Published On: Fri, Dec 6th, 2013

రివ్యూ : ప్రేమ ఇష్క్ కాదల్

Share This
Tags

తెలుగుతెరపై ఎన్ని ప్రేమకథలు వచ్చినా…దర్శకులు దీని చుట్టూనే పరిభ్రమిస్తుంటారు. తెలుగు సినిమాకు ప్రేమకున్న అనుబంధం అలాంటింది మరి. ఏదో ఓ దశలో ప్రేక్షకుడు ప్రేమలో మునిగే ఉంటాడు. అందుకే ప్రేమకథల్ని ప్రేక్షకులు అంతగా ప్రేమిస్తారు. ప్రేమకథాచిత్రాల్ని అంతగా ఆదరిస్తారు. దర్శకులకు ప్రేమలో ఏదో ఓ కొత్త కోణం కనిపిస్తూనే ఉంటుంది. దర్శకుడు పవన్ సాదినేని సైతం ప్రేమలో మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశానని చెప్పాడు. ప్రేమ..ఇష్క్..కాదల్ మూడింటికీ అర్థం ఒక్కటే. అయినా ఇలా టైటిల్ ఎందుకు పెట్టారంటే…తెర మీదే చూడాలంటున్నాడు. యూత్ ని టార్గెట్ చేసినా…అన్ని వర్గాల్ని మెప్పించే చిత్రమని నిర్మాత బెక్కం వేణుగోపాల్ చెప్పాడు. మూడు జంటల ప్రేమకథగా తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మరి ప్రేమసాగరంలో ప్రేక్షకుల్ని ఓలలాడించాడా లేదా తెలుసుకోవాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
కథ
మొదటి జంట – రణధీర్ అలియాస్ రాండీ (హర్షవర్థన్ రానే) గిటారిస్ట్. తన సొంత కాఫీషాప్ లోనే సరదాగా పాటలు పాడుతుంటాడు. అతన్ని ప్రేమిస్తుంటుంది సరయు (వితిక షేరు).
రెండో జంట – రాజు(విష్ణువర్ధన్) ఎర్రబస్సెక్కి…హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన స్నేహితుడి దగ్గర దిగుతాడు. తన స్నేహితుడి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగంలో చేరుతాడు. అనుకోకుండా పరిచయమౌతుంది సమీర (రీతూ వర్మ) ఫ్యాషన్ డిజైనర్. రాజు పనిచేసే సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్.
ఇక మూడో జంట – అర్జున్ (హరీష్) రేడియో జాకీ. అమ్మాయిలతో జాలీగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఏ అమ్మాయినైనా ఇట్టే పడేయగలననే ధీమా. స్నేహితురాలి ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శాంతి (శ్రీ ముఖి) పరిచయమౌతుంది. ఆమెను ముగ్గులోకి దింపే ప్రయత్నం చేస్తుంటాడు.
ఇదీ మూడు జంటల ఇంట్రడక్షన్. ఒకరికొకరికి సంబంధముండని ఈ మూడు జంటల లైఫ్ ఓ కాఫీ షాప్ లో జరుగుతుంటుంది. అసలు వీరి ప్రేమలు ఎలా మొదలయ్యాయి. ప్రేమికులుగా మారిన తర్వాత వీరి జీవితంలో జరిగిన సంఘటనలేంటి. ప్రేమలు పెళ్లి పీటల దాకా వెళ్లాయా లేదా అనే విషయాలు మాత్రం తెరమీదే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మొట్ట మొదటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే నటీనటుల పెర్ఫార్మన్స్. అందరూ చాలా బాగా చేసారు. నటీనటుల్లో మొదటగా చెప్పాల్సింది.. రాయల్ రాజు పాత్ర చేసిన విష్ణు గురించి.. విష్ణు మూవీలో మాస్ లుక్ లో కనిపిస్తూ, పల్లెటూరి యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేసాడు. డైరెక్టర్ అనుకున్న మాస్ పాత్రకి 100% న్యాయం చేసాడు. ఇతని పాత్ర బి, సి సెంటర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది. సరైన పాత్రలు పడితే విషుని మంచి యాక్టర్ గా పెరుతెచ్చుకుంటాడు. హర్షవర్ధన్ రాణే రాక్ స్టార్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. అతను చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ప్లే బాయ్ పాత్రకి హరీష్ వర్మ పూర్తి న్యాయం చేసాడు.
ఇక హీరోయిన్స్ లో రీతు వర్మ మోడరన్ గర్ల్ గా చూడటానికి ఎంత బాగుందో, అలాగే డైరెక్టర్ అనుకున్న పాత్రకి కూడా న్యాయం చేసింది. వితిక షేరు మంచి నటనని కనబరిచింది. శ్రీ ముఖి ఓకే అనేలా ఉంది. సెకండాఫ్ లో అర్జున్ – శాంతి మధ్యలో వచ్చే ట్విస్ట్ బాగుంది. ఇక మిల్లినియం స్టార్ మహానామగా కనిపించిన సత్యం రాజేష్ మంచి కామెడీని పండించి ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అలాగే రాండీ ఫ్రెండ్ గా సినిమాలో అతనితో పాటు ట్రావెల్ అయిన జబర్దస్త్ జోష్ రవి కూడా బాగా నవ్వించాడు.
క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగుంది. మూడు జంటల లవ్ స్టొరీలకి క్లైమాక్స్ లో ఇచ్చిన జస్టిఫికేషన్ చాలా బాగుంది. ఈ సినిమాలోని పాటలు ఎంత హిట్ అయ్యాయో అంతకన్నా విజువల్స్, లోకేషన్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :
మన నిజజీవితంలో కనిపించే ప్రేమ కథలనే కాస్త డిఫరెంట్ గా ప్రెజెంట్ చెయ్యాలనుకున్న డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లేని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాడు. కానీ సెకండాఫ్ ని మాత్రం రొటీన్ గా చేసేసాడు. సెకండాఫ్ లో వేగం కాస్త తగ్గిపోవడమే కాకుండా మూడు లవ్ ట్రాక్స్ లో వచ్చే సీన్స్ ఏమిమీ జరుగుతుందా అనేది ఆడియన్స్ ఊహించేలా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది.
సినిమా నిడివి 2 గంటలా 18 నిమిషాలు కావడం వల్ల చాలా చోట్ల సాగదీస్తున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇదే కాన్సెప్ట్ ని డైరెక్టర్ నిడివి తగ్గించి తీసుంటే ఇంకా బాగుండేది. అలాగే డైరెక్టర్ ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకొని ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. అలాగే డైరెక్టర్ ముందు నుంచే మల్టీ ప్లేక్స్ సినిమా అనుకోని తీసినట్టున్నాడు. అందుకే బి సి సెంటర్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ని పెద్దగా టచ్ చెయ్యలేదు.

