Published On: Fri, Nov 1st, 2013

సర్కారీ కొలువులకు సిద్ధంకండి!

Share This
Tags

ఓ ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారేటప్పుడు పరిశీలిస్తున్న అంశాల్లో ఉద్యోగ భద్రత(job Security), పని-వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం (Work-Life Balance) ముఖ్యమైనవని ఓ గ్లోబల్ లేబర్ మార్కెట్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ రెండింటికీ ఎప్పుడూ ఢోకా లేని కొలువులే సర్కారీ కొలువులు. ఆకర్షణీయ జీతభత్యాలు, హోదాతో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుండటంతో ప్రభుత్వ కొలువుల వైపు యువత ఆకర్షితమవుతోంది. దీంతో తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయన్న దాన్ని పట్టించుకోకుండా పక్కా ప్రణాళికతో దీర్ఘ కాలిక ప్రిపరేషన్ కొనసాగిస్తే గెలుపు ఖాయమంటున్నారు నిపుణులు..

ఆందోళన వద్దు
ఇప్పటికే ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు, ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారితో పాటు ప్రస్తుతం ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరింత మంచి ఉద్యోగం సాధించాలన్నా ఆలోచనతో ఉన్నవారు.. ఇలా లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుంది? నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి వారు ఆందోళన చెందకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ‘‘ప్రస్తుతం రాష్ట్ర విభజనకు సంబంధించిన పరిణామాలపై ఉద్యోగార్థులు ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నోటిఫికేషన్ల గురించి ఆలోచించకుండా వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలి. రాష్ట్ర విభజనపై తుది ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఏదో ఒకరోజు నోటిఫికేషను రావడం ఖాయం కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక ఆదరాబాదరాగా ప్రిపరేషన్ ప్రారంభించే బదులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివేందుకు ఉపయోగించుకోవాలి’’ అంటారు హైదరాబాద్‌లోని కనిష్క ఐఏఎస్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ మహేందర్‌రెడ్డి.

సిలబస్-విశ్లేషణ:
ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి సిలబస్, పరీక్ష విధానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ తమ లక్ష్యాలకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఎక్కువ మందికి ఆశాకిరణాలుగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డీఎస్సీ, ఎస్సై, పోలీస్ ఔత్సాహికులు.. లక్ష్య సాధన క్రమంలో తొలుత ఆయా పరీక్షల సిలబస్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. దీనివల్ల తమకు అనుకూలంగా ఉన్న అంశాలు; ఏ అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి? వంటి విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ప్రీవియస్ పేపర్లను పరిశీలించడం వల్ల ఏ అంశాలకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి? ప్రశ్నల శైలి, కాఠిన్యత వంటి విషయాలపై అవగాహన వస్తుంది.

జనరల్ స్టడీస్ పట్టుపట్టాలి:
డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఎంపీడీవో, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, డీఎల్, జేఎల్ వంటి ఉన్నత స్థాయి పోస్టుల నుంచి జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల వరకు నిర్వహించే పరీక్షల్లో జనరల్ స్టడీస్ కీలకపాత్ర పోషిస్తుంది. గ్రూప్స్‌తో పాటు వివిధ పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో జీఎస్‌కు ప్రత్యేక పేపర్ ఉంటుంది. ఓ ప్రణాళిక ప్రకారం చదివితే ఇందులో అత్యధిక మార్కులు సంపాదించవచ్చు.

జీఎస్‌లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, మెంటల్ ఎబిలిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, కరెంట్ అఫైర్స్‌లకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలను చదివి, సొంతంగా నోట్స్ రూపొందించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నోట్స్‌ను చదివిన తర్వాత ఇతర ఏ ప్రామాణిక మెటీరియల్‌ను అయినా త్వరగా చదివేందుకు, తేలిగ్గా అర్థం చేసుకునేందుకు అవకాశముంటుంది. అదే విధంగా మ్యాథమెటిక్స్ పుస్తకాల్లోని కొన్ని చాప్టర్లలోని ప్రశ్నలు సాధన చేయడం ద్వారా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయొచ్చు.

జీఎస్‌కు సంబంధించి ఏ మూల నుంచైనా ప్రశ్న రావొచ్చు. అందువల్ల అభ్యర్థులు విసృ్తత సమాచారాన్ని సేకరించి, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
ఉదాహరణ : వాల్‌స్ట్రీట్ ఏ పట్టణంలో ఉంది? (పాలిటెక్నిక్ లెక్చరర్స్-2013)
1) పారిస్ 2) న్యూయార్క్ 3) షికాగో 4) మాస్కో
2 (వాల్‌స్ట్రీట్.. న్యూయార్క్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్).

