వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు….
నేటి ఊహే రేపటి నిజం. వైద్య రంగానికి సంబంధించిన ఇప్పటి ఎన్నో ఊహలు మరో 50 ఏళ్లలో నిజం కాబోతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకు… ఒక చిన్న కంప్యూటర్ చిప్ మనిషిని నడిపిస్తుందట..! మీరు వేసుకున్న డ్రెస్ లోనే ఒక స్మార్ట్ డాక్టర్ ఉంటాడట..! ఇక ఆంబులెన్స్ లు గాల్లో ఎగురుకుంటూ వస్తాయట..! అంతేకాదు.. వర్చువల్ ఆపరేషన్ థియేటర్లు.. శరీర భాగాల లోగుట్లను బయట పెట్టే పవర్ ఫుల్ స్కానింగ్ ఎక్విప్ మెంట్లు.. ఇవన్నీ భవిష్యత్ వైద్య రంగాన్ని సమూలంగా మార్చివేయబోతున్నాయట..!! అయితే.. ఇప్పుడు మనం ఓ యాభై ఏళ్లు ముందుకు వెళ్లి అప్పటి మెడికల్ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఈ వారం టైమ్ మెషీన్ లో తెలుసుకుందామా.
ఊహకందని టెక్నాలజీ…
మీ శరీరంలో ఉండే ఒక కంప్యూటర్ చిప్ మిమ్మల్ని ఈ ప్రపంచానికి కనెక్ట్ చేస్తుంది. మీరేం చేస్తున్నారో, మీ బాడీలో వస్తున్న మార్పులేంటో మెడికల్ ఏజెంట్లకు, డాక్టర్లకు.. ఇతర నెట్ వర్క్ సభ్యులకు చెప్పేస్తుంది. 50 ఏళ్ల తర్వాత ఓ చిన్న కంప్యూటర్ చిప్ మీ శరీర భాగాలను శాసిస్తుంది. వాటికి పున:జీవం పోస్తుంది. నడవలేని వారిని నడిపిస్తుంది. చేతులు పనిచేయని వారి చేత పనులూ చేయిస్తుంది. భవిష్యత్తులో మీరు వేసుకునే బట్టలు చాలా స్మార్ట్ గా ఉంటాయి. ఆ డ్రస్సులోనే ఓ డాక్టర్ ఉంటాడు. ఆ డ్రస్సు మీ శరీరంలో వస్తున్న మార్పులనే కాదు.. వ్యాధి లక్షణాలనూ పసిగట్టి ముందే తెలియజేస్తుంది. శరీరంలో జరిగే మార్పులను గుర్తించడం. వాటిని నెట్ వర్క్ కు అనుసంధానించడమే ఈ స్మార్ట్ షర్ట్ ప్రత్యేకత. ఈ బట్టల్లో ఉండే ఫైబర్.. కండక్టివ్ వైర్ గా పనిచేస్తుంది. బెస్ట్ ఫైబర్ తో డిజైన్ చేసే ఈ దుస్తుల్లో మైక్రో ప్రాసెసర్లు, కంప్యూటర్ చిప్స్ ఉంటాయి. ఈ స్మార్ట్ షర్ట్ లను అథ్లెట్లకు వేసి పరీక్షించారు. దీన్ని వేసుకుని పరిగెడుతున్న అథ్లెట్ల హార్ట్ బీట్, పల్స్ రేట్, బీపీ తదితర వివరాలన్నీ రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా కోచ్.. ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ ను తీర్చిదిద్దొచ్చు. ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే అలెర్ట్ కావచ్చు. ఇక.. యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కు ఫోన్ చేయాల్సిన పనేలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ బయలుదేరుతుంది. ఈ లోపు మీకు ఎక్కడెక్కడ గాయాలు తగిలాయి..? వాటి తీవ్రత ఎంత అన్న విషయాలతో ఫీడ్ బ్యాక్ అంతా.. అంబులెన్స్ లో ఉన్న డాక్టర్లకు చేరిపోతుంది. దీంతో.. ఆపరేషన్లు చేసే తీరు పూర్తిగా మారిపోతుంది. డాక్టర్లు రోగి ఒంటిని తాకకుండానే సర్జరీ పూర్తి చేస్తారు. టచ్ స్ర్కీన్ మీదే ఆపరేషన్లు చకచకా జరిగిపోతాయి. భవిష్యత్తులో వర్చువల్ హాస్పిటల్స్ వచ్చేస్తాయి. పేషెంట్ ఇండియాలో ఉంటే.. డాక్టర్లు అమెరికా నుంచి సర్జరీ చేస్తారు.
కంప్యూటర్ చిప్స్ మనిషిని ఎలా నడిపిస్తాయి..?
మనిషి శరీరంలో ఒక కంప్యూటర్ చిప్ ని ఇంప్లాంట్ చేస్తారు. మెదడు పంపే సంకేతాలను ఈ చిప్స్ ఫాలో అవుతాయి. వెన్నుపూస దెబ్బ తిన్న కారణంగా పనిచేయని కాళ్లు, చేతులు, ఇతర అవయవాలను ఇకపై ఈ కంప్యూటర్ చిప్స్ పనిచేయిస్తాయి. కంటికి కనిపించనంత సైజ్ లో ఉండే ఒక నానో రోబో మీ శరీరంలోకి ప్రవేశించి ఆపరేషన్ చేసేస్తుంది.
