Published On: Mon, Jan 6th, 2014

నింగికెగసి.. నేలకు జారి…

Share This
Tags

తెలుగు చిత్ర సీమలోకి అనూహ్యంగా దూసుకొచ్చిన యువ కిరణం కనుమరుగయింది. ఇక సెలవంటూ కానరాని లోకాలకు తరలిపోయింది. రంగుల ప్రపంచంలోని చీకట్లను బట్టబయలు చేస్తూ బాధగా నిష్ర్రమించింది. ‘హ్యాట్రిక్ హీరో’గా జేజేలు అందుకున్న చోటే వెక్కిరింపులు పలకరించడంతో నిశ్శబ్దంగా తనువు చాలించింది. ‘లవర్ బాయ్’గా అభిమానులను అలరించిన యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అభిమానులను, సన్నిహితులను శోక సాగరంలో ముంచి తన దారి తాను చూసుకున్నాడు.

ఎవరి అండ లేకుండా 2000వ సంత్సరంలో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ మూడు వరుస విజయాలతో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే సినిమాలతో హిట్ కొట్టారు. హ్యాట్రిక్ విజయాలతో ఉదయ్ కిరణ్ పేరు మార్మోగింది. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేశాడు. ప్రేమకథా చిత్రాలకు చిరునామాగా నిలిచిన ఉదయ్ కిరణ్కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా మహిళలు అతడిని విపరీతంగా అభిమానించారు. కమల్ హాసన్ తర్వాత చిన్న వయసులో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు ఉదయ్.

ఎంత వేగంగా అగ్రస్థానానికి చేరుకున్నాడో అంతే వేగంగా కిందకి పడిపోయాడు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మూడేళ్ల తర్వాత అతడి పతనం ఆరంభమయింది. స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో ఓ అగ్ర నటుడు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే అనుకోని కారణాలతో ఈ పెళ్లి జరగకపోవడంతో ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ పట్టాలు తప్పింది. అగ్ర హీరోకు భయపడి అతడికి ఎవరూ అవకాశాలు ఇవ్వరాలేదు. అడపా దడపా చేసిన సినిమాలు పరాజయాలు చవిచూడడంతో అతడి ప్రభ తగ్గింది. తమిళంలో చేసిన సినిమాలు ఆదుకోలేకపోయాయి. కెరీర్ లో చేసిన 19 సినిమాల్లో మొదటి మూడు సినిమాలే హిట్గా నిలిచాయి.

కెరీర్ పతనం, తల్లి మరణం, తండ్రితో కలహాలు అతడిని ఉక్కిరి బక్కిరి చేశాయి. చిన్న వయసులో వచ్చిన స్టార్డమ్ను నిలుపుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో తన ఇంటికే పరిమితమయ్యాడు. ఎవరూలేని సమయం చూసి ప్రాణాలు తీసుకున్నాడు. జీవితంలో తనకెదురైన ఎదురుదెబ్బలను సమర్థవంతంగా కాచుకున్న ఈ యువ హీరో ఒక్క క్షణం ఆలోచించివుంటే ఇంత దారుణానికి ఒడిగట్టేవాడు కాదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. గెలుపోటములు జీవితంలో సహజం. కాలం కలిసిరానంత మాత్రాన కడతేరిపోవడం న్యాయం కాదు. బతికుంటే ఎప్పుడైనా సాధింవచ్చన్న వాస్తవాన్ని గుర్తించాలి. ముఖ్యంగా సినిమా రంగంలో కొనసాగే యువత ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.

About the Author