Published On: Thu, Apr 4th, 2013

సర్కారీ బడిలోనూ ఎల్‌కేజీ!

Share This
Tags

త్వరలో సర్కారీ బడులలోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు రానున్నాయా? ఎందుకంటే.. కేంద్రం ఇప్పటికే ఆ దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకూ ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకే అమలు చేస్తున్న ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని పూర్వ ప్రాథమిక(ప్రీప్రైమరీ-నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ), మాధ్యమిక(సెకండరీ) విద్యకూ వర్తింపజేయాలని యోచిస్తోంది. ఈ నెల 2న ఢిల్లీలో జరిగిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ) సమావేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని చర్చించింది. ప్రస్తుతం దేశంలో ఐదేళ్లలోపే చిన్నారులు పాఠశాలలో చేరుతున్నందున ప్రభుత్వపరంగా ప్రీప్రైమరీ విద్యను కూడా స్కూళ్లలో అందించాల్సిన అవసరముందని, దానికి తగిన కరిక్యులమ్, బోధకులకు ఉండాల్సిన అర్హతలు, ఇత్యాది అంశాల రూపకల్పన విద్యాహక్కు చట్టం ద్వారా జరిగితే బాగుంటుందని అభిప్రాయపడింది.

అలాగే 9, 10, 11, 12 తరగతులను కూడా దీని పరిధిలోకి తెస్తే మెరుగైన విద్యను అందించవచ్చని, అదనంగా అవసరమయ్యే ఉపాధ్యాయులు, వారి అర్హతలు, వీరి నియామకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఇత్యాది అంశాలన్నీ చట్ట పరిధిలో జరగాల్సిన అవసరాన్ని చర్చించింది. అయితే .. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యకు సంబంధించి ఈ చట్టం పటిష్టంగా అమలైన తర్వాతే.. దీని పరిధిని ప్రీప్రైమరీ, సెకండరీ విద్యకు విస్తరింపజేయాలని చాలా రాష్ట్రాలు సూచించినట్టు తెలిసింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఉన్నత విద్యాసంస్థలు అందజేసే కోర్సుల్లో సమానత్వాన్ని తెచ్చేందుకు జాతీయ ఉన్నత విద్య క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ కూడా రూపొందించాలని ఈ భేటీలో చర్చించారు. అంతర్జాతీయంగా కోర్సుల్లో సమానత్వం ఉండడానికి కూడా ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడుతుందని సీఏబీఈ సూచించింది. దీనిపై అధ్యయనానికి ఓ కమిటీనీ ఏర్పాటు చేయనుంది.
మధ్యాహ్న భోజన పథకంలో సోషల్ ఆడిట్..: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకంపై ప్రయోగాత్మకంగా సోషల్ ఆడిట్ జరుగుతున్న తీరును సమావేశంలో చర్చించారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని సీఏబీఈ అభిప్రాయపడింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం సక్రమంగా, నిరంతరాయంగా అమలు జరిపేందుకు గ్రీన్‌చానల్ ఫండ్ ఏర్పాటు చేసిన తీరును.. మిగిలిన రాష్ట్రాలూ అనుసరించాలని బోర్డు సూచించింది.

కర్ణాటకలో 97 శాతం గ్యాస్ ఆధారిత వంటగదులు అందుబాటులోకి వచ్చాయని, దీని వల్ల పాఠశాలల్లో పారిశుద్ధ్యం మెరుగవుతుందని, మిగిలిన రాష్ట్రాలు దీన్ని అనుసరించాలని చెప్పింది. జాతీయస్థాయి పరీక్షలైన నెట్, జేఈఈ-మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్, క్లాట్, సీమ్యాట్ తదితర పరీక్షలన్నింటినీ ఒకే సంస్థ నిర్వహిస్తే బాగుంటుందని, దీనికోసం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏర్పాటుచేయాలని బోర్డు అభిప్రాయపడింది. ఈ సమావేశానికి మన రాష్ట్రం నుంచి మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ హాజరయ్యారు.

కమిటీ ఏం చెప్పిందంటే..
ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం విస్తర ణపై అధ్యయనం చేసేందుకు సీఏబీఈ నేతృత్వంలో ఓ కమిటీని గతంలో కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన అధ్యయన నివేదికలో పేర్కొన్న అంశాలివీ..

– ప్రీప్రైమరీ స్థాయిలో కూడా విద్యాహక్కు చట్టం విస్తరణకు కార్యాచరణ రూపొందించాలి.
– ఏ వయస్సు వారిని ప్రీప్రైమరీ కేటగిరీలోకి తీసుకురావాలి అన్న అంశంతోపాటు వారికి బోధించే టీచర్లకు ఉండాల్సిన అర్హతలు, విద్యార్థి కేంద్రంగా సిలబస్‌లో పొందుపరచాల్సిన అంశాలు, ప్లేవే పద్ధతిలో బోధన అందించేందుకు చేపట్టాల్సిన చర్యలు.

– దీన్ని పక్కాగా అమలు చేయాలంటే సమగ్ర శిశు అభివృద్ధి పథకం భాగస్వామ్యం తప్పనిసరి.
– 9, 10, 11, 12 తరగతులకు కూడా ఈ చట్టాన్ని విస్తరింపజేస్తే విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలు, ఏ వయస్సు వారిని ఈ చట్టం పరిధిలోకి తేవాలనే అంశాలు.
– అదనపు టీచర్లను నియమించేందుకు కొత్తగా విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్ణయించాలి. అయితే స్కూళ్ల ప్రారంభం, వసతుల కల్పన, టీచర్ల నియామకాలు, సిలబస్ రూపకల్పన, అర్హతల నిర్ధారణ, టెట్ నిబంధనలు, ఉపాధ్యాయ విద్యాసంస్థల భాగస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ), జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ)తో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది.
– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థికపరమైన బాధ్యతలు తదితర ప్రధాన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. వీటన్నింటిపై సమగ్ర కార్యాచరణ రూపొం దించాకే విద్యా హక్కు చట్టం విస్తరణ చేపట్టాలి. చట్టం విస్తరణలో భాగంగా ప్రీప్రైమరీ కేటగిరీలో మూడు నుంచి ఆరేళ్ల వయస్సు వారిని, సెకండరీ విద్యలో 15-18 ఏళ్ల వయస్సు వారిని పరిగణనలోకి తీసుకోవాలి.

About the Author