Published On: Thu, Mar 5th, 2020

ఆలోచనల్ని ప్రపంచానికి పంచుకునే అరుదైన అవకాశం ఇది…..

Share This
Tags

సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్టు ట్వీట్‌ చేసి దేశవ్యాప్త చర్చకు తెరలేపిన ప్రధాని మోదీ అన్ని రకాల ఊహాగానాలకు తెరదించారు. తన సోషల్‌ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను అందరిలోనూ స్ఫూర్తిని నింపే మహిళలకి ఆదివారం అంకితం ఇస్తున్నట్టుగా మంగళవారం మరో ట్వీట్‌ ద్వారా స్పష్టం చేశారు. ‘ఈ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని నా సోషల్‌ మీడియా ఖాతాలను ఏ మహిళల జీవితాలైతే అందరిలోనూ స్ఫూర్తిని నింపుతాయో, వారు చేసే పనులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయో వారికి అంకితం ఇస్తున్నాను. అలాంటి మహిళల నిజ జీవిత గాథలు లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తాయి’ అని ట్వీట్‌ చేశారు.

‘మీరు అలాంటి మహిళ అయినా, లేదంటే అలాంటి స్ఫూర్తిని రగిల్చే మహిళల గురించి మీకు తెలిసినా వారి జీవిత గాథల్ని # SheInspiresUs అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేయండి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా వచ్చిన పోస్టుల్లో ఎంపిక చేసిన కొన్నింటికి ప్రధాని అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసే అవకాశం లభిస్తుంది. ఇక యూట్యూబ్‌లో మోదీ అకౌంట్‌ ద్వారా వీడియోలు పోస్టు చేసే అవకాశం వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లు ఉన్న రాజకీయనాయకుడు మోదీయే. ఆయనకి ట్విట్టర్‌లో 5.33 కోట్లు, ఫేస్‌బుక్‌లో 4.4 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.52 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌ ఖాతాను 3.2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.

విదేశీ మాధ్యమాలను నిషేధించడానికేనా?
వచ్చే ఆదివారం సోషల్‌ మీడియా నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్టుగా ప్రధాని ట్వీట్‌ వెలువడగానే రకరకాల వదంతులు చెలరేగాయి. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడానికి మోదీ ట్వీట్‌ సంకేతమా అని సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడానికే మోదీ ఈ ట్వీట్‌ చేసి ఉంటారని ఆరెస్సెస్‌ నేతలు ఆశగా ఎదురు చూశారు. చాలా కాలంగా మన దేశంలో తయారైన యాప్‌లే వాడాలని డిమాండ్‌ చేస్తున్నట్టు స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జాతీయ కో కన్వీనర్‌ అశ్వని మహాజన్‌ తెలిపారు. అయితే మోదీ అభిమానులు ఆయన సోషల్‌ మీడియా నుంచి వెళ్లిపోతే తామూ బయటకు వచ్చేస్తామంటూ లక్షలాది మంది ట్వీట్‌ చేశారు. ఐ విల్‌ ఆల్సో లీవ్‌ హ్యాష్‌ట్యాగ్‌ భారీగా ట్రెండ్‌ అయింది

Key Words: Modi quits from social media

About the Author