28,150 వీఆర్వో కార్యాలయాలు : రఘువీరా
రాష్ట్రంలో 28,150 గ్రామ రెవెన్యూ అధికారులకు (వీఆ ర్వోలు) కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు ఆ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు నెలల్లో ఏడు వేల వీఆర్వో,
వీఆర్‌ఏ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 52 అర్బన్ తహశీళ్ల ఏర్పాటుకు నిర్ణయించామని, వాటిలో 25 తహశీల్‌ల ఏర్పాటుకు వారంలోగా జీవో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మిగతావి రెండు మూడు నెలలలోగా ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా మరో ఎనిమిది రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్టులకు గ్యాస్ కొరతకు కారణం టీడీపీయే అని మంత్రి విమర్శించారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, బీజేపీతో కుమ్మక్కై చంద్రబాబు రాష్ట్ర గ్యాస్ కోటాను ఇతర రాష్ట్రాలకు తరలించారన్నారు. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా విద్యుత్తు కొరతను తీర్చే చర్యలు తీసుకుంటున్నామన్నారు.