చూడ్డానికి చిన్న చిప్పే.. కానీ జీవితాన్ని శాసిస్తుంది…
చూడ్డానికి ఇది చిన్నచిప్పే. కానీ మనిషి జీవితాన్ని శాసించే అద్భుత పరికరం. మనిషి శరీరభాగాలను నియంత్రించే ఒక వండర్. ఇటువంటి చిప్సే భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని శాసించనున్నాయి. కాళ్లు పని చేయని వాళ్లను నడిపిస్తాయి. చేతులు పనిచేయని వారిని వైకల్యం నుంచి విముక్తి చేస్తాయి. సాధారణంగా మన మెదడు పంపించే సంకేతాలన్నీ వెన్నుపూస ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరతాయి. వెన్నుపూస దెబ్బతింటే శరీరంలో చాలా అవయవాలు పనిచేయకుండా పోతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఈ చిప్ లు. వీటి ఆధారంగా మెదడు పంపే సంకేతాలను వెన్నుపూస నుంచి బైపాస్ చేసి.. ఆయా భాగాలకు చేరేలా చూస్తారు.
చిప్ ఇలా పనిచేస్తుంది…
ఇదిగో ఓ అతి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ చిప్ ను ఓ వ్యక్తి మెదడులో అమర్చారు. అందులో వందల కొద్దీ ఎలక్ట్రోడ్ లు ఉన్నాయి. ఈ చిప్ ను మెదడులో అమర్చిన తర్వాత నుంచి మెదడు పనితీరును పరిశీలించడం మొదలుపెట్టారు. వెన్నుపూస దెబ్బతిన్న తర్వాత మెదడు పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడింది. మెదడులో నుంచి వచ్చే బ్రెయిన్ సిగ్నల్స్ ను ఓ వైరు సాయంతో కంప్యూటర్ కు కనెక్ట్ చేస్తే ఈ ప్రయోగం ఆశ్చర్యకరమైన ఫలితాల్ని ఇచ్చింది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. కొద్ది రోజులకే అతడు తన ఆలోచనా తరంగాలతో వస్తువులను కదిలించగలిగాడు. దీని ఆధారంగా మన మెదడు చేతిని ఎలా నియంత్రిస్తుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. మనం చేతులను కదల్చేటప్పుడు వేళ్లకు ఉన్న 15 జాయింట్లను ఉపయోగిస్తున్నాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మెదడు ఈ జాయింట్లను విడివిడిగా నియంత్రించడం లేదు. కొన్ని షార్ట్ కట్స్ ఆధారంగా మెదడు వేళ్లను నియంత్రిస్తున్నట్లు కనిపెట్టారు. ఇలాగే శరీరంలో ఇతర భాగాలను మెదడు ఎలా నియంత్రిస్తుందో కనిపెట్టేందుకు సైంటిస్టులు ప్రయోగాలు మొదలుపెట్టారు. దీని ఆధారంగా భవిష్యత్తులో.. మన మెదడు పంపే సంకేతాలు రిసీవ్ చేసుకునే ఓ చిప్ ను వెన్నుపూస మొదట్లో ఇన్ ప్లాంట్ చేస్తారు. మెదడు శరీర భాగాలకు పంపే ఈ సిగ్నల్ ను ఈ చిప్ బై పాస్ చేస్తుంది. అక్కడుండే రిసీవర్లు వీటిని స్వీకరించి ఆ సిగ్నల్ ను డీకోడ్ చేస్తాయి. ఫలితంగా ఆయా భాగాలు పనిచేయడం మొదలవుతుంది.
నానో కణాల సాయంతో చికిత్స…
నానో కణాల సహాయంతో తయారు చేసిన మందులను నేరుగా వ్యాధి సోకిన అంగాలకు చికిత్స కోసం ఉపయోగించేలా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రక్రియలో ప్రోగ్రామింగ్ చేసిన లక్షల నానో కణాలతో కూడిన ద్రావణాన్ని రోగులకు ఇస్తారు. రోగి శరీరంలోకి ప్రవేశించిన నానో కణాలు దెబ్బతిన్న కణాలను గుర్తించడమే కా కుండా వాటిని పునర్నిర్మించే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రస్తుత ప్రయోగాలు జరుగుతున్నాయి. మరో పది పదిహేనేళ్ల కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. భవిష్యత్తులో వ్యాధి సోకిన కణజాలాన్ని గుర్తించేందుకు సర్జన్లు ఈ టెక్నాలజీనే వాడబోతున్నారు. క్యాన్సర్ వ్యాధికి కీమో థెరపీ చికిత్సా విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. నానో కణాల సహాయంతో తయారు చేసిన మందులను కీమో థెరపీలో ఉపయోగించేందుకు యత్నాలు జరుగుతున్నాయి. శరీరంలో కేన్సర్ కణాలు ఎక్కడ దాగున్నా సరే.. వెంటాడి, వేటాడి చంపేసే రేడియో యాక్టివ్ నానో పార్టికల్స్ ను శాస్త్రజ్ఞులు రూపొందిస్తున్నారు. ఈ టార్గెటింగ్ ఏజెంట్లు శరీరంలో క్యాన్సర్ కణతులను కనిపెట్టి, ఈ నానోపార్టికల్స్ ను ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధిని నయం చేస్తాయి.
