Published On: Fri, Apr 4th, 2014

కర్ణాటకలో మెగా బ్రదర్స్ ప్రచారం?

Share This
Tags

టాలీవుడ్ మెగా ఫ్యామీలి అంతర్గత పోరు కర్ణాటకలో రచ్చకెక్కనుంది. ఇందుకు లోక్‌సభ ఎన్నికలు వేదికగా మారాయి. దీంతో కొన్ని రోజుల క్రితం వరకు ఒక్కటిగా ఉన్న కర్ణాటక మెగా ఫ్యామిలీ అభిమానులు నువ్వా.. నేనా తేల్చుకుందాం రా.. అంటూ వీధిన పడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి తమ అభిమాన నటుడు వస్తే పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరుఫున కేంద్ర మంత్రి చిరంజీవి, బీజేపీ తరుఫున పవన్‌కళ్యాణ్ ప్రచారం చేస్తారని ఇప్పటికే కర్ణాటకలో ఊహగానాలు చెలరేగాయి. ఇందుకు అభిమానుల చర్యలు బలమిస్తున్నాయి. బెంగళూరు సెంట్రల్, ఉత్తర, దక్షిణ, గ్రామీణ జిల్లా, కోలారు, చిక్కబళ్లాపుర, తుమకూరు, బళ్లారి తదితర లోక్‌సభ నియోజకవర్గాల్లో చిరంజీవి, పవన్‌కళ్యాణ్ ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షల మంది తెలుగు వారి ఓట్లను మెగా బ్రదర్స్ ప్రచారం ద్వారా కొల్లగొట్టేందుకు ఆయా పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. ఇది వాస్తవమేనంటూ బహిరంగంగా ప్రచారం కూడా చేసేస్తున్నారు. కాగా, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున చిరంజీవి చేసిన ప్రచారం ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. ఆయన ప్రచారం చేసిన పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

ఈ నెల 8న చిక్కబళ్లాపురలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు మోడి హాజరుకానున్నారు. ఇదే సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారని ఆయన అభిమానాలు పేర్కొంటున్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం ద్వారా తెలుగు జాతి విభజనకు సహకరించిన వీరప్ప మొయిలీకి బుద్ధి చెప్పాలని పవర్‌స్టార్ అభిమానులు పిలుపునిస్తున్నారు. ఆంధ్రులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలను సైతం అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు. మొత్తం మీద కర్ణాటకలో మెగా బ్రదర్స్ ప్రచారాల ‘ షో ’లకు ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.

About the Author