Published On: Sun, Jun 1st, 2014

లెజెండ్ ‘రమాప్రభ’కు గుర్తింపేది.. ?

Share This
Tags

ప్రతిభకు పట్టం కట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఆ ప్రతిభావంతులకు కనీస గుర్తింపు ఇస్తే చాలు వారి ఆనందానికి హద్దే ఉండదు. కానీ ఆ చిన్న ఆనందానికి నోచుకోని దిగ్గజ నటీనటులు చాలామందే ఉన్నారు.. అలాంటి వారి గురించి తెలిపే మన ‘లెజెండ్స్’ లో గత శనివారం కైకాల సత్యనారాయణ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ వారం మన లెజెండ్.. ‘రమాప్రభ’. 1400ల సినిమాలు, దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించినా ఇంత వరకూ ఆ ఉత్తమ నటికి ప్రభుత్వ పరంగా వచ్చిన గుర్తింపేమీ లేదు. అంతే కాదు. పరిశ్రమ కూడా ఇలాంటి వారి పట్ల చిన్న చూపుగానే ఉంది.
గుర్తింపులో వెనుకపడిన రమాప్రభ..
ప్రతిభకు పట్టం కట్టే రోజులు కావివి. పైరవీలకు అవార్డులు కట్టబెట్టే రోజులు. ఎవరినైనా ప్రతిభ ను చూసి రావాల్సి పదవులు.. గులాంగిరీ చేసేవారికి వస్తున్నాయి. నటనా రంగంలో డబ్బులిచ్చో, పలుకుబడితోనో డాక్టరేట్లు కొనుక్కునేవాళ్లూ. పదవులు పొందేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఇలాంటి వేటికీ నోచుకోక, అటు ప్రభుత్వాలు, ఇటు పరిశ్రమ గుర్తింపులోనూ వెనకబడే ఉంది మేటి నటి రమాప్రభ. 1400సినిమాలు చేసిన నటి మరొకరు లేరేమో. నిజంగా ఇన్నేళ్లలో అన్ని దక్షిణాది భాషల్లో కలిపి కానీ ఈ విషయంలో కూడా కనీస గుర్తింపుకు నోచుకోలేదు రమాప్రభ. ప్రస్తుతం వయసు మీదపడుతోంది. దీనితో సినిమాల్లో అవకాశాలు లేక, వచ్చినా చేసే ఓపిక లేక మదనపల్లిలో తన సొంత ఇంట్లో ఉంటోందని చెబుతున్నారు.
జీవిత విశేషాలు..
1946 అక్టోబర్ 5న అనంతపురం జిల్లా కదిరిలో జన్మించింది. చిన్న వయసులోనే అనేక కష్టాలు ఎదుర్కొన్న ఆమె, తర్వాత మద్రాస్ వెళ్లి సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంది. సినిమా రంగంలోకి రావడానికి ముందే తమిళ నాటకరంగంలో నాలుగు వేలకు పైగా నాటక ప్రదర్శనలిచ్చిన ప్రతిభాశాలి రమాప్రభ. ఎన్నో సినిమాల్లో అన్ని తరాల నటులతోనూ రమాప్రభ నటించడం విశేషం. రాజబాబు, అల్లు రామలింగయ్యలకు అద్భుతమైన జోడీగా ఎన్నో చిత్రాల్లో హాస్యాన్ని పండించింది. హాస్య నటిగా..క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమాప్రభ ప్రతిభ తెలియని వారు లేరు. కడుపుబ్బా నవ్వించడంలో ఎంత ప్రతిభ చూపుతుందో కన్నీళ్లు పెట్టించడంలోనూ అంతే ప్రతిభ చూపుతుంది. పాత్రకు తగ్గట్గుగా ఆహార్యాన్ని మార్చుకోవడంలో కూడా రమాప్రభ ప్రత్యేకత కనిపిస్తుంది.
ఆమె ఉంటేనే సినిమాకు ప్లస్…
రాజబాబు, అల్లు రామలింగయ్య లతో నటించిన ఆమె పాత్రలు సినిమాకే ప్లస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1970- 80దశకాల్లో రమాప్రభ లేని సినిమా లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఆమె ప్రతిభ ఏ పాటిదో. ఆమె ఉండటం కూడా తమ సినిమాలకు ప్లస్ పాయింట్స్ గా భావించే దర్శకులు చాలామందే ఉన్నారు.
ఆసరాగా ఎవరూ లేరు..
నటుడు శరత్ బాబును పెళ్లి చేసుకుని అన్ని విధాలుగా నష్టపోయానని చెప్పుకునే ఆమెకు ఆసరాగా ఇప్పుడెవరూ లేరు. ఈ మధ్య కాలంలో కూడా ఈ తరం వారి మనసు దోచిన బామ్మగా నటించింది. ముఖ్యంగా దేశముదురు, అదుర్స్ లాంటి సినిమాలు చూస్తే నేటి తరానికి కూడా ఆమెలోని నటి తెలుస్తుంది. మరి ఇలాంటి నటిని అటు ప్రభుత్వాలు, ఇటు పరిశ్రమ పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరమైన విషయం.
చేయూతనిస్తున్న నాగ్…
ప్రభుత్వ, పరిశ్రమ గుర్తింపు కు దూరంగా ఉన్న రమాప్రభకు, హీరో నాగార్జున ఆర్థిక సాయం చేస్తూ ఆమెకు నెలనెలా జీవన భృతి పంపుతున్నాడు. ఈ విషయంలో నాగార్జునను మనస్ఫూర్తిగా మెచ్చుకోకుండా ఉండలేం. అయితే ఇన్ని సినిమాలు చేసిన ఆమెకు ప్రభుత్వ పరంగా ఇప్పటికైనా ఓ గుర్తింపు వస్తే చాలా ఆనందిస్తుంది. ఈ విషయంలో ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలని ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులూ కోరుతున్నారు.

About the Author