Published On: Sun, Jun 1st, 2014

ఇన్ఫోసిస్‌పై కమ్ముకున్న నీలినీడలు….

Share This
Tags

ఇన్ఫోసిస్ భారతదేశ ఐటీ దిగ్గజం. దాని గత వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగానూ ఓ వెలుగు వెలిగిన ఇన్ఫోసిస్ ను ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. ఇన్ఫోసిస్ లో ఉద్యోగం అంటే ఒకప్పుడు వైభోగం. విశాలమైన స్థలంలో సిలికాన్ వ్యాలీ లాంటి హెడ్ క్వార్టర్స్, ఫుడ్ కోర్ట్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ జిమ్నాసియమ్స్ ఇంటికి వెళ్లకుండా అక్కడే వుండిపోవాలనిపించే వాతావరణం. అయితే అన్నింటినీ వదులుకొని ఉద్యోగులు బయటికొచ్చేస్తున్నారు. ఇన్ఫోసిస్ పై క్రేజ్ ఎందుకు తగ్గిపోయింది? దాని బ్రాండ్ వాల్యూ గ్రాఫ్ ఎందుకలా పడిపోతోంది?
ఏడాది క్రితం మరలా పగ్గాలు చేపట్టిన నారాయణమూర్తి….
సరిగ్గా ఏడాది క్రితం… లాస్ట్ జూన్ లో నారాయణమూర్తి మళ్లీ ఇన్ఫోసిస్ పగ్గాలు చేపట్టారు. సరిగ్గా ఈ ఏడాదికాలంలో పదిమంది హెడ్స్ ఇన్ఫీకి గుడ్ బై చెప్పేశారు. ప్రధాన్, సుధీర్ చతుర్వేది, అశోక్ వేమూరి, కార్తీక్ జయరామన్, వి.బాలకృష్ణన్, సుబ్రమణ్యం గోపరాజు ఇలా కీలక పొజిషన్ లో వున్న వాళ్లు కంపెనీ నుంచి తప్పుకున్నారు. చివరికి ఇప్పుడు కంపెనీ ప్రెసిడెంట్, డైరెక్టర్ల బోర్డ్ మెంబర్ బి.జి. శ్రీనివాస్ కూడా రాజీనామా చేయడం ఇన్ఫోసిస్ లో ప్రకంపనలు పుట్టించింది. ఇన్ఫోసిస్ సీఈఓ రేస్ లో వున్న శ్రీనివాస్ రిజైన్ చేయడం ఎవరూ ఊహించని పరిణామం. అంతేకాదు సీఈఓ రేస్ లో వున్న మరో హెడ్ శిబూలాల్ కూడా రాజీనామా ప్రకటించేశారు. ఐటీ రంగంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
ఉద్యోగుల్లోనూ పెరిగిన వలసలు…
డిపార్ట్ మెంట్ హెడ్సే కాదు… ఉద్యోగుల్లోనూ వలసలు పెరిగిపోయాయి. విప్రో, టీసీఎస్ లాంటి కాంపిటీటర్లతో పోల్చితే ఇన్ఫోసిస్ నుంచి బయటికి వెళ్లిపోతున్న ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువ. లక్షా అరవై వేల మంది ఉద్యోగుల్లో దాదాపు ఐదో వంతు మంది బెటర్ ఆప్షన్లు చూసుకుంటూ బయటికెళ్లిపోయారు.
జీతాల పెరుగుదల చాలా తక్కువ….
ఇతర ఐటీ కంపెనీలతో పోల్చితే ఇన్ఫోసిస్ లో జీతాల పెరుగుదల చాలా తక్కువ. టీసీఎస్ ఉద్యోగుల వేతనాలు సగటున పదిశాతం పెరుగుతున్నాయి. ఇన్ఫోసిస్ లో మాత్రం ఇది ఆరునుంచి ఏడు శాతం మాత్రమే. శాలరీస్ హైక్ విషయంలో ఇన్ఫోసిస్ వెనకబడి వుండడం ఉద్యోగుల వలసకు ఒక ప్రధాన కారణం. అయితే, అంతకంటే బలమైన కారణాలు ఇంకా అనేకం వున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇన్ఫోసిస్ గ్రోత్ రేట్ ఒకప్పుడు బ్రహ్మాండంగా వుంది. ప్రతి ఏటా బిజినెస్ విస్తరించుకొని, కొత్త రంగాల్లోకి ఎంటరయ్యేది. కానీ ఇప్పుడు వ్యాపారం చాలా మందగించింది. టర్నోవర్, ప్రాఫిట్స్ లో వృద్ధి నత్తను తలపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో డైనమిక్ గా వున్న ఇన్ఫోసిస్ క్రమంగా ట్రెడిషనల్ సంస్థగా మారిపోవడం, కొత్త సవాళ్లను అధిగమించే సన్నాహాలు లేకపోవడం ఈ అంశాలన్నీ ఉద్యోగుల్లో తమ కెరీర్ పట్ల ఆందోళన కలిగిస్తున్నాయి. వలసలను ఆపడానికి మేనేజ్ మెంట్ ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు.
కంపెనీ షేర్ ధరపైనా తీవ్ర ప్రభావం
నారాయణ మూర్తి హయాంలోనే ఒక వెలుగు వెలిగింది ఇన్ఫోసిస్. అదే నారాయణమూర్తి హయాంలో ఇప్పుడు సంక్షోభం నెలకొనడం ఆసక్తికర పరిణామం. ఇన్ఫోసిస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కంపెనీ షేర్ ధరపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు ఇన్ఫీ షేరును దొరకబుచ్చుకోవాలంటే చాలా కష్టంగా వుండేది. ఇప్పుడు కుప్పలుతెప్పలుగా ఇన్ఫీ షేర్లు మార్కెట్లోకి వచ్చి పడుతున్నాయి. శ్రీనివాస్ రాజీనామా వార్తతో ఇన్వెస్టర్లు షాక్ తిన్నారు. ఇన్ఫీ షేర్లను వదిలించుకోవడానికి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. కొనేవాళ్లు లేకపోవడంతో షేర్ ధర కుప్పకూలింది. గురువారం నాడు ఇన్ఫీ షేర్ ధర ఎనిమిది శాతం దాదాపు 250 రూపాయలు పడిపోయింది.
సిస్ అంటే సుస్తీ….
చాలా జబ్బుల పేర్లకు చివర్లో సిస్ అని వుంటుంది. సిస్ అని వుంటే.. అదేదో జబ్బు పేరు అని చెప్పేయవచ్చు. మరి నారాయణమూర్తి తన కంపెనీకి ఇన్ఫో…సిస్ పేరు ఎందుకు పెట్టారో తెలియదు. ఏమైనా ఇన్ఫోసిస్ కి సుస్తీ చేసింది. జబ్బు నయంచేసి ఉద్యోగుల్లో కాన్ఫిడెన్స్, ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించే వైద్యం నారాయణమూర్తే చేస్తారో బయటి నుంచి స్పెషలిస్ట్ ని పిలిపిస్తారో చూడాలి.

About the Author