Published On: Sun, Mar 31st, 2013

మెరిసేదెవరో!

Share This
Tags

ఐపీఎల్‌లో 9 జట్లున్నా… ప్రధానంగా క్రేజ్ ఉన్న జట్లు మూడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్… ఈ మూడు జట్లకూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సచిన్, ధోని, గేల్ లాంటి ఆటగాళ్లు దీనికి ఓ కారణమైతే… పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన జట్లు కావడం మరో కారణం. ఈ మూడింటిలో ఫలితాల పరంగా చెన్నై ఒక్కటే రెండు సార్లు గెలిచింది. ముంబై, బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. అయినా అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉండేది ఈ మూడు జట్లపైనే. మరి ఈ సారి ఏ స్టార్ జట్టు మెరుస్తుందో చూడాలి.

ముంబై ఇండియన్స్
కెప్టెన్ : రికీ పాంటింగ్ కోచ్ : జాన్ రైట్
ఓనర్స్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ హోమ్‌గ్రౌండ్ : ముంబై (వాంఖడే)
ఖరీదైన ఆటగాడు : రోహిత్ శర్మ (2 మిలియన్ డాలర్లు) ఉత్తమ ప్రదర్శన: రన్నరప్ (2010)

కీలక ఆటగాళ్లు : సచిన్, పొలార్డ్, హర్భజన్, మలింగ, మ్యాక్స్‌వెల్, కార్తీక్
మొత్తం తుది జట్టులో 11 మందీ అంతర్జాతీయ ఆటగాళ్లను ఆడించగల సత్తా ఉన్న జట్టు ముంబై. ఈ జట్టులో కావలసినంత మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. తుది జట్టలో ఉండే ఆటగాళ్లలో అంబటి తిరుపతి రాయుడు మినహా దాదాపు అందరూ అంతర్జాతీయ క్రికెట్‌లో నిరూపించుకున్నవారే. సహజంగానే ముంబై అంటే ముందు గుర్తొచ్చేది సచిన్.

ప్రతి సీజన్‌లోనూ మాస్టర్ వ్యక్తిగతంగా రాణిస్తున్నా… ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదనే బాధ జట్టుకు ఉంది. ఈ సీజన్‌కి పాంటింగ్‌ను కెప్టెన్‌గా నియమించుకున్నారు. మరి ‘పంటర్’ లక్ ఈ జట్టుకు కలిసొస్తుందేమో చూడాలి.

రాయుడు, సచిన్, రోహిత్, దినేశ్ కార్తీక్, పొలార్డ్ ఇలా ప్రత్యర్థులు భయపడే లైనప్ ఉన్నా… ఇంకా భారీ మొత్తం వెచ్చించి మ్యాక్స్‌వెల్‌ను తీసుకున్నారు. బౌలింగ్‌లో మలింగ ప్రధాన ఆయుధం. హర్భజన్, ప్రజ్ఞాన్ ఓజా, మునాఫ్ పటేల్ దేశీ స్టార్ బౌలర్లు. మొత్తం మీద ఆట పరంగా ఈ జట్టుకు ఎలాంటి ఢోకా లేకుండా కావలసినంత మంది ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లంతా సమష్టిగా రాణించడంతో పాటు కొద్దిగా అదృష్టం కలిసొస్తే ఈ సారి కల నెరవేర్చుకోవచ్చు. ఇక మద్దతు బృందం కూడా స్టార్లతో నిండి ఉంది. కోచ్ జాన్‌రైట్, బౌలింగ్ కోచ్ షాన్ పొలాక్, ఫీల్డింగ్ కోచ్ జాంటీరోడ్స్, మెంటర్‌గా కుంబ్లే.. సహాయక కోచ్‌గా రాబిన్ సింగ్… ఇలా అందరూ స్టార్లే.

చెన్నై సూపర్ కింగ్స్
కెప్టెన్ : మహేంద్ర సింగ్ ధోని కోచ్ : స్టీఫెన్ ఫ్లెమింగ్
ఓనర్స్ : శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్ హోమ్‌గ్రౌండ్ : చెన్నై
ఖరీదైన ఆటగాడు : ధోని (3 మిలియన్ డాలర్లు)
కీలక ఆటగాళ్లు : రైనా, అశ్విన్, రవీంద్ర జడేజా, విజయ్, డు ప్లెసిస్, ఆల్బీ మోర్కెల్,
ఉత్తమ ప్రదర్శన : విజేత (2010, 2011), రన్నరప్ (2008, 2012)

