సీఐఏ కుట్రకు బలయ్యారా?
వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ కుట్రకు బలైపోయారా? కుట్ర కోణానికి కచ్చితమైన ఆధారాలేవీ లేవు గానీ, దీనిపై బలమైన అనుమానాలే ఉన్నాయి. తనకు కేన్సర్ సోకినట్లు చావెజ్ 2011 జూన్ 30న క్యూబా రాజధాని హవానాలో చేసిన టెలివిజన్ ప్రసంగం ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అంతకు ఇరవై రోజుల కిందటే తనకు శస్త్రచికిత్స జరిగినట్లు చెప్పారు. ఏడాది కిందట చావెజ్ వెనిజులా ప్రభుత్వ రేడియో ద్వారా చేసిన ప్రసంగంలో తనకు సోకిన కేన్సర్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు.
అప్పటికే బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రూసెఫ్, పరాగ్వే అధినేత ఫెర్నాండో లుగో, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లులా దసిల్వా, అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చ్‌నర్‌లకు కేన్సర్ సోకడాన్ని ప్రస్తావించారు. కొద్ది వ్యవధి తేడాలోనే లాటిన్ అమెరికన్ దేశాల నేతలందరికీ కేన్సర్ సోకడం చాలా అసహజంగా ఉందని అన్నారు. తనను వ్యతిరేకించే వారిని దారికి తెచ్చుకోవడం, అప్పటికీ లొంగకుంటే, వారిని మట్టుబెట్టడం అమెరికాకు కొత్తేమీ కాదన్న వాస్తవం జగద్వితమే. క్యూబా అధినేత ఫిడెల్ క్యాస్ట్రోను అంతం చేసేందుకు సీఐఏ ఏకంగా 638 సార్లు విఫలయత్నాలు చేసింది. ప్రపంచంలో మరే దేశాధినేతపైనా ఇన్ని హత్యాయత్నాలు జరగలేదు.
క్యాస్ట్రో ఇష్టంగా వాడే సిగార్లలో పేలుడు సృష్టించడం ద్వారా ఆయనను చంపేందుకు ప్రయత్నించింది. ఆయన డైవింగ్ సూట్‌పై ప్రాణాంతకమైన జీవరసాయనాలను ప్రయోగించింది. ఆయన తాగే కాఫీలో విషపూరితమైన మాత్రలు, ప్రాణాంతకమైన బ్యాక్టీరియా కలిపింది. స్పీకర్ పోడియంను పేల్చేసి మట్టుపెట్టాలనుకుంది. సముద్రంలో నీటి అడుగున కూడా బాంబులతో దాడికి ప్రయత్నించింది. కిరాయి హంతకులను, విషకన్యలనూ ప్రయోగించింది. నిరంతర అప్రమత్తతతో పాటు అదృష్టం కూడా తోడవడంతో క్యాస్ట్రో ప్రాణాలు నిలిచాయి. తమకు కొరకరాని కొయ్యలుగా ఉన్న లాటిన్ అమెరికన్ అధినేతలను మట్టుబెట్టేందుకు అమెరికా పాలకులు ఎంతకైనా తెగిస్తారనేందుకు క్యాస్ట్రోపై జరిగిన హత్యాయత్నాలే నిదర్శనం.