గాల్లో ఎగిరే అంబులెన్స్ లు…
ఏదైనా… ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కి ఫోన్ చేయక్కర్లేదు. ఆ విషయం గ్రహించి అంబులెన్స్ గాల్లో ఎగురుకుంటూ వచ్చేస్తుంది. ఈ లోపు ఆన్ లైన్ లో డాక్టర్లు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న డాక్టర్.. వర్చువల్ టెక్నాలజీ ఆధారంగా ఇక్కడి పేషెంట్ కు ఆపరేషన్ చేస్తారు.
పదిరెట్ల వేగంతో దూసుకొచ్చే మెడికల్ టీమ్…
అంబులెన్స్ లంటే.. నేల మీద నడిచేవి కాదు.. గాలిలో తేలుకుంటూ వచ్చేవి. వీటికి ట్రాఫిక్ జామ్ ల గొడవ ఉండదు. ఇప్పటితో పోల్చితే.. పదిరెట్ల వేగంతో ఈ అంబులెన్సులు ప్రమాద స్థలానికి చేరుకుంటాయి. ఇవి ఎటువంటి ప్రాంతంలోనైనా ల్యాండ్ అయిపోతాయి.
గాలిలో నడిచే కారు తయారీకి రూపకల్పన…
పాల్ మోలర్ అనే శాస్త్రవేత్త గాలిలో నడిచే కారును తయారు చేసేందుకు చాలా కాలం నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. భూమికి నిలువుగా గాలిలోకి లేచే వాహనం తయారీ మీద ఈయన పరిశోధనలు చేశారు. పైకి లేచేటప్పుడు వాహనాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన విషయం. ఇందుకోసం మోలర్ ఒక సాఫ్ట్ వేర్ ను తయారు చేశాడు. పైకి లేవడం.. అలాగే కిందకి దిగడం రెండూ చాలా రిస్క్ తో కూడుకున్నవే. దీని కోసం మోలర్ టీం రాత్రింబవళ్లు శ్రమించింది. విమానాల్లో వాడే పెద్ద పెద్ద మిషన్లను చిన్న సైజులోకి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఫలించిన మోలర్ ప్రయత్నాలు…
ఎట్టకేలకు మోలర్ ప్రయత్నాలు ఫలించాయి. ఓ టెస్ట్ మోడల్ ను రూపొందించారు. ఇందులో ఇంకా కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. ఈ కారు అందుబాటులోకి వస్తే.. 50 ఏళ్ల తర్వాత ఎగిరే అంబులెన్సులు రెడీ అయిపోయినట్లే.
భవిష్యత్ లో వర్చువల్ ఆపరేషన్లు…
భవిష్యత్తులో ఆపరేషన్లీ వర్చువల్ గానే జరుగుతాయి. డాక్టర్లు పేషెంట్ల శరీరాన్ని తాకకుండానే ఆపరేషన్లు పూర్తి చేస్తారు. త్రీడీ మోడల్ లో ఉండే బాడీ ఇమేజ్ ఆధారంగా ఈ ఆపరేషన్లు జరుగుతాయి. శరీరాన్ని కోయడం, ఎముకల్ని వంచడం, పాడైన భాగాల్ని మార్చి కొత్త భాగాల్ని అమర్చడం అంతా టచ్ స్క్రీన్ మీద క్లిక్ లతో పూర్తయిపోతుంది. భవిష్యత్తులో ఆపరేషన్లన్నీ రోబో, హ్యూమన్ కాంబినేషన్ లో జరుగుతాయి. మనిషి చేతులు చేరుకోని చోటకు ఈ రోబో చేతులు చొచ్చుకెళతాయి. స్క్రీన్ మీద మనిషి శరీర భాగాలను 30 రెట్లు పెద్దవిగా చేసి చూపిస్తాయి. కాబట్టి ఎంత చిన్న భాగాన్నైనా క్లియర్ గా డాక్టర్లు చూడగలుగుతారు.
టెలీ సర్జరీలపై వైద్యుల దృష్టి…
ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యుద్ధ భూమిలో గాయపడ్డ సైనికులకు ఈ రోబోల సాయంతో టెలీసర్జరీలు చేసే సదుపాయం పైనా డాక్టర్లు దృష్టి పెట్టారు. ఇది కూడా మరో 50 ఏళ్ల తర్వాత అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న నిపుణులైన డాక్టర్లు.. త్రీడీ స్క్రీన్ మీద ఇమేజ్ ల ఆధారంగా ఆపరేషన్ చేసేస్తారు.