Published On: Sat, Aug 31st, 2013

వృద్ధికి తూట్లు!

Share This
Tags

దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. పస్తుత ఆర్థిక సంవత్సరం, మొదటి త్రైమాసికంతో (2013-14, ఏప్రిల్-జూన్, క్యూ1)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరింత కిందికి జారిపోయింది. నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో 4.4 శాతంగా నమోదయ్యింది. కేంద్ర గణాంకాల సంస్థ  శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రధాన రంగాలైన తయారీ, మైనింగ్‌ల అత్యంత పేలవ పనితీరు ఈ గణాంకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. 2012-13 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌తో పోల్చుకుంటే, గడచిన త్రైమాసికంలో ఈ రెండు రంగాల్లో అసలు వృద్ధి లేకపోగా, క్షీణతను నమోదుచేసుకున్నాయి. నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, హోటల్స్ అండ్ రవాణాసహా పలు రంగాల్లో సైతం మెరుగైన ఫలితాలు లేకపోవడం వృద్ధి తీరును తీవ్రంగా దెబ్బతీసింది. 2012-13 ఇదే కాలంలో జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతం. నెలల్లో వరుసగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో అంటే 2013 జనవరి-మార్చి మధ్య 4.8 శాతం.  రెండు విధాలా పోల్చినా వృద్ధి రేటు పడిపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి, ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే వివిధ రంగాల తీరు ఇలా…

అన్నీ తక్కువే…
తయారీ: మొత్తం జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన తయారీ రంగం క్షీణత మరింత పెరిగింది. ఇది -1 శాతం నుంచి -1.2 శాతానికి పడింది.

మైనింగ్, క్వారీయింగ్: 0.4 శాతంగా ఉన్న వృద్ధి రేటు, గడచిన క్వార్టర్‌లో 2.8 శాతం క్షీణత (-)లోకి జారిపోయింది.

వ్యవసాయం: జీడీపీలో దాదాపు 14 శాతం వాటా ఉన్న ఈ రంగం వృద్ధి 2.9 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గింది.

సేవల రంగం: జీడీపీలో సగానికిపైగా వాటా కలిగిన ఈ రంగం (ఫైనాన్సింగ్, బీమా, రియల్టీసహా) వృద్ధి రేటు 9.3 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గింది.

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా: ఈ రంగాల వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 3.7 శాతానికి పడిపోయింది.

నిర్మాణం: ఈ రంగం  వృద్ధి రేటు కూడా భారీగా 7 శాతం నుంచి 2.8 శాతానికి దిగింది.
వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్లు: వృద్ధి 6.1 శాతం నుంచి 3.9 శాతానికి పడింది.
కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు: ఈ రంగంలో వృద్ధి రేటు మాత్రం స్వల్పంగా 8.9 శాతం నుంచి 9.4 శాతానికి పెరిగింది. దేశీయోత్పత్తి మొత్తంగా ఈ త్రైమాసికంలో 4.4 శాతం వృద్ధితో (2004-05 ధరల బేస్‌గా ఫ్యాక్టర్ కాస్ట్ అంటే పెరిగిన ధరల పరిగణన ప్రాతిపదికన) రూ.13,14,256 కోట్ల నుంచి రూ. 13,71,446 కోట్లకు చేరింది.

తక్షణ చర్యలు అవసరం
ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని బయటపడేయడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు విజ్ఞప్తి చేశాయి. పెట్టుబడిదారు సెంటిమెంట్ మెరుగుపడలేదని, ఇది దిగువస్థాయిలోనే ఉందని గణాంకాలు పేర్కొంటున్నాయని విశ్లేషిం చారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సహకారాత్మక చర్య లు అవసరమని  సీఐఐ డెరైక్టర్ జనరల్  చంద్రజిత్ బెనర్జీ విశ్లేషించారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తి కనిష్ట స్థాయిలను చూడకపోగా, ఇంకా దిగువకు పడిపోవచ్చన్న సంకేతాలను గణాంకాలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సం స్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయ డం, విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరాలను మెరుగుపరచడం, మైనింగ్ రంగంలో పోటీతత్వాన్ని పెంపొం దించడం, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్  అమలును వేగవంతం చేయడం సానుకూల పరిణామాలకు దారితీస్తాయని వివరించారు. సాధారణ వర్షపాతం నమోదయితే, వ్యవసాయ దిగుబడులు పెరిగి గ్రామీణ ఆదాయాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడుతూ, ఇదే జరిగితే గ్రామీణ డిమాండ్ మెరుగుదలకు, ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడే అవకాశం ఉందని సైతం ఈ సందర్భంగా విశ్లేషించారు. తక్షణ చర్యలకు ఉపక్రమించాల్సిన తరుణమిదని  ప్రత్యేకించి తయారీ రంగంలో సంస్కరణలు అవసరం అని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ అన్నారు.

అనుకుంటున్నదే…
వృద్ధి మందగమనంలో ఉందన్న విషయం తెలిసిందే. మొదటి త్రైమాసిక ఫలితాలు బాగుంటాయని మనం ఎప్పుడూ భావించలేదు. ఇకపై పరిస్థితి మెరుగుపడుతుంది. గడచిన రెండు మూడు నెలలుగా తీసుకున్న పలు చర్యల వల్ల రెండో త్రైమాసికం, ద్వితీయార్ధంలో మాత్రం  మెరుగైన ఫలితాలను చూడవచ్చు.
– మాంటెక్ సింగ్, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్

భవిష్యత్ బాగుంటుంది…
ప్రస్తుతానికి దేశ జీడీపీ వృద్ధిరేటు మందగమనంలోనే ఉన్నా.. రానున్న కాలంలో పుంజుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో  వృద్ధి  మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం. అదేవిధంగా మూడు, నాలుగో  త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పనితీరు మరింత బాగుంటుంది.
– అరవింద్ మయారామ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి

ముందుముందు కష్టమే…
పారిశ్రామిక రంగంలో వ్యవస్థాగత లోటుపాట్లు సరిచేయనిదే భవిష్యత్తులో సైతం వృద్ధి రేటు పుంజుకోవడం సాధ్యం కాదు. పైగా గణాంకాలు మరింత దిగజారే అవకాశమూ ఉంది. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ సానుకూల ప్రభావం దేశంలోని సేవల రంగంపై కనబడుతుంది.
– అనీస్ చక్రవర్తి, డెలాయిట్

About the Author