అప్‌డేట్.. అసలైన అస్త్రం:
ఏ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులైనా సిలబస్‌లోని విషయాలకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకోవడం (అప్‌డేట్) ప్రధానం. దీనికోసం ఒకట్రెండు దిన పత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నోట్స్‌ను ఆబ్జెక్టివ్ పేపర్‌తో పాటు విశదీకరణ అవసరమయ్యే డిస్క్రిప్టివ్ పేపర్‌కు కూడా ఉపయోగపడేలా రూపొందించుకోవాలి. ఉదాహరణకు ఇటీవల పత్రికల్లో వచ్చిన ‘ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా’ అనే వార్తను చదివిన అభ్యర్థి ఈ కింది అంశాలను నోట్స్‌లో పొందుపరచుకోవచ్చు.
ఎన్నికల సంఘం ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. అవి: ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్.
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ).. వీఎస్ సంపత్.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 సీట్లు ఉండగా, రాజస్థాన్-200, ఢిల్లీ-70; మిజోరాం-40; ఛత్తీస్‌గఢ్-90 సీట్లు ఉన్నాయి.
ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ప్రింటవుట్ (రసీదు) ఇచ్చే విధానాన్ని నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా విజయవంతమైంది. ఇలా వివిధ అంశాలతో రూపొందించిన నోట్స్ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా సమాధానం రాసేందుకు ఉపయోగపడుతుంది.
అభ్యర్థులు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలపై పట్టుసాధించేందుకు వీలునుబట్టి ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలి. మార్కెట్లో పేరున్న ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను అనుసరించాలి.

మెటీరియల్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి:
ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించడంలో అభ్యర్థులు సేకరించిన మెటీరియల్ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. అందువల్ల ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒక పుస్తకాన్ని ఎంచుకునేటప్పుడు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పేపర్లకు ఉపయోగపడేలా సమాచారం ఉందా? లేదా? అని చూడాలి. తాజా సమాచారంతో పాటు గణాంకాలు, ఫ్యాక్ట్స్ ఉన్నాయో.. లేవో? పరిశీలించాలి. మెటీరియల్ ఎంపికలో గత విజేతలు, ఫ్యాకల్టీ సలహా తీసుకోవాలి. లేదంటే డబ్బుతో పాటు విలువైన సమయం వృథా అవుతుంది.

రైటింగ్ స్కిల్స్ అవసరం:
ఇప్పటి గ్రూప్-1 మెయిన్స్ వంటి డిస్క్రిప్టివ్ పేపర్లలో అత్యధిక మార్కులు సాధించాలంటే రైటింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం. దీనికోసం అభ్యర్థులు తక్కువ సమయంలో ఎగ్జామినర్ ఆశించిన సమాధానం రాయాలంటే ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. ఏదో ఒక ప్రశ్నను ఎంపిక చేసుకొని నిర్దిష్ట పదాల్లో సూటిగా, అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా సమాధానం రాయడం ప్రాక్టీస్ చేయాలి.

కోర్ టాపిక్స్‌పై దృష్టి పెట్టాలి:
ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ వంటి పరీక్షలకు జీఎస్‌తో పాటు సబ్జెక్టు పేపర్ ఉంటుంది. ఇందులో ఎక్కువ మార్కుల కోసం ముందుగా ఆయా సబ్జెక్టులలోని బేసిక్స్‌పై పట్టు సాధించాలి. దీనికోసం ప్రామాణిక పుస్తకాలు చదవాలి. ‘‘సబ్జెక్టులో కష్టంగా భావించే అంశాలతో నోట్స్ రూపొందించుకోవాలి. అప్లికేషన్స్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి. పేపర్ ఆబ్జెక్టివ్‌లో ఉన్నప్పటికీ ప్రిపరేషన్ డిస్క్రిప్టివ్‌లో సాగించాలి. దీనివల్ల ప్రశ్నను ఏ కోణంలో అడిగినా ఇబ్బంది ఉండదు. నేను ఇంజనీరింగ్ (ఈసీఈ) మూడో సంవత్సరంలో ఉన్నప్పటి నుంచి గేట్‌కు ప్రిపేర్ కావడం అనుకూలించింది. పాలిటెక్నిక్ లెక్చరర్స్ వంటి పరీక్షలకు కోర్ టాపిక్స్‌ను బాగా చదవాలి’’ అంటారు ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్స్ రిక్రూట్‌మెంట్ విజేత ఎం.రాజేశ్వరి.

ఎదురు గాల్లోనే గాలిపటం పైకి లేస్తుంది.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తే తప్పకుండా గెలుపు పిలుపు వినిపిస్తుంది!

