సివిల్స్ మెయిన్స్ నుంచి తప్పనిసరి ఇంగ్లిష్ తొలగింపు
సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో తప్పనిసరి ఇంగ్లిష్ పేపరును యూపీఎస్సీ తొలగించినట్లు సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి నారాయణస్వామి గురువారం లోక్‌సభలో వెల్లడించారు. సివిల్స్ మెయిన్స్‌లో వంద మార్కుల ఇంగ్లిష్ ఎస్సే పేపర్‌ను తొలగిస్తున్నామని, ఎప్పటి మాదిరిగానే యథాతథంగా మాతృభాషలకు, ఇంగ్లిష్‌కు 300 మార్కుల చొప్పున అర్హత పరీక్షలు మాత్రమే ఉంటాయని ఆయన వెల్లడించారు. ఎస్సే పేపర్ 250 మార్కులకు ఉంటుందని, అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలో ఈ పేపర్‌ను రాయవచ్చని తెలిపారు. ఇదివరకటి మాదిరిగానే అభ్యర్థులు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో సూచించిన భాషల్లో ఏదో ఒక దానిని లేదా ఇంగ్లిష్‌ను సివిల్స్ పరీక్షలు రాసేందుకు ఎంపిక చేసుకోవచ్చని అన్నారు.
అభ్యర్థులు తమ మాతృభాషలో సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా ఎంపిక చేసుకున్నట్లయితే, సంబంధిత భాషలో కనీసం 25 మంది అభ్యర్థులైనా ఉండాలని, లేకుంటే ఆ భాషలో పరీక్షలను రద్దు చేస్తామని యూపీఎస్సీ ఇదివరకటి నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఈ షరతును కూడా తొలగిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే గ్రాడ్యుయేషన్‌లో చదువుకున్న ఐచ్ఛికాంశాలతో సంబంధం లేకుండా, అభ్యర్థులు సివిల్స్‌లో ఏదైనా భాషలో సాహిత్యాన్ని తమ ఐచ్ఛికాంశంగా ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. సివిల్స్ నోటిఫికేషన్‌పై పార్లమెంటులో పలువురు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణస్వామి వివరించారు.