, అంతకంటే తక్కువస్థాయి విద్యాసంస్థలకు వర్తించదు. ఇక ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉన్నత, సాంకేతిక వైద్య విద్యల్లో ఇప్పుడున్న విధానాన్నే కొనసాగిస్తారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశువైద్యం, న్యాయ, వేద విద్యాభ్యాస సంస్థలను కూడా దీని పరిధిలో చేర్చారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న 750 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. 34 వైద్య విద్య కళాశాలల్లో 3250 మంది విద్యార్థులు, 300 పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు బీ.ఫార్మసీ, ఎం ఫార్మసీ విద్యాసంస్థల్లో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు.
నూతన విద్యా సంస్ధలిలా..
రాష్ట్ర పునర్ విభజన బిల్లు-2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ, 13వ పంచవర్ష ప్రణాళికల కాలంలో జాతీయ ప్రాధాన్యం గల సంస్థలను ఏర్పాటు చేయటానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీటిలో ఒక ఐఐటీ, ఒక ఎన్‌ఐటీ, ఒక ఐఐఎం, ఒక ఐఐఎస్‌ఈఆర్, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఒక వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఒక ట్రిపుల్ ఐటీ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి-బోధన సంస్థను భారత ప్రభుత్వం నెలకొల్పుతుంది. భారత ప్రభుత్వం ఇరు రాష్ట్రాలలోనూ ఒక్కొక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యానవన విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పుతారు.
విద్యాశాఖలో విభజన మార్పులిలా..
రాష్ట్ర విభజన నేపధ్యంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖలోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. పాఠశాల విద్యాశాఖకు ప్రస్తుతం ఇద్దరు ముఖ్య కార్యదర్శులున్నారు. విద్యాశాఖ డైరెక్టర్ గా ఐఎఎస్ కేడర్ కు చెందిన వ్యక్తి , రాజీవ్ విద్యామిషన్ పిడి గా మరో ఐఎఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నారు. విభజన నేపథ్యంలో ఇకపై ఇరు రాష్ట్రాలకు ఒక్కో ముఖ్య కార్యదర్శి అంటే ఐఎఎస్ కేడర్ వ్యక్తి మాత్రమే ఉంటారు. వీరికి సంబంధించిన కార్యాలయాల మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక ఇంటర్ విద్యామండలి, ఇంటర్ విద్యాశాఖ కమిషనరేట్ బాధ్యతలను ఒకే సీనియర్ ఐఎఎస్ అధికారి నిర్వహించనున్నారు. మరోవైపు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా విధులు నిర్వహించే ఐఎఎస్ అధికారి కళాశాల విద్యాశాఖ కమిషనర్ గా వ్యవహరించనున్నారు. జూన్ 2 న అపాయింటెడ్ డే అమల్లోకి వచ్చినప్పుటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.