Published On: Wed, Jun 26th, 2013

విపత్తు వదిలినా.. కామాంధులు కాటేశారు!

Share This
Tags

జల విలయం నుంచి బయపడ్డా ఆ తల్లీకూతుళ్లు కామాంధుల కాటుకు బలయ్యారు. వరదల్లో చిక్కి జీవచ్ఛవాలుగా మారారన్న కనికరం కూడా లేకుండా ఆ దుర్మార్గులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం వారిని దారుణంగా హతమార్చారు. ఉత్తరాఖండ్‌లోని పాండుకేశ్వర్ సమీపంలోని కొండలపై చిక్కుకున్న యాత్రికుల కోసం గాలింపు చేపడుతున్న ఆర్మీ బృందాలు మంగళవారం వీరి మృతదేహాలను గుర్తించాయి.

వరదల్లో చిక్కుకోవడంతో ఈ తల్లీకూతుళ్లు పదిరోజుల పాటు బద్రీనాథ్‌లోనే తలదాచుకున్నారు. హెలికాఫ్టర్ ద్వారా తరలింపు ఆలస్యం అవుతుండటంతో సోమవారం కాలినడక జోషిమఠ్‌కు బయలుదేరారు. పాండుకేశ్వర్ సమీపంలో వీరిని అటకాయించిన కామాంధులు రోడ్డు పక్కన ఉన్న పర్వతాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హత్య చేసి వారి వద్ద ఉన్న సొత్తు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు, సైనిక దళాలు ఇకపై ఎవ్వరినీ ఒంటిరిగా పంపకూడదని నిర్ణయించాయి. మరుభూమిగా మారిపోయిన కేదార్‌నాథ్‌లో కొందరు దొంగలు శవాల వద్ద నుంచి కూడా దోపిడీ చేస్తుండగా… బద్రీనాథ్ సమీపంలో కామాంధులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వరదలతో బద్రీనాథ్‌కు ఐదు కిలోమీటర్ల దిగువన ఉన్న లాంబాగ్డ్, పాండుకేశ్వర్, గోవింద్‌ఘాట్, జోషిమఠ్‌లలో తీవ్ర నష్టం వాటిల్లింది. బద్రీనాథ్ నుంచి జోషిమఠ్ వైపు ఉన్న ఏకైక రహదారి మూడు ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసం కావడంతో దాదాపు 4,500 మంది ఇరుక్కుపోయారు. ఇలా చిక్కుకుపోయినవారిలో వారే ఈ తల్లీకూతుళ్లు. గడిచిన ఐదు రోజులుగా హెలికాఫ్టర్ల ద్వారా కేవలం 1,500 మందిని మాత్రమే బయటకు తీసుకురాగలిగారు.

సోమవారం వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలను నిలిపివేశారు. లాంబాగ్డ్ వద్ద తాత్కాలిక తాళ్ల వంతెన నిర్మించడంతో ఈ తల్లీకూతుళ్లు సోమవారం కాలినడకన జోషిమఠ్‌కు బయలుదేరారు. దారి మధ్యలో దుర్మార్గుల చేతిలో బలయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు అక్కడి పరిస్థితులు, ప్రాథమిక ఆధారాలను బట్టి వీరు సామూహిక అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు. రెండు మృతదేహాలను గోవింద్‌కుండ్‌లోని తాత్కాలిక హెలిప్యాడ్ నుంచి డెహ్రాడూన్ తరలించారు. ఈ తల్లీకూతుళ్లు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఘాతుకానికి పాల్పడింది ఎవరన్న అంశాలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆర్మీ, ఐటీబీపీ బలగాలు ఇకపై కాలినడకన వచ్చే వారిని ఒకరిద్దరుగా కాకుండా గుంపులుగా పంపాలని, ప్రతి గ్రూపుతో ఓ సాయుధ సిబ్బందిని పంపాలని నిర్ణయించాయి.

About the Author