Published On: Fri, Mar 1st, 2013

కొత్త పోప్‌కు విధేయుడిగా ఉంటా

Share This
Tags

తన తర్వాత కొత్తగా బాధ్యతలు స్వీకరించే పోప్‌కు బేషరతుగా విధేయుడిగా ఉంటానని పోప్ బెనెడిక్ట్ గురువారం ప్రకటించారు. పోప్‌గా తన పదవికి రాజీనామా చేసిన బెనెడిక్ట్, గురువారం నాటితో పదవి నుంచి వైదొలగుతున్న సందర్భంగా వాటికన్‌లోని క్లెమెంటైన్ హాలులో కేథలిక్ మతాధికారులకు వీడ్కోలు పలుకుతూ తుది ప్రసంగం చేశారు. తదుపరి పోప్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తి పట్ల పూర్తి విధేయతతో, భక్తితో ఉంటానని అన్నారు. భవిష్యత్ పోప్‌ను భగవంతుడే నిర్ణయిస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మతాధికారులు గౌరవసూచకంగా పోప్ చేతికి ధరించిన అధికారిక ఉంగరాన్ని ముద్దాడి ఘనంగా వీడ్కోలు పలికారు. రెండువేల సంవత్సరాల చర్చి చరిత్రలో పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన రెండో పోప్ బెనెడిక్ట్ కావడం గమనార్హం. అన్నీ ఆలోచించిన తర్వాతే చర్చి మేలు కోసమే పదవికి రాజీనామా చేస్తున్నట్టు బెనడిక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై ఆయనను ‘రోమన్ పాంటిఫ్ ఎమెరిటస్’ (గౌరవ పోప్)గా పిలుస్తారు. బెనెడిక్ట్‌కు ముందు 1294వ సంవత్సరంలో పోప్ సెలెస్టైన్-5 కొద్ది నెలల కాలమే పదవిలో కొనసాగి, వాటికన్ అవినీతిని సహించలేక రాజీనామా చేశారు.

About the Author