సమీక్ష

సినిమా ప్రారంభంలోనే మూడు జంటల పరిచయాన్ని విభిన్నంగా పాటల రూపంలో ప్రజెంట్ చేశాడు దర్శకుడు. మూడు జంటల ప్రేమ కథ ఓ కాఫీ షాప్ లోనే జరిగేలా కథ రాసుకొని తన టాలెంట్ చూపించాడు దర్శకుడు. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ సినిమా తీసే విషయంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. సినిమా మూడ్ కు తగ్గట్టుగా కెమెరా, పాటలుండడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. లైటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మూడు జంటలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ప్రేమకథలు తెరకెక్కించడం ఎంత సులువో. ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించడం అంతే కష్టం. మూడు జంటల ప్రేమ కథలు ఈ మధ్య కాలంలో ఎక్కవే అయ్యాయి. కొత్తవాళ్లతో తక్కువ బడ్జెట్ తో సినిమా అనగానే నయా దర్శకులు ఎంచుకుంటున్న కథలు ఇలాంటివే మరి. అయితే దర్శకుడు పవన్ సాదినేని రెగ్యులర్ సినిమాల్లా కాకుండా మూడు ప్రేమ కథలకు సంబంధం లేకుండా స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. తన ప్రయత్నానికి మెచ్చుకోవాలి. ఎటొచ్చీ… సన్నివేశాల పరంగానే దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ప్రేమికుల్ని కలిపేందుకు ఎంచుకున్న కారణాలు బాగానే ఉన్నా…విడగొట్టేందుకు మాత్రం సిల్లీ రీజన్స్ రాసుకున్నాడు. ఆ కారణాలు కన్విన్సింగ్ గా ఉండవు. అమ్మాయిలు అబ్బాయిలను వాడుకొని వదిలేస్తారు అనే పాయింట్ చుట్టూనే కథ అల్లుకున్నాడు. మూడు కథల్లోనూ అదే థీమ్ అప్లై చేశాడు. కథలో మెచూరిటీ లేదు. పరిపూర్ణత లేదు. ఇలాంటివి షార్ట్ ఫిలింస్ వరకు బాగానే ఉంటాయి. అక్కడ నిడివి తక్కువ కాబట్టి. ఫీచర్ ఫిల్మ్ విషయానికి వచ్చినప్పుడు రెండున్నర గంటల్లో చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ దర్శకుడు ఫీచర్ ఫిల్మ్ స్థాయిలో కథను రాసుకోలేకపోయాడు. ఎంటర్ టైన్ మిస్ చేసి చాలా లాస్ అయ్యాడు. ఇలాంటి యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రాల్లో విచ్చలవిడిగా కామెడీ పెట్టుకోవచ్చు. మిలీనియం మహానామా గా సత్యం రాజేష్ ట్రాక్ బాగుంది. కొద్దిసేపు నవ్వించగలిగాడు. రాజు పాత్ర ద్వారా కొంతవరకు నవ్వించాడు.

About the Author