వచ్చే ఎన్నికల్లో విజయం మాదే
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ అగ్రనేత అద్వానీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. అవినీతిని అరికట్టడంలో, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడంలో యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ భేటీలో అద్వానీ మాట్లాడారు. ‘‘నిశ్చితంగా చెబుతున్నా.. లోక్‌సభ ఎన్నికల్లో మన పార్టీ గత రికార్డులన్నీ బ్రేక్ చేసే ఫలితాన్ని సాధిస్తుంది’’ అని చెప్పారు.
తాజాగా ఓ పత్రికలో ప్రచురితమైన సర్వేను ఉటంకిస్తూ.. ‘‘సాధారణంగా ఇలాంటి సర్వేలు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటాయి. కానీ ఈసారి ఆ సర్వేలు కూడా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నెగ్గుతుందని చెప్పాయి..’’ అని పేర్కొన్నారు. ఏ రకంగా చూసుకున్నా బీజేపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. యూపీఏ వైఫల్యాలే బీజేపీకి అనుకూలంగా మారనున్నాయన్నారు. తాజా పరిస్థితులను చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరెస్సెస్ ఎప్పుడూ కుల వివక్షను పాటించలేదని, సమాజంలోని అన్ని వర్గాలను సమానంగా చూసిందని చెప్పారు.