వాణిజ్య వాహనాల విభాగంలోకి మారుతీ
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తాజాగా వాణిజ్య వాహనాల విభాగంలోకి ప్రవేశించనుంది. టాటా మోటార్స్‌కి చెందిన ఏస్ వాహనానికి పోటీగా తేలికపాటి వాణిజ్య వాహనాన్ని (ఎల్‌సీవీ) తయారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీన్ని రెండేళ్ల వ్యవధిలో మార్కెట్లో ప్రవేశపెట్టగలమని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ తెలిపారు. మాతృసంస్థ సుజుకీ మోటార్స్‌కి చెందిన ‘క్యారీ’ వాహనం ప్లాట్‌ఫాంపై ఈ ఎల్‌సీవీ రూపొందుతుందని ఆయన వివరించారు.
ఇది డీజిల్, సీఎన్‌జీ వేరియంట్లలో లభించగలదని భార్గవ తెలిపారు. 1983లోనే క్యారీని భారత్‌లో ప్రవేశపెట్టాలని మారుతీ భావించింది. ఇందుకోసం ఎం 800 కారుతో పాటు ముందుగానే బుకింగ్స్ కూడా జరిపింది. అయితే, ఎం 800కి 1.21 లక్షల బుకింగ్స్ రాగా, క్యారీకి 2,000 మాత్రమే వచ్చాయి. దీంతో క్యారీని భారత్‌లో ప్రవేశపెట్టే యోచనను మారుతీ విరమించుకుంది. మరోవైపు, అంతకంతకూ క్షీణిం చిన వాహనాల విక్రయాలు.. రానున్న పండుగల సీజన్‌లో మెరుగుపడగలవని భార్గవ చెప్పారు. రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో దిగుమతి వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్లు ఆయన వివరించారు.