ఐపీఎల్‌లో మెజారిటీ అభిమానుల ఫేవరెట్ జట్టు చెన్నై. ధోని లక్ ప్రతిసారీ ఈ జట్టును గెలిపిస్తుందేమో. కచ్చితంగా క్వాలిఫయర్ దశకు చేరుతుందనే నమ్మకం ఉన్న జట్టు. ఈ జట్టుకు ప్రధాన బలం… ఏడుగురు దేశీ ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెటర్లను ఆడించుకునే సౌకర్యం. విజయ్, రైనా, ధోని, జడేజా, అశ్విన్, బద్రీనాథ్, వృద్ధిమాన్ సాహా ఇలా అందరూ పేరున్న క్రికెటర్లే. ఇక అంతర్జాతీయ ఆటగాళ్ల విభాగంలోనూ అందరూ స్టార్లే. ఆల్బీ మోర్కెల్, డ్వేన్ బ్రేవో రూపంలో ప్రతి మ్యాచ్‌లోనూ ఆడే ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉన్నారు.

దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్ డు ప్లెసిస్ కూడా ఈ జట్టులోనే ఉన్నా… ప్రస్తుతం గాయంతో ఉన్నాడు. అయితే మైక్ హస్సీ లాంటి హిట్టర్ డు ప్లెసిస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. ఇక హిల్ఫెన్హాస్, నేన్స్ రూపంలో ఇద్దరు నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు. చెన్నై వికెట్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. దీనికితోడు మిగిలిన జట్లు చెన్నైలో జరిగే మ్యాచ్‌ల్లో శ్రీలంక ఆటగాళ్లను ఆడించే అవకాశం లేదు. ఒకరకంగా ఇది చెన్నైకి కాస్త మేలు చేసే అంశమే. మొత్తం సీజన్‌లో కనీసం ఇద్దరు ఆటగాళ్లు తమ నిలకడైన ఫామ్‌తో మ్యాచ్‌లు గెలిపిస్తున్నారు. ఫామ్ పరంగా ఇబ్బందులెదురైతే ధోని కెప్టెన్సీ మ్యాజిక్ ఉండనే ఉంది.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్
కెప్టెన్ : విరాట్ కోహ్లి కోచ్ : రే జెన్నింగ్స్
ఓనర్స్ : విజయ్ మాల్యా హోమ్‌గ్రౌండ్ : బెంగళూరు
ఖరీదైన ఆటగాడు : క్రిస్ గేల్ (2 మిలియన్ డాలర్లు) ఉత్తమ ప్రదర్శన : రన్నరప్ (2009, 2011)

కీలక ఆటగాళ్లు : డివిలియర్స్, మురళీధరన్, దిల్షాన్, జహీర్, పుజారా.
పూర్తిగా వ్యక్తుల ప్రదర్శన మీద ఆధారపడిన జట్టుగా బెంగళూరుకు పేరు. తొలి మూడు సీజన్లతో పోలిస్తే తర్వాత స్టార్ల జాబితా తగ్గింది. అయితే క్రిస్ గేల్, విరాట్ కోహ్లిల మీదే ఈ జట్టు పూర్తిగా ఆధారపడింది.

గత రెండు సీజన్లలో గేల్ మెరుపులతో నెట్టుకొచ్చినా… టైటిల్ మాత్రం ఇంకా కలగానే మిగిలి ఉంది. దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్ డివిలియర్స్ ఫామ్‌లో ఉండటం ఈ జట్టుకు పెద్ద సానుకూలాంశం. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన వెటోరీ… జట్టు కూర్పులో తుది జట్టులో ఉండటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి కోహ్లికి పగ్గాలు అప్పగించారు. భవిష్యత్‌లో భారత జట్టు సారథ్య బాధ్యతలు ఆశిస్తున్న కోహ్లికి… తన సత్తా నిరూపించుకోవడానికి ఇదో పెద్ద అవకాశం. బ్యాటింగ్‌లో దిల్షాన్‌తో పాటు సౌరవ్ తివారీ కీలకం.

బౌలింగ్ విభాగంలో వినయ్ కుమార్, మిథున్ లాంటి లోకల్ స్టార్స్‌తో పాటు జహీర్ ఖాన్, మురళీధరన్ కీలకం. అయితే జహీర్ ఫిట్‌నెస్‌పై ఇంకా డైలమా కొనసాగుతోంది. క్రిస్టియాన్, హెన్రిక్స్ రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. తాజాగా రవి రామ్‌పాల్, ఆర్పీ సింగ్‌లను కూడా ఈ జట్టు తీసుకుంది. ఏమైనా గేల్, కోహ్లి, డివిలియర్స్‌ల రాణింపుపైనే ఈ జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. టెస్టుల్లో విశేషంగా రాణిస్తున్న పుజారా ఈ జట్టులో ఉన్నా… ప్రస్తుతం గాయంతో ఉన్నాడు. దేశవాళీ బ్యాట్స్‌మెన్ ఎక్కువగా లేకపోవడం ఈ జట్టు బలహీనత.

About the Author