‘వింబుల్డన్ విజయం’తో ముర్రే పంట పండింది
‘వింబుల్డన్ విజయం’తో ముర్రే పంట పండింది
ఏడాదిలో రూ.900 కోట్లకు పెరగనున్న ఆస్తి
ఇప్పటివరకూ సంపాదించిన దానికి మూడు రెట్లు అధికం
సొంతగడ్డపై వింబుల్డన్ టైటిల్ గెలవడంతో ముర్రే పంటపండింది. మొత్తం బ్రిటన్ అంతా ముర్రే విజయంతో ఉద్వేగానికి లోనయింది. రాత్రంతా సంబరాలు జరుపుకుంది.
77 సంవత్సరాల తర్వాత తమ దేశానికి చెందిన వ్యక్తి టైటిల్ గెలవడంతో… కార్పొరేట్స్ కూడా రంగంలోకి దిగారు. ముర్రేపై ఈ ఏడాది కనకవర్షం కురిసే అవకాశం ఉంది.
గత ఏడేళ్లపాటు టెన్నిస్‌లో ఫెడరర్, నాదల్‌లదే హవా. ఈ ఇద్దరి మధ్యే ఆధిపత్య పోరు…. క్రమంగా సీన్ మారిపోతోంది. జొకోవిచ్, ముర్రే ఈ ఇద్దరి స్థానాలను ఆక్రమించేస్తున్నారు. మున్ముందు భవిష్యత్ ఈ ఇద్దరిదే అనే అంచనాలు కూడా మొదలయ్యాయి. అసలే బ్రిటన్‌లో చిన్న విజయాలకే హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఇక ముర్రే వింబుల్డన్ గెలిస్తే ఇంకేమైనా ఉందా…? కార్పొరేట్స్ అతని ఇంటి ముందు క్యూ కడుతున్నారు. క్రీడా వ్యాపార కంపెనీల విశ్లేషణ ప్రకారం… ఈ ఏడాది ముగిసే సరికి ముర్రే ఆస్తి రూ.900 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 26 ఏళ్ల ముర్రే కెరీర్‌లో సాధించిన ఆస్తి సుమారు రూ.300 కోట్లు. గత సెప్టెంబరులో యూఎస్ ఓపెన్ గెలిచాక ముర్రే ఆస్తి వంద కోట్ల రూపాయలు పెరిగింది. వింబుల్డన్ విజయంతో మాత్రం ఇక తన సంపాదన రాకెట్ వేగంతో దూసుకుపోనుంది.
వ్యవహారాలు చూసేది భూపతి కంపెనీ
అయితే ఆండీ ముర్రే విజయం అటు ఇంగ్లండ్‌లోనే కాదు… ఇటు భారత్‌లోనూ కొంతమందికి కనకవర్షం కురిపించనుంది. ముర్రే స్పాన్సర్ షిప్ వ్యవహారాలు పర్యవేక్షించేది ఎవరో కాదు… మహేశ్ భూపతికి చెందిన గ్లోబోస్పోర్ట్ సంస్థ. ఇటీవలే ఈ సంస్థ ముర్రేతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘వింబుల్డన్ విజయం తర్వాత ఆసియాలో కొత్త భాగస్వాములతో ఒప్పందాల కార్యక్రమాన్ని భూపతి కంపెనీ చూసుకుంటుంది. సుమారు 10 నుంచి 12 కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం’ అని ముర్రే సన్నిహితుడు ఒకరు తెలిపారు.
నమ్మకమే కారణం
ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ కంటే ఎక్కువగా ముర్రేకు డిమాండ్ ఎందుకు ఏర్పడింది? తాజా గెలుపుతో తాను ‘వన్ స్లామ్ వండర్’ కాదనే విషయాన్ని బ్రిటిష్ స్టార్ నిరూపించాడు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తాననే నమ్మకం కలిగించాడు. ఫెడరర్ కెరీర్ తిరోగమనంలో ఉండటం… నాదల్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో… స్పాన్సర్లు వచ్చే రెండు, మూడేళ్లలో స్థిరంగా ఆడే వారి కోసం వెతుకుతున్నారు. వింబుల్డన్ విజయంతో ముర్రే వచ్చే మూడు నాలుగేళ్లలో టాప్ ప్లేయర్‌గా ఉంటాననే విశ్వాసాన్ని కలిగించాడు.
రాత్రంతా మేలుకొని…
ముర్రే విజయంతో మొత్తం బ్రిటన్ పండగ చేసుకుంటుంటే… అటు స్టార్ ఆటగాడు కూడా తీరిక లేకుండా గడిపాడు. ఆదివారం రాత్రంతా మేలుకొని వరుసగా జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఉదయం నిద్ర లేచాక కూడా ఇంటర్వ్యూల పర్వం కొనసాగింది. ఈ విజయం తన మీద ఉన్న కొండంత బరువును దించిందని ముర్రే భావిస్తున్నాడు. ఇన్నాళ్లూ ‘వింబుల్డన్ విజయం’ వెంటాడుతుండటంతో… ఒత్తిడిలో ఆడాడు. ఇకమీదట పూర్తి స్వేచ్ఛతో ఆడి మరిన్ని టైటిల్స్ గెలిచే అవకాశం ఉంది. వింబుల్డన్ విజయాన్ని కొంతకాలం పాటు ఆస్వాదిస్తానని ముర్రే చెప్పాడు. ‘ఈ వింబుల్డన్ విజయాన్ని నా ఆటతీరును, కెరీర్‌ను మెరుగుపర్చుకునేందుకు స్ప్రింగ్‌బోర్డులా ఉపయోగించుకుంటాను. ఇంకో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుస్తానో లేదో చెప్పలేను. అయితే ఎప్పటిలాగే తీవ్ర సాధన చేస్తాను. ఈ గెలుపును కొంతకాలంపాటు ఆస్వాదిస్తాను. నాలుగైదు రోజులు సెలవు తీసుకుంటాను. కుటుంబసభ్యులతో, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతాను. ఆ తర్వాత యధావిధిగా నా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తాను’ అని ముర్రే తెలిపాడు.
స్థిరంగా ఆడితేనే…
వింబుల్డన్ టైటిల్ నెగ్గినప్పటికీ ముర్రే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అతను రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. ‘నంబర్‌వన్ ర్యాంక్ గురించి అంతగా పట్టించుకోవడంలేదు. ఏడాది పొడవునా స్థిరంగా ఆడటం ముఖ్యం. గత ఏడాది కాలంలో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నెగ్గాను. ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించాను. మరో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఓడిపోయాను. అయినప్పటికీ నేను నంబర్‌వన్ ర్యాంక్‌కు దగ్గరగా లేను. నా లక్ష్యం మాత్రం మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడమే’ అని ముర్రే స్పష్టం చేశాడు.