Published On: Sun, Jul 28th, 2013

రాష్ట్రాన్ని విభజించొద్దు

Share This
Tags

రాష్ట్ర విభజన దిశగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నట్టు చెబుతున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీల బృందం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరింది. రాష్ట్ర విభజన అనివార్యమని ప్రస్ఫుటమైన సంకేతాలు వెలువడుతుండటంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తరపున కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లంరాజు, చిరంజీవి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు శనివారం ఇక్కడ మన్మోహన్‌ను కలిసి 40 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రాన్ని విడగొడితే ఆంధ్రతో పాటు తెలంగాణ కూడా నష్టపోవడమే గాకుండా కొత్త సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ ఆయనకు విజ్ఞాపన పత్రం సమర్పించారు. తెలంగాణపై మాత్రమే నిర్ణయం తీసుకోవడానికి బదులు దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రాష్ట్రాల డిమాండ్లన్నింటినీ ఏక కాలంలో పరిశీలించి పరిష్కరించేందుకు రెండో ఎస్సార్సీ వేయాలని సూచించారు. విభజనతో ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ ప్రధానికి నివేదిక సమర్పించారు.

విభజిస్తే కోస్తా, రాయలసీమ ప్రజల ఆగ్రహాన్ని కాంగ్రెస్ చవిచూడక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని వారు తేల్చి చెప్పినట్టు తెలిసింది. వారి వాదనను సోనియాగాంధీకి తెలియజేస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్టు సమాచారం. అనంతరం సీమాంధ్ర మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని ప్రధానిని అభ్యర్థించామన్నారు. ఏ రాష్ట్ర విభజనకైనా సహేతుకమైన, శాస్త్రీయబద్ధ ప్రాతిపదిక ఉండాలని కావూరి, పల్లంరాజు అన్నారు.

అనంతతో ఆజాద్ చర్చలు

రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాయలసీమ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు ఆజాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణతో కలపడమే సమస్యకు పరిష్కారమని గట్టిగా విశ్వసిస్తున్న ఆయన, శనివారం అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామరెడ్డిని ప్రత్యేకంగా తన నివాసానికి పిలిపించుకొని చర్చలు జరిపారు. కర్నూలు, అనంతపురం కాంగ్రెస్ నేతలు కొందరు రాయల తెలంగాణ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించే అవకాశమున్నా అది సరైన పరిష్కారం కాదని ఆయనకు అనంత చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలన్నారు. మరోవైపు దిగ్విజయ్‌సింగ్‌తో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం భేటీ అయ్యారు. అదే సమయానికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రుల బృందం కూడా దిగ్విజయ్‌ని కలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరింది.

About the Author