Published On: Sat, Dec 6th, 2014

రాజకీయాల్లో విలువలు సాధ్యమేనా..?

Share This
Tags

పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలదీ ఒకే తీరు. అన్నీ ఆ తానులో ముక్కలే. ఫిరాయింపుల విషయంలో కొత్త భాష్యాలు చెప్పటంలో ఎవరికి వారు ముందుంటున్నారు. మొత్తానికి అధికారం కేంద్రంగా, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా సాగుతున్న ఈ గేమ్ లో నిన్నటి బాధితులు నేటి విజేతలు. నేటి బాధితులు నిన్నటి విజేతలు. అంతిమంగా అందరిదీ అదే సూత్రం. అదే మార్గం. గోడదూకే నీతిలో అందరిదీ ఒకే రీతి. అసెంబ్లీ లో జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి.
గవర్నర్ కు ఫిర్యాదు..
పార్టీ ఫిరాయింపుల పర్వం తెలంగాణా అసెంబ్లీని కుదిపివేస్తోంది. తమ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన ఈ అంశాన్ని కాంగ్రెస్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. వరుస సస్పెన్షన్ లతో ఏకంగా గవర్నర్ కే ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టి. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. టీ.ఆర్.ఎస్. దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని గవర్నర్ ను కోరారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడంటూ ఏకంగా సీఎం కెసీఆర్ ను పదవికి అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తులు కూడా చేశారు.
ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతోందా..?
టిఆర్ఎస్ ధాటికి కాంగ్రెస్ శ్రేణులు చెల్లాచెదురవుతున్నాయి. ఇది నిజం. తెలంగాన కాంగ్రెస్ కేసీఆర్ వ్యూహాలకు దిక్కుతోచని స్థితిలో పడుతోంది. ఒక్కొక్కరుగా వదిలిపోతున్న నేతలను కట్టడి చేయలేక, టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను ఎదుర్కోలేక నానా ఇబ్బందులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో చిట్టచివరికి పార్టీ ఫిరాయింపుల చట్టం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. పార్టీ ఫిరాయింపులో విషయంలో గతంలోనే శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్, గోడ దూకిన ఎమ్మెల్యేల పై కూడా అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఫిరాయింపులను సీఎం ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అది రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌ను ఉల్లంఘించడమే అవుతుందని అంటోంది. ఆపరేషన్‌ ఆకర్ష్ తో టీఆర్‌ఎస్‌ దడపుట్టిస్తుంటే అదే అంశాన్ని ఆయుధంగా మలుచుకోవాలని చూస్తోంది. మరి, ఈ ఎపిసోడ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. వైఎస్ సిఎంగా ఉన్నప్పుడు ఇదే విధానంతో ప్రతిపక్షాలను ఖాళీ చేసిన కాంగ్రెస్, ఇప్పుడదే తమదాకా వచ్చే సరికి విలవిల్లాడుతోంది. ఆఖరి అస్త్రంగా ఫిరాయింపుల చట్టాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
రాజకీయాల్లో విలువలు సాధ్యమేనా..?
ఎన్నికయింది ఓ పార్టీ టికెట్ పై. గెలిచిన తర్వాత మరో పార్టీలోకి దూకటం. ఇది ఎంత వరకు కరెక్టు..? దీనికి కారణాలేంటి? నిజమే…!! ఒక పార్టీ టిక్కెట్టుపై ఎన్నికయిన వారిని మరో పార్టీలోకి తీసుకోవడం అంటే ఒక రకంగా అది దొంగతనమే. మరొకరి సొత్తును అపహరించడమే. కాదనలేం. కానీ అదే బాటలో నడుస్తున్న అన్ని పార్టీలు నేను చేస్తే ఒప్పు నువ్వు చేస్తే తప్పు అన్నట్టు వ్యవహరిస్తున్నాయి.
గతంలో ఎన్నికలకు ముందుగానో లేదా ఎన్నికలైన తర్వాత కొద్ది కాలమో ఈ ఫిరాయింపులుండేవి. కానీ, ఇప్పుడు పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేసుకోవటం లేదా, అవతలి వారిని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఆకర్షణ మంత్రాలు ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఎరవేసే తాయిలాలు ఫిరాయింపులకు కారణం అవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీకే నష్టం..
తెలంగాణా రాష్ట్రంలో ఫిరాయింపులకు ఎక్కువ నష్టపోయింది టీడీపీనే. తెలంగాణలో ఈ రాష్ట్రానికి భవిష్యత్తులేదనే టీఆర్ఎస్ ప్రచారంవల్ల కావచ్చు లేదంటే, వర్తమానంలో కనిపిస్తున్న ఇరకాటం వల్లా కావచ్చు మొత్తానికి చాలా మంది నేతలు టీడీపీకి రాం రాం చెప్పి గులాబీ గుంపులో చేరారు. ఈ బాటలో ఇంకా మరింత మంది ఉన్నారనే వాదనలున్నాయి. అయితే, అటు తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటూ కూడా పార్టీని కాపాడుకోలేని స్థితి కాంగ్రెస్ పార్టీది. కానీ, టిఆర్ఎస్ పార్టీ విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అంటోంది. గతంలో వైఎస్ హయాంలో తమ పార్టీ ప్రతినిధులను చేర్చుకున్న అంశాన్ని ప్రస్తావిస్తోంది. అప్పుడు తప్పు కానిది ఇప్పుడు తప్పెందుకు అవుతోందని ప్రశ్నిస్తోంది.
కేవలం స్వార్ధ ప్రయోజనాలకోసం విలువలకు తిలోదకాలిచ్చే నేతలను ఏం చేయాలి? పదవులే ధ్యేయంగా పార్టీలు మారే నేతల్ని ఏం చేయాలి? రాత్రికి రాత్రి కండువాలు మారుస్తూ, ఎన్నుకున్న ప్రజల్ని మభ్య పెట్టే నేతల్ని ఏం చేయాలి?
వామపక్షాలు మినహా అన్ని పార్టీలది ఫిరాయింపులపై ఇదే తీరు. నైతిక విలువలకు తావు లేకుండా, వివిధ పార్టీలు సాగిస్తున్న ఈ ఉల్లంఘనలకు అంతెక్కడ? చట్టంలో ఏ మార్పులు వీరిని అడ్డుకోవాలి? ప్రజాసేవను విస్మరించి ప్రజాప్రతినిధులు సాగిస్తున్న ఈ జంపింగ్ లను కంట్రోల్ చేయటం ఎలా? పార్టీలు మారటం తప్పు కాదు. కానీ, బెల్లం చుట్టూ ఈగల్లాగా అధికారం చుట్టూ పరిభ్రమిస్తున్న నేతల్ని అదుపులో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి అన్ని పార్టీలూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

About the Author