దీర్ఘకాలిక ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి
ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలన్న కోరిక ఉన్నప్పటికీ చాలా మంది.. ‘నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ గురించి ఆలోచిద్దాం!’ అని అనుకుంటారు. అయితే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించే దిశగా సాగిపోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో విజేతల జాబితాలో చోటు లభిస్తుంది. ఎక్కువ మంది గ్రూప్స్‌ను లక్ష్యంగా పెట్టుకుంటారు. వీరు ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి ఆందోళన చెందకుండా, ప్రిపరేషన్‌పైనే దృష్టిసారించాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ప్రిపరేషన్‌ను కొనసాగించేందుకు లభించిన సమయంగా భావించి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పోటీలో ముందువరుసలో ఉండొచ్చు. ప్రస్తుతం వివిధ పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించి వాటిని పూర్తిచేయాలి.

మెంటల్ ఎబిలిటీ: మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. అయితే టిప్స్ ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. జనరల్ స్టడీస్ పేపర్‌లో ఈ విభాగం నుంచి 20-25 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి సరిగా ప్రాక్టీస్ చేస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. కాలం-దూరం; కాలం-పని; లాభనష్టాలు; భాగస్వా మ్యం; కసాగు-గసాభా; క్లాక్స్; బ్లడ్ రిలేషన్స్; కోడిం గ్-డీ కోడింగ్; డెరైక్షన్స్ తదితర అంశాలకు సంబం ధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.

కరెంట్ అఫైర్స్: జీఎస్ పేపర్‌లో 35 వరకు కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ప్రతి రోజూ కనీసం ఒక ప్రామాణిక పత్రికను చదవాలి. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, జాగ్రఫీ తదితర అంశాలకు సంబంధించిన అంశాలతో పాటు పరీక్షలకు ఉపయోగపడే సమాచారాన్ని గుర్తించి నోట్స్ రాసుకోవాలి. పత్రికల్లోని ఎడిటోరియల్స్, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇచ్చే పేజీలను చదివితే ఆబ్జెక్టివ్‌తో పాటు డిస్క్రిప్టివ్ పేపర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వివేక్ వంటి ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను కూడా చదవాలి. ప్రచురణ సంస్థలు పరీక్షకు ముందు ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ కోసం బుక్స్ రిలీజ్ చేస్తాయి. వాటిలో ప్రామాణిక కంటెంట్‌ను అందిస్తున్న పుస్తకాలను ఎంపిక చేసుకొని చదివితే సరిపోతుంది.

హిస్టరీ: ఇండియన్ హిస్టరీకి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ హిస్టరీ తెలుగు అకాడమీ పుస్తకం చదివితే సబ్జెక్టుపై మంచి అవగాహన వస్తుంది. ఏపీ హిస్టరీకి సంబంధించి పి.వి.కె.ప్రసాదరావు పుస్తకం (ప్రాచీన చరిత్ర), పి.రఘునాథరావు (ఆధునిక చరిత్ర) పుస్తకాలు చదవాలి. చరిత్ర పుస్తకాలను చదివేటప్పుడు వివిధ రాజ వంశాల పరిపాలన కాలంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. తప్పనిసరిగా రాజులు, రాజ వంశాల సీక్వెన్స్‌తో పాటు రెండు వంశాలు లేదా ఇద్దరు రాజుల మధ్య పరిపాలన విధానాల్లో తేడాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.
పాలిటీ: కృష్ణారెడ్డి- రమాదేవి పుస్తకం ఉపయోగకరం.
ఎకానమీ: విద్యార్థులు తొలుత కాంపిటేటివ్ కోచింగ్‌లో పేరున్న ఫ్యాకల్టీ తాలూకు నోట్స్ చదవాలి. తర్వాత తెలుగు అకాడమీ.. పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకాలను చదవాలి. Socio-Economic Surveys కూడా ఉపయుక్తంగా ఉంటాయి. సెన్సస్ వంటి డేటాను వీలైనన్ని ఎక్కువసార్లు చదివి గుర్తుంచుకోవాలి.
ప్రిపరేషన్‌కు ఎవరెన్ని గంటలు కేటాయించాలనేది వారివారి చేతుల్లోనే ఉంటుంది. వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారు, ఫ్రెషర్స్ తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. వాళ్లు చెప్పారు.. వీళ్లు చెప్పారంటూ మార్కెట్లో కనిపించిన ప్రతి పుస్తకాన్నీ కొని పోగేసుకోవడం వల్ల లాభం ఉండదు. గత విజేతలు, కాంపిటేటివ్ ఫ్యాకల్టీ సలహాలకు తోడు వ్యూహాత్మకంగా వ్యవహరించి మెటీరియల్‌ను సేకరించి, ప్రణాళికాబద్దంగా చదివితే విజయం తథ్యం.

About the Author