హెచ్-1బీ వీసాలకు దరఖాస్తుల స్వీకరణ
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హెచ్-1బీ వర్క్ వీసాలకు అమెరికా దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. అయితే కాంగ్రెస్ ఆమోదం పొందిన 65 వేల కోటా మొదటివారంలోనే పూర్తి కావచ్చని ఇటు పారిశ్రామిక నిపుణులు అటు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజూ ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయనే అంశంపై అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) ఎప్పటికప్పుడు ఎలాంటి సమాచారాన్నీ ఇవ్వదని, కానీ సంబంధిత పరిమితిని చేరుకోగానే ఆ మేరకు ప్రకటన చేస్తుందని అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ అనుమతి మేరకు 2013 అక్టోబర్ 1 నుంచి మొదలైన 2014 ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 65 వేల హెచ్-1బీ వీసాలను మాత్రమే సీఐఎస్ మంజూరు చేస్తుంది. అయితే అమెరికాలోని విద్యా సంస్థల నుంచి మాస్టర్స్ లేదా ఉన్నతమైన డిగ్రీలు పొందిన వారికి అదనంగా మరో 20 వేల హెచ్-1బీ వీసాలను కూడా సీఐఎస్ అందజేయనుంది. హెచ్-1బీ వీసాలకు సంబంధించి ఇలాంటి పరిమితి గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉంది. అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన పక్షంలో పరిమితి మేరకు లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 2012లో ఈ పరిమితిని చేరుకోవడానికి 73 రోజులు పట్టింది.