సీబీఐ ద్వారా యూపీఏ రాజకీయ డీల్: బీజేపీ
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో సీబీఐ ద్వారా ‘రాజకీయ డీల్’ జరుగుతోందని బీజేపీ విరుచుకుపడింది. ‘సీబీఐ లేనిదే యూపీఏలో పొలిటికల్ డీల్ లేదు’ అని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీబీఐని కాంగ్రెస్ ఎలా వాడుకుంటోందో చెప్పడానికి ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ‘కాంగ్రెస్‌ను ఢీకొంటే సీబీఐని ఉసిగొల్పుతుంది’ అని ములాయం నేరుగా చెప్పారన్నారు. కోల్‌గేట్ కేసులో సుప్రీం కోర్టుకు సమర్పించాల్సిన సీబీఐ నివేదికను ప్రభుత్వం మార్పు లు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వేగంగా పతనం కావడం దేశంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి సంకేతమన్నారు. ‘యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు డాలరుతో రూపాయి విలువ రాహుల్ గాంధీ వయసంత ఉంటే, ఇప్పుడు సోనియా వయసుకు చేరింది. త్వరలో ప్రధాని మనోహ్మన్ వయసుకు చేరుకుంటుంది’ అని వ్యంగ్యాస్త్రం సంధించారు.