Published On: Wed, Apr 16th, 2014

రేసు గుర్రం రివ్యూ ….

Share This
Tags

ఓపెన్ చేస్తే వరంగల్.. తనికెళ్ళ భరణికి ఇద్దరు కుమారులు, వాళ్ళే రామ్(కిక్ శ్యామ్) – లక్ష్మణ్ అలియాస్ లక్కీ (అల్లు అర్జున్). వీరిద్దరికీ చిన్నప్పటి నుంచి అస్సలు పడదు. పెద్దయ్యాక ఫ్యామిలీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది. అలాగే రామ్ ఎసిపి అవుతాడు. లక్కీ మాత్రం బేవర్స్ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు.
హైదరాబాద్ లో పేరు మోసిన రౌడీ షీటర్ అయిన మద్దిలి శివారెడ్డి(రవి కిషన్) ఎమ్మెల్యే కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ శివారెడ్డి నేరాలను నిరూపించి ఎమ్మెల్యే అవ్వకూడదని ట్రై చేస్తుంటాడు. దాంతో శివారెడ్డి అతన్ని చంపేస్తాడు. దాంతో ఆ కేసు రామ్ చేతికి వెళుతుంది.
ఇదే తరుణంలో లక్కీ స్పందనని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి లక్కీ – స్పందన ఒకటవుతారు. అది చూసిన రామ్ వాళ్ళని విడగొట్టాలని అనుకుంటాడు. దాంతో రామ్ – లక్కీ మధ్య పెద్ద గొడవ అవుతుంది. అప్పుడే లక్కీ కి ఒక నిజం తెలుస్తుంది. అదే శివారెడ్డి రామ్ ని చంపాలనుకునటున్నాడని.. అక్కడి నుండి లక్కీ తన అన్నని కాపాడుకోవడానికి ఏమేమి ప్లాన్ చేసాడు? అందులో భాగంగా కిల్ బిల్ పాండే(బ్రహ్మానందం)ని ఎలా వాడుకున్నారు? అన్నదే మీరు వెండితెరపై చూడాల్సిన మిగిలిన కథాంశం
ప్లస్ పాయింట్స్ :
రేసు గుర్రం సినిమాకి అల్లు అర్జున్ హీరో అవ్వడం మొదటి ప్లస్ పాయింట్. డైరెక్టర్ రాసుకున్న కథకి అతని వందకి వంద శాతం న్యాయం చేసాడు. ఈ సినిమాలో అతను చూపించిన మానరిజం, డైలాగ్ డెలివరీ ఇంతకముందు సినిమాల్లో చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో బన్ని వాడే ‘దేవుడా…’. అనే ఊతపదం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అలాగే బన్ని నుంచి అభిమానులు ఆశించే డాన్సులు అన్ని పాటల్లోనూ వేయకపోయినా ‘సినిమా చూపిస్తా మామ’, ‘డౌన్ డౌన్ డుప్ప’ పాటల్లో మాత్రం స్టెప్స్ బాగా వేసాడు.
అల్లు అర్జున్ తర్వాత ఈ సినిమాకి చెప్పుకోవాల్సిన మరో హీరో ఉన్నాడు, అతనే కామెడీ కింగ్ బ్రహ్మానందం. హీరో అని ఎందుకు అన్నానంటే బ్రహ్మానందం లేకపోతే సెకండాఫ్ లేదు. అతనే సెకండాఫ్ కి ప్రాణం పోసి, తన భుజాల మీద వేసుకొని సినిమాని నడిపించాడు. అలాగే తను ఉన్నంత సేపు ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూ ఉంటారు. ఇక హీరోయిన్ శృతి హాసన్.. స్పందన పాత్రలో శృతి గ్లామర్ తో పాటు, పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. ముఖ్యంగా ఏమడిగినా ఇన్నర్ గా ఫీలవుతా అనే ఎపిసోడ్స్ లో బాగా చేసింది. అలాగే ఎన్నడూ లేనతంగా శృతి కూడా బన్నితో పాటు స్టెప్పులు వేసి మంచి డాన్సర్ అనిపించుకుంది.
బన్నికి అన్నగా చేసిన శ్యామ్ ‘కిక్’ తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. అన్నదమ్ములుగా అల్లు అర్జున్ – శ్యామ్ బాగా సెట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ ఉన్నంతలో తన నటనతో ప్రేక్షకులను నవ్వించాడు. విలన్ పాత్ర పోషించిన రవి ప్రకాష్ కూడా మంచి నటనని కనబరిచాడు. సలోని అతిధి పాత్రలో మెప్పించింది. ఎంఎస్ నారాయణ, పోసాని కృష్ణమురళి కూడా బాగా నవ్వించారు.
ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులు బాగా నవ్వుకోవడానికి కామెడీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇంటర్వల్ ఎపిసోడ్, బ్రహ్మానందం వచ్చిన తర్వాత వచ్చే చివరి 30 నిమిషాలు సినిమాకి హైలైట్ అని చెప్పాలి. సెకండాఫ్ లో వచ్చే ఓ ట్విస్ట్ బాగుంటుంది, అలాగే అన్ని పాటలని బాగా స్టైలిష్ గా షూట్ చేసారు.
మైనస్ పాయింట్స్ :
మొదటి మైనస్ పాయింట్ అంటే ఈ సినిమా కథ ఎందుకంటే అది చాలా పాతది. ఇలాంటి కాన్సెప్ట్ చాలా సినిమాల్లోనే చూసాం కానీ ఇందులో స్క్రీన్ ప్లేతో కాస్త కొత్తగా ప్రెజెంట్ చేద్దాం అనుకోని ట్రై చేసారు. కావున కొద్ది సేపటి తర్వాత సినిమాలో నెక్స్ట్ ఏమి జరుగుతుందా అనేది మనం ఊహించేయవచ్చు.
ఇకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ ని అల్లు అర్జున్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడం కోసం బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ మొదటి 30 నిమిషాలు స్లోగా ఉంటుంది. ఓవరాల్ గా కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ ని ట్రిమ్ చేస్తే బాగుంటుంది. పాటలు చూడటానికి బాగున్నప్పటికీ సెకండాఫ్ లో వచ్చే ఒక్క పాట కూడా సందర్భానుసారంగా కాకుండా పాటలు ఉండాలి అన్న కాన్సెప్ట్ ప్రకారం వచ్చినట్టు ఉంటుంది. ముఖేష్ ఋషి, ప్రకాష్ రాజ్ లాంటి పాత్రలకి సరైన ముగింపు లేదు. అలాగే ‘కిక్’ నుంచి కంటిన్యూ చేసిన ఆలీ పాత్ర పెద్దగా నవ్వించలేకపోయింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో మేజర్ హైలైట్ అంటే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ. సినిమా లుక్ మొత్తం చాలా స్టైలిష్ గా, విజువల్స్ అన్ని చాలా గ్రాండ్ గా ఉంటాయి. అలాగే నటీనటులందరినీ చాలా బాగా చూపించాడు. ఎడిటర్ కొన్ని బోరింగ్ విషయాలను, సాగదీసినట్టు ఉంది అన్న సీన్స్ ని కత్తిరించి పారేసి ఉంటే సినిమాకి ఇంకాస్త హెల్ప్ అయ్యేది. డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. థమన్ అందించిన పాటలు పెద్ద సక్సెస్ అయ్యాయి అలాగే విజువల్ గా కూడా చూడటానికి చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టే ఉంది.
వక్కంతం వంశీ అందించిన కథ పాతదే అయినా దానికి ఇప్పటి కమర్షియల్ హంగులను అద్ది బాగానే రాసుకున్నాడు. సురేందర్ రెడ్డి టేకింగ్ ఎప్పటిలానే చాలా స్టైలిష్ గా ఉంది. కామెడీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన సురేందర్ రెడ్డి బలమైన ట్విస్ట్ లకి, హీరోయిజం ఎలిమెంట్స్ కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా తెలుగు ఆడియన్స్ కి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఇవ్వడంలో మాత్రం సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. నల్లమలపు బుజ్జి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

About the Author