యధేచ్చగా ‘కార్పొరేట్’ ల ప్రజా దోపిడి…
నిబంధనలను అడ్డంగా ఉల్లంఘనలకు పాల్పడడం కార్పొరేట్ కు పరిపాటిగా మారింది. ప్రజా ఆస్తులను దోచుకోవడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే విధానం ముంబయి మెట్రో ప్రాజెక్టు మరోసారి కళ్లముందుంచింది. అరకొర వసతులతో ఇటీవలే ఆరంభమైంది. ఇదే సమయంలో మెట్రో రైల్ ఛార్జీలను రిలయెన్స్ సంస్థ అడ్డగోలుగా పెంచింది. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్‌కు మాట మాత్రమైనా చెప్పకుండా నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా ఛార్జీల మోత ప్రజలపై వేసింది.
‘ముంబయ్ మెట్రో రైలు’లో రిలయెన్సు దోపిడి…
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముంబయి మెట్రో ప్రాజెక్టును ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఓ కారిడార్ రూట్‌లో మాత్రమే రైళ్లు నడిపిస్తున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు చేపట్టడానికి సమయం పడుతుంది. సేవలు ప్రారంభించిన తొలి నెలలోనే రిలయెన్స్ ఎనర్జీ, ముంబయి మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ప్రయాణీకులకు షాకిచ్చాయి. టికెట్ ధరలు పెంచుతూ ముంబయి మెట్రో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. మెట్రో ప్రాజెక్టులో కేంద్రం రూ. 650 కోట్లు పెట్టుబడి పెట్టింది. ముంబయి మెట్రో పాలిటీన్ రీజియన్ డెవలప్‌మెంట్‌కు 26శాతం వాటా ఉంది. రిలయెన్స్ ఎనర్జీ, ముంబయి మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్‌లు మెజార్టీ వాటా ఉన్నా ఇది నగర ప్రజలు అవసరాలు తీర్చడానికి చేపట్టిన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలోని ప్రాజెక్టు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు.. మెట్రో భాగస్వామ్య సంస్థలతో కూడిన ఫిక్సింగ్ కమిటీ ఛార్జీలను ముందుగానే నిర్ణయించింది. ప్రతి నాలుగు సంవత్సరాలకు 11శాతం పెంచడానికి ఈ కమిటీ ఆమోదించింది. అయినా రిలయెన్స్ నేతృత్వంలోని మెట్రో ఈ నిబంధనకు ఉల్లంఘించి అడ్డంగా జనాలపై ఛార్జీల భారం పెంచింది.
నిర్లక్ష్యంలో ప్రభుత్వాలు…
ఒప్పందాలను ఉల్లంఘించి ప్రజలపై భారం పెంచుతున్నారని ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ కోర్టును ఆశ్రయించింది. కాలుష్య రహిత ప్రయాణంతో పాటు ప్రజలకు తక్కువ ఛార్జీతో రవాణా సదుపాయాలు అందించాలన్న లక్ష్యానికి మెట్రో ప్రాజెక్టు తూట్లు పొడుస్తుందని ముంబయి వాసులు వాదిస్తున్నారు. దీనిపై ముంబయి హైకోర్టులో కేసు నడుస్తోంది. రేపు తీర్పు రానుంది. నిబంధనలను కూడా పట్టించుకోకుండా ఛార్జీలు పెంచిన రిలయెన్స్ పై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలు తప్పుబడతున్నారు. అసలు ఇలాంటి ప్రాజెక్టులు ప్రభుత్వమే 100శాతం నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సలహాలతో బలం చేకూరేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ప్రజా ప్రయోజనాలను గుర్తించాలి..
ఇది కేవలం ముంబయి నగరానికి పరిమితం కాక హైదరాబాద్, జైపూర్‌సహా పలు నగరాల్లోకి వెళ్లింది. ఇదే విధానంలో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న మెట్రో ప్రాజెక్టుల్లో కూడా భవిష్యత్తులో ఇవే సమస్యలు తలెత్తడం ఖాయమనే వాదనలు వస్తున్నాయి. లాభాల గురించి తప్ప ప్రజల అవసరాలు ఏమాత్రం పట్టని కార్పొరేట్ కంపెనీలకు ఇలాంటి ప్రాజెక్టులు కట్టబెడితే జనాలకు భారమే తప్ప ప్రయోజనాలు అందించలేవని కేంద్రం ఇప్పటికైనా గుర్తించాలని అందరూ కోరుతున్నారు.