మోడీ దూకుడుకు కళ్లెం!
పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ దూకుడుకు కళ్లెం పడనుంది. ఎన్నికల కమిటీల నియామకాల్లో సొంత నిర్ణయాలకు అవకాశం లేకుండా పార్టీ అధినాయకత్వం చెక్ పెట్టింది. దీని వెనక సంఘ్ ప్రమేయం ఉన్నట్టు వరుస పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మోడీకి ఎన్నికల ప్రచార సారథి బాధ్యతలు కట్టబెట్టడాన్ని పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాస్త అలక వహించి పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేసినప్పటికీ తరువాత ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో వెనక్కీ తీసుకున్నారు. అయితే పార్టీలో తన ఆధిపత్యం కోల్పోకుండా నిలుపుకొనేందుకు వ్యూహాలకు పదును పెట్టారు. గత శుక్రవారం నాగ్‌పూర్ వెళ్లిన అద్వానీ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసి మోడీ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది.
ఎన్నికల కమిటీ నియామకాల్లో మోడీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకూడదని వాదించినట్టు సమాచారం. అలాగే ఆ మర్నాడు రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీ కూడా భగవత్‌ను కలిశారు. ఇలా అగ్రనేతలంతా సంఘ్ ప్రధాన కార్యాలయానికి క్యూ కట్టడం వెనుక అసలు కారణం ‘మోడీ’కి దూకుడుకు కళ్లెం వేయడానికేనని వినికిడి. కాగా, సోమవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాజకీయ, సంస్థాగత కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను మోడీ, రాజ్‌నాథ్‌లు కలిసి పూర్తి చేయాలని నిర్ణయించినట్టు పార్టీ నేత అనంత్‌కుమార్ వెల్లడించారు. అయితే ఆ కమిటీల ఏర్పాటులో పార్టీ సీనియర్ నేతల సూచనలు, సలహాలు తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కమిటీల్లో మోడీ ప్రాభవానికి కొంతమేర